![Ind W Vs Aus W Only Test: Unbeaten 102 Run Stand Deepti Shama Pooja India Lead - Sakshi](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2023/12/22/indwvsausw.jpg.webp?itok=26fJaVGZ)
102 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన పూజ- దీప్తి (PC: BCCI)
ఆస్ట్రేలియాతో టెస్టులో భారత మహిళా క్రికెట్ జట్టు రెండో రోజు కూడా ఆధిపత్యం కనబరిచింది. ఓపెనర్ స్మృతి మంధానకు తోడు రిచా ఘోష్, జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ(70- నాటౌట్) అర్ధ శతకాలతో చెలరేగడంతో ఆసీస్‌పై పైచేయి సాధించింది. శుక్రవారం నాటి ఆట ముగిసే సరికి ఏడు వికెట్ల నష్టానికి 376 పరుగులు చేసింది.
కాగా ముంబై వేదికగా ఆస్ట్రేలియా మహిళా జట్టుతో భారత వుమెన్ టీమ్ ఏకైక టెస్టులో తలపడుతోంది. వాంఖడే స్టేడియంలో గురువారం మొదలైన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆసీస్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, భారత బౌలర్ పూజా వస్త్రాకర్ నాలుగు వికెట్లతో చెలరేగి ప్రత్యర్థి బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించింది.
కీలక వికెట్లు పడగొట్టి ఆసీస్‌ను కోలుకోలేని దెబ్బకొట్టింది. ఇతర బౌలర్లలో స్నేహ్ రాణా మూడు, ఆల్‌రౌండర్ దీప్తి శర్మ రెండు వికెట్లు తీశారు. ఈ క్రమంలో ఆసీస్ మహిళా జట్టు 219 పరుగులకే తొలి ఇన్నింగ్స్ ముగించింది. ఈ నేపథ్యంలో తొలి రోజే ఆసీస్‌ను ఆలౌట్ చేసిన భారత్.. ఆట ముగిసే సరికి వికెట్ నష్టానికి 98 పరుగులు చేసింది.
ఈ క్రమంలో రెండో రోజు ఆటలో భాగంగా ఓపెనర్ స్మృతి మంధాన 74 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటైంది. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన రిచా ఘోష్ 52 పరుగులతో రాణించగా.. జెమీమా రోడ్రిగ్స్ 73 పరుగులతో అదరగొట్టింది.
అయితే, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ మాత్రం పూర్తిగా నిరాశపరిచింది. గార్డ్‌నర్ బౌలింగ్‌లో డకౌట్‌గా వెనుదిరిగింది. యస్తికా భాటియా సైతం ఒక్క పరుగుకే పెవిలియన్ చేరింది. ఈ క్రమంలో ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యత తీసుకున్న దీప్తి శర్మ ఓపికగా ఆడుతూ స్కోరు బోర్డును ముందుకు నడిపింది.
శుక్రవారం నాటి ఆట ముగిసే సరికి 147 బంతుల్లో 9 ఫోర్ల సాయంతో 70 పరుగులతో అజేయంగా నిలిచింది. ఆమెకు తోడుగా పూజా వస్త్రాకర్ సైతం 33 పరుగులతో క్రీజులో ఉంది. వీరిద్దరు కలిసి 102 పరుగుల అజేయ భాగస్వామ్యంతో భారత్ 157 పరుగుల ఆధిక్యం సాధించింది.
ఇదిలా ఉంటే.. ఆసీస్ బౌలర్లలో స్పిన్నర్ ఆష్లీ గార్డ్‌నర్‌కు అత్యధికంగా నాలుగు వికెట్లు దక్కగా.. కిమ్‌గార్త్ ఒకటి, జెస్ జొనాసెన్ ఒక వికెట్ పడగొట్టారు. కిమ్ గార్త్, గార్డ్‌నర్ కలిసి స్మృతి మంధానను రనౌట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment