
రిషభ్ పంత్- సూర్యకుమార్ యాదవ్(PC: BCCI)
India VS West Indies T20 Series: ఇటీవలి కాలంలో టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్‌లో చోటు చేసుకుంటున్న మార్పులపై భారత మాజీ వికెట్ కీపర్ పార్థివ్ పటేల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లికి తుది జట్టులోకి స్థానం కల్పించే క్రమంలోనే వివిధ రకాల కాంబినేషన్లు ట్రై చేస్తున్నారన్నాడు. వివిధ సిరీస్‌లలో వేర్వేరు ఆటగాళ్లతో ముందుకు వస్తున్నారని పేర్కొన్నాడు. కాగా ‘రన్‌మెషీన్’ కోహ్లి గత కొంతకాలంగా నిలకడలేమి ఫామ్‌తో ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలో అతడిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు.. ఐపీఎల్ అనుభవంతో టీ20 ఫార్మాట్‌లో యువ ఆటగాళ్లు అద్భుతంగా రాణిస్తున్నారు. మరోవైపు.. హార్దిక్ పాండ్యా ఆల్‌రౌండ్ షోతో అదరగొడుతున్నాడు. వెటరన్ బ్యాటర్ దినేశ్ కార్తిక్ అద్భుతమైన ఫినిషింగ్ టచ్‌తో జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు.
మొన్న పంత్.. ఇప్పుడు సూర్య!
ఈ నేపథ్యంలో పొట్టి ఫార్మాట్ జట్టులో కోహ్లి స్థానం ఏమిటన్న దానిపై క్రీడా వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. టీ20 ప్రపంచకప్-2022 టోర్నీ సమీపిస్తున్న తరుణంలో బీసీసీఐ సైతం పలు ప్రయోగాలు చేస్తోంది. మెగా ఈవెంట్‌కు పంపాల్సిన జట్టు గురించి కసరత్తులు చేస్తోంది.
ఈ క్రమంలో ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్.. వెస్టిండీస్‌తో మొదటి టీ20 మ్యాచ్‌లో బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పులు క్రికెట్ విశ్లేషకుల దృష్టిని ఆకర్షించింది. ఇంగ్లండ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి రిషభ్ పంత్ ఓపెనర్(ఆఖరి రెండు మ్యాచ్‌లు)గా రాగా.. విండీస్‌తో తొలి టీ20లో సూర్యకుమార్ యాదవ్ బరిలోకి దిగాడు. శ్రేయస్ అయ్యర్ మూడు, పంత్ నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చారు.
విరాట్ కోహ్లి(PC: Virat Kohli Twitter)
అందుకే ఇలా చేస్తున్నారు!
ఈ నేపథ్యంలో పార్థివ్ పటేల్ మాట్లాడుతూ.. ‘‘తుది జట్టులో విరాట్ కోహ్లికి స్థానం కల్పించేందుకే బ్యాటింగ్ ఆర్డర్‌లో ఇన్ని మార్పులు చోటుచేసుకుంటున్నాయి. నిజానికి వెస్టిండీస్‌తో కోహ్లి వన్డే సిరీస్ ఆడాల్సింది.
ఎందుకంటే ఆ ఫార్మాట్‌లో కోహ్లి మెరుగ్గా రాణించగలడు. సులువుగా మునుపటి ఫామ్ అందుకునే అవకాశం ఉండేది. 50 ఓవర్ల ఆట కాబట్టి చాలా సమయం ఉంటుంది. ఒక్కసారి నిలదొక్కుకుంటే.. శిఖర్ ధావన్ లేదంటే శుబ్‌మన్ గిల్‌లాగా 70- 80 పరుగులు రాబట్టే అవకాశం ఉంటుంది’’ అని పేర్కొన్నాడు.
ఇక విండీస్‌తో టీ20 సిరీస్ మొత్తం సూర్య.. రోహిత్‌తో పాటు ఓపెనర్‌గా దిగే అవకాశం ఉందని మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ పార్థివ్ పటేల్ అభిప్రాయపడ్డాడు. కాగా తొలి టీ20లో సూర్యకుమార్ యాదవ్ 16 బంతుల్లో 24 పరుగులు చేయగా.. పంత్ 12 బంతుల్లో 14 పరుగులు సాధించాడు. ఇక మొదటి మ్యాచ్‌లో రోహిత్ సేన 68 పరుగులతో విజయం సాధించింది.
చదవండి: Dinesh Karthik: ఇలాంటి షాట్లు డీకేకు మాత్రమే సొంతం..
Rohit Sharma: అద్భుతంగా ముగించాం..! మేము చాలా హర్ట్ అయ్యాం! అయినా ఇది ఆరంభమే!
Comments
Please login to add a commentAdd a comment