
విరాట్ కోహ్లితో షాదాబ్ ఖాన్ (పాత ఫొటో)
Shadab Khan Reminds Teammates Of This BIG Challenge: క్రికెట్ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న వన్డే వరల్డ్‌కప్-2023 టోర్నీకి సమయం దగ్గర పడుతోంది. భారత్ వేదికగా అక్టోబరు 5 న ఈ మెగా ఈవెంట్‌కు తెరలేవనుంది. ఇక ఐసీసీ టోర్నీలో హాట్ ఫేవరెట్ మ్యాచ్ అయిన టీమిండియా- పాకిస్తాన్‌ల మధ్య పోరుకు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదిక కానుంది.
దాయాదుల మధ్య అక్టోబరు 14న మ్యాచ్ నిర్వహించనన్నట్లు ఐసీసీ రివైజ్ షెడ్యూల్‌లో పేర్కొంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇరుజట్ల బలాబలాలు, గెలుపు అవకాశాలపై క్రికెట్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇక సొంతగడ్డపై మ్యాచ్ జరుగనుండటం టీమిండియాకు అదనపు బలంగా మారగా.. పాకిస్తాన్ ఆల్‌రౌండర్ షాదాబ్ ఖాన్ ఈ విషయం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
మానసికంగా సిద్ధంగా ఉండాలి
‘‘ఇండియాలో ప్రేక్షకుల నుంచి మనకు ఎలాంటి మద్దతు లభించదు. కాబట్టి పాకిస్తాన్ ఆటగాళ్లంతా మానసికంగా మరింత బలవంతులుగా మారాలి. మనం మెంటల్‌గా ఎంత స్ట్రాంగ్‌గా ఉంటే.. అంత తేలికగా అనుకున్న ఫలితాలు రాబట్టగలం’’ అని 24 ఏళ్ల షాదాబ్ ఖాన్ పాక్ ఆటగాళ్లను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు.
అదే విధంగా.. ‘‘టీమిండియాపై విజయం సాధించడంతో పాటు ఇండియాలో వరల్డ్‌కప్ గెలిస్తే అంతకంటే గొప్ప విషయం ఏదీ ఉండదు. నిజానికి ప్రతి జట్టు టైటిల్ గెలవడమే లక్ష్యంగా బరిలోకి దిగుతుంది. అయితే, మనకు ఎలాంటి ఆరంభం లభించింది.. ఎలా ముందుకు సాగుతున్నామన్న విషయంపైనే అంతా ఆధారపడి ఉంటుంది. ప్రతి జట్టుతో ప్రతి మ్యాచ్ కూడా కీలకమే’’ అని షాదాబ్ వ్యాఖ్యానించాడు.
కాగా రెండేళ్ల క్రితం టీ20 ప్రపంచకప్‌లో భాగంగా దుబాయ్‌లో టీమిండియాను పది వికెట్ల తేడాతో ఓడించిన జట్టులో షాదాబ్ సభ్యుడు. ఇదిలా ఉంటే.. ప్రపంచకప్ కంటే ముందు చిరకాల ప్రత్యర్థులు టీమిండియా- పాకిస్తాన్ సెప్టెంబరు 2న శ్రీలంక వేదికగా ఆసియా వన్డే కప్ టోర్నీలో తలపడనున్నాయి. ఇందుకు సంబంధించి పాకిస్తాన్ ఇప్పటికే జట్టును ప్రకటించింది.
చదవండి: Ind Vs WI: భారీ రికార్డుపై కన్నేసిన చహల్.. అదే జరిగితే