
శ్రేయస్ అయ్యర్ (PC: BCCI/Star Sports)
Asia Cup 2023- India Vs Pakistan: సుదీర్ఘ విరామం తర్వాత తిరిగి జట్టుతో చేరాడు టీమిండియా బ్యాటర్ శ్రేయస్ అయ్యర్. ఆసియా కప్-2023లో తమ ఆరంభ మ్యాచ్ సందర్భంగా పునరాగమనం చేశాడు. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో పోరుతో రీఎంట్రీకి సిద్ధమయ్యాడు. ఈ నేపథ్యంలో శ్రీలంకలోని క్యాండీలో గల పల్లెకెలె మైదానంలో దాయాదుల పోరు ఆరంభానికి ముందు అయ్యర్ మాట్లాడాడు.
అస్సలు ఊహించలేదు
తాను ఆసియా కప్ టోర్నీ ఆడతానని అస్సలు ఊహించలేదంటూ భావోద్వేగానికి లోనయ్యాడు. కాగా స్వదేశంలో ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ నాలుగో టెస్టు సందర్భంగా అయ్యర్‌కు వెన్నునొప్పి తిరగబెట్టింది. ఈ క్రమంలో మ్యాచ్ మధ్యలోనే నిష్క్రమించిన ఈ మిడిలార్డర్ బ్యాటర్‌కు నొప్పి తీవ్రతరం కావడంతో పూర్తి విశ్రాంతినిచ్చారు.
అయినప్పటికీ ఫలితం లేకపోవడంతో శస్త్ర చికిత్స చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక సర్జరీ పూర్తైన అనంతరం బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో శ్రేయస్ అయ్యర్ పునరావాసం పొందాడు. అక్కడే నిపుణుల పర్యవేక్షణలో కసరత్తులు ఆరంభించి.. క్రమక్రమంగా ఫిట్‌నెస్ సాధించాడు.
రాత్రంతా నిద్రపట్టనే లేదు
ఆసియా కప్ ఈవెంట్‌కు ముందు ప్రాక్టీస్ మ్యాచ్‌లలో అదరగొట్టి మెగా టోర్నీ జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఈ విషయాలను గుర్తు చేసుకున్న అయ్యర్.. ‘‘పూర్తిగా కోలుకోవడానికి చాలా సమయమే పట్టింది.
సెలక్షన్‌కు వారం ముందు నిర్వహించిన ఫిట్‌నెస్ పరీక్షలో పాసయ్యాను. అది నాకెంతో సంతోషాన్నిచ్చింది. నిజానికి నిన్న రాత్రంతా నాకు నిద్రపట్టలేదు. పాకిస్తాన్‌తో మ్యాచ్ ఆడటానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా.
నంబర్ 1 జట్టుతో ఢీ
ప్రస్తుతం వాళ్లు నంబర్ 1 జట్టుగా ఉన్నారు. వారితో పోటీ మరింత ఉత్సాహాన్నిస్తుంది కదా! ఇక.. హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ సర్, రోహిత్ శర్మ కెప్టెన్సీలో జట్టు రోజురోజుకూ మా జట్టు పురోగతి సాధిస్తోంది. డ్రెస్సింగ్‌రూంలో వాతావరణం చాలా బాగుంటుంది.
ఈ మ్యాచ్‌లో పరిస్థితులకు తగ్గట్టుగా బ్యాటింగ్ చేస్తూ.. ఆఫ్రిది, నసీం, రవూఫ్‌లను ఎదుర్కొంటాం’’ అని చెప్పుకొచ్చాడు. ఇన్నాళ్ల తర్వాత జట్టులోకి రావడం నిజంగా చాలా చాలా సంతోషంగా ఉందంటూ శ్రేయస్ అయ్యర్ హర్షం వ్యక్తం చేశాడు.
కాగా పాక్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో అయ్యర్ కేవలం 14 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.
చదవండి: Ind Vs Pak: షమీకి నో ఛాన్స్.. అందుకే ముందు బ్యాటింగ్: రోహిత్ శర్మ
Comments
Please login to add a commentAdd a comment