T20 WC Ind Vs Pak: Brad Hogg Questions About No Ball Given By Umpire In Last Over - Sakshi
Sakshi News home page

Brad Hogg: భారత్-పాక్ మ్యాచ్.. 'నో బాల్‌'పై వివాదం.. బౌల్డ్ అయినా రన్స్ ఎలా తీస్తారు?

Published Sun, Oct 23 2022 7:10 PM | Last Updated on Wed, Oct 26 2022 4:46 PM

IND Vs PAK Match Why was noball not reviewed Brad Hogg Tweets - Sakshi

చివరి బంతి వరకు నరాలు తెగే ఉత్కంఠ రేకెత్తిచ్చిన టీ20 ప్రపంచకప్‌ మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై భారత్ అద్భుత విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే మ్యాచ్‌ చివరి ఓవర్లో పాక్‌ బౌలర్ మహ్మద్ నవాజ్ వేసిన బంతిని అంపైర్లు 'నో బాల్‌'గా ప్రకటించడంపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆఖరి ఓవర్ నాలుగో బంతిని నవాజ్ ఫుల్ టాస్ వేయగా కోహ్లి దాన్ని సిక్సర్‌గా మలిచాడు. నడుము ఎత్తులో వచ్చిన ఈ బంతిని అంపైర్లు నో బాల్‌గా ప్రకటించారు. వెంటనే పాకిస్థాన్ టీం సభ్యులంతా అంపైర్లతో వాదించారు. అయినా వాళ్లు నిర్ణయాన్ని మార్చుకోలేదు.

నో బాల్ తర్వాత ఫ్రీ హిట్‌గా వచ్చిన బంతికి కోహ్లి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. వికెట్లను గిరాటేసిన బంతి బౌండరీ వైపు దూసుకెళ్లడంతో కోహ్లి- దినేశ్ కార్తీక్ మూడు పరుగులు తీశారు. ఫ్రీ హిట్ అయినందున బ్యాటర్ బౌల్డ్ అయినా ఔట్ ఉండదనే నిబంధనను కోహ్లి చక్కగా వినియోగించున్నాడు. ఈ బంతితోనే మ్యాచ్ భారత్ చేతిలోకి వచ్చింది. చివరి రెండు బంతులకు రెండు పరుగులే అవసరమయ్యాయి.

అయితే ఈ నోబాల్ వ్యవహారంపై ఆసీస్ మాజీ క్రికెటర్‌ బ్రాడ్ హాగ్ ట్విట్టర్‌లో కొన్ని ప్రశ్నలు లేవనెత్తాడు. నడుము ఎత్తులో వచ్చిన బంతిని అంపైర్లు రివ్యూ తీసుకోకుండానే నో బాల్‌గా ఎలా ప్రకటించారని అడిగాడు. ఫ్రీ హిట్‌ బాల్‌కు  కోహ్లి బౌల్డ్ అయినప్పుడు.. దాన్ని డెడ్ బాల్‍గా ఎందుకు ప్రకటించలేదు? అని ప్రశ్నించాడు.

ఈ నో బాల్ వ్యవహారంపై సోషల్ మీడియాలో భిన్న స్పందనలు వస్తున్నాయి. బంతి బ్యాటర్ నడుము ఎత్తుకు పైకి వస్తేనే నో బాల్‌ అని కొందరు అంటున్నారు. అంతిమ నిర్ణయం అంపైర్లదే అని, దానికి ఇరు జట్లు కట్టుబడి ఉండాలని మరికొందరు అంటున్నారు. మరికొందరేమో కోహ్లి దాదాపు క్రీజు బయట ఉన్నాడు.. అలాంటప్పుడు బంతి నడుము ఎత్తుపైకి వచ్చినా నో బాల్ కాదు అని పేర్కొన్నారు.

ఏది ఏమైనా ఈ మ్యాచ్‌లో భారత్‌ చివరి బంతి వరకు అద్భుత పోరాటపటిమ ప్రదర్శించి ఘన విజయం సాధించింది. ముఖ్యంగా కింగ్ కోహ్లి తన కెరీర్‌లోనే బెస్ట్ ఇన్నింగ్స్ ఆడి భారత్‌కు ఒంటిచేత్తో విజయాన్ని అందించాడు. మ్యాచ్ అనంతరం భావోద్వేగానికి లోనై కన్నీరు పెట్టుకున్నాడు. ఈ మ్యాచ్ తనకు చిరకాలం గుర్తుండిపోతుందని చెప్పాడు.
చదవండి: ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన విరాట్‌ కోహ్లి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement