
వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ 2024 టోర్నీలో ఇండియా ఛాంపియన్స్ వరుసగా మూడో ఓటమి చవిచూసింది. బుధవారం నార్తాంప్టన్ వేదికగా దక్షిణాఫ్రికా ఛాంపియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 54 పరుగుల తేడాతో ఇండియా ఓటమి పాలైంది.
210 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 156 పరుగులకే పరిమితమైంది. భారత బ్యాటర్లలో యూసఫ్ పఠాన్, ఇర్ఫాన్ పఠాన్ ఆఖరిలో మెరుపులు మెరిపించినప్పటకి జట్టును మాత్రం గెలిపించలేకపోయారు.
యూసఫ్ పఠాన్(44 బంతుల్లో54, 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), ఇర్ఫాన్(21 బంతుల్లో 35, 4 ఫోర్లు, ఒక సిక్స్) పోరాడనప్పటకి అప్పటికే మ్యాచ్ భారత్ చేదాటిపోయింది. కెప్టెన్ యువరాజ్ సింగ్(5) మరోసారి ఫెయిల్ అయ్యాడు.
దక్షిణాఫ్రికా బౌలర్లలో ఫిలిండర్ రెండు వికెట్లు పడగొట్టగా.. చార్ల్ లాంగెవెల్డ్ట్, తహీర్,స్నైమెన్ తలా వికెట్ సాధించారు. అంతకముందు బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 210 పరుగుల భారీ స్కోర్ సాధించింది.
సఫారీ బ్యాటర్లలో స్నైమెన్(73) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. లివీ(25 బంతుల్లో 60, 5 ఫోర్లు, 5 సిక్స్‌లు) మెరుపులు మెరిపించాడు. భారత బౌలర్లలో హర్భజన్ సింగ్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. కులకర్ణి, వినయ్‌కుమార్, యూసఫ్ తలా వికెట్ సాధించారు.
సెమీస్‌లో భారత్..
ఇక ఈ మ్యాచ్‌లో ఓటమి పాలైనప్పటికి సెమీఫైనల్లో భారత్ అడుగుపెట్టింది. పాయింట్ల పట్టకలో నాలుగో స్ధానంలో భారత్ నిలిచి సెమీస్ బెర్త్‌ను ఖారారు చేసుకుంది. ఈ టోర్నీలో చెరో రెండు విజయాలు సాధించిన భారత్, దక్షిణాఫ్రికా జట్లు పాయింట్ల పరంగా సమంగా నిలిచాయి.
అయితే దక్షిణాఫ్రికా(-1.340) రన్‌రేట్ కంటే భారత్(-1.267)రన్‌రేట్ మెరుగ్గా ఉండడంతో సెమీస్‌కు యువీ సేన ఆర్హత సాధించింది. జూలై 12న నార్తాంప్టన్ వేదికగా ఆస్ట్రేలియా ఛాంపియన్స్ భారత్ తలపడనుంది.
Comments
Please login to add a commentAdd a comment