టీమిండియాకు ఎంపిక కావడం పట్ల ఆంధ్ర క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి హర్షం వ్యక్తం చేశాడు. ‘‘భారత జట్టుకు ఎంపికైనందుకు ఆనందంగా ఉంది. అయితే నా స్వప్నం 50 శాతమే సాకారమైంది.
నేను టీమిండియా జెర్సీ వేసుకొని మైదానంలో దిగి సెంచరీతో జట్టును గెలిపించినపుడే నా పూర్తి కల నెరవేరుతుంది’’ అని ఈ విశాఖపట్నం కుర్రాడు అన్నాడు.
‘‘నా కెరీర్‌ను తీర్చిదిద్దేందుకు నాన్న నా కోసం ఎన్నో త్యాగాలు చేశాడు. ఇప్పుడు ఆయన కళ్లలో ఆనందం చూస్తుంటే ఇదే కదా ఆయన లక్ష్యమని గర్వంగా ఉంది’’ అని హర్షం వ్యక్తం చేశాడు. కాగా ఆంధ్ర క్రికెట్ జట్టు ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి టీమిండియా జెర్సీ ధరించేందుకు సిద్ధమైన సంగతి తెలిసిందే.
ఈ సీజన్ ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) తరఫున చెలరేగిన అతను ‘ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద సీజన్ 2024’ అవార్డు కూడా అందుకున్నాడు. ముఖ్యంగా ఈ ఐపీఎల్ అసాంతం నితీశ్ కనబరిచిన నిలకడ, కచ్చితత్వంతో కూడిన షాట్లు, మెరిపించిన మెరుపులు భారత సెలక్టర్లను ఆకట్టుకున్నాయి. దీంతో సీనియర్లు విశ్రాంతి తీసుకుంటున్న జింబాబ్వే పర్యటన కోసం అతన్ని భారత జట్టులోకి ఎంపిక చేశారు.
శుబ్‌మన్ గిల్ సారథ్యంలోని ఈ జట్టులో రియాన్ పరాగ్, అభిషేక్ శర్మ, తుషార్ దేశ్‌పాండేలాంటి పలు కొత్తముఖాలకు తొలిసారి చోటు కల్పించింది. ప్రస్తుతం రెగ్యులర్ టీమిండియా జట్టు వెస్టిండీస్‌లో జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో తదుపరి సూపర్–8 దశ మ్యాచ్‌ల్ని ఆడుతోంది. ఈ మెగా టోర్నీలో ముందుగా రోహిత్ బృందం అమెరికాలోనే మొత్తం లీగ్ మ్యాచ్‌ల్ని ఆడింది.
ఇక ఈ టోర్నీ ముగిసిన వెంటనే జూలై 6 నుంచి జింబాబ్వే టూర్‌లో ద్వైపాక్షిక సిరీస్ మొదలవుతుంది. పూర్తిగా టి20 ఫార్మాట్‌కే పరిమితమైన ఈ పర్యటనలో భారత జట్టు జూలై 6, 7, 10, 13, 14వ తేదీల్లో హరారే వేదికగా ఐదు మ్యాచ్‌లు ఆడుతుంది. మెగా టోర్నీ కోసం ఎంపికైన యశస్వి జైస్వాల్, సంజూ సామ్సన్‌లు ఇద్దరే జింబాబ్వే పర్యటనకు కొనసాగుతున్నారు. స్టాండ్‌బైలుగా ఉన్న గిల్, రింకూ సింగ్, ఖలీల్, అవేశ్ ఖాన్‌లకు చోటిచ్చారు.
సీనియర్ స్టార్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, హార్దిక్ పాండ్యా, బుమ్రా, రవీంద్ర జడేజా, చహల్, సిరాజ్‌లతో పాటు శివమ్ దూబే, అర్ష్‌దీప్, కుల్దీప్ యాదవ్ లకు కూడా విశ్రాంతినివ్వడం ఆశ్చర్యకరం. బహుశా సీనియర్ సెలక్షన్ కమిటీ దృష్టి అంతా 2026 టీ20 ప్రపంచకప్‌పైనే ఉండటం వల్ల పూర్తిస్థాయిలో రిజర్వ్ బెంచ్‌కే అవకాశం ఇచ్చినట్లు కనిపిస్తోంది.
భారత టీ20 జట్టు: శుబ్‌మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ, రింకూ సింగ్, సంజూ సామ్సన్, ధ్రువ్ జురెల్, నితీశ్ కుమార్ రెడ్డి, రియాన్ పరాగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అవేశ్ ఖాన్, ఖలీల్ అహ్మద్, ముకేశ్ కుమార్, తుషార్ దేశ్‌పాండే.
Comments
Please login to add a commentAdd a comment