
టీమిండియా అభిమానుల గుండె పగిలింది. ముచ్చటగా మూడో సారి వరల్డ్‌కప్ ట్రోఫీని ముద్దాడాలన్న భారత జట్టు ఆశలు అడియాశలయ్యాయి. టోర్నీ ఆరంభం నుంచి వరుస విజయాలతో అదరగొట్టిన భారత జట్టు.. కీలకమైన ఫైనల్లో చేతులేత్తేసింది. అహ్మదాబాద్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్లో 6 వికెట్ల తేడాతో భారత్ ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్, బౌలింగ్‌లో విఫలమైన రోహిత్ సేన.. కంగూరులకు వరల్డ్‌కప్‌ను అప్పగించేసింది.
241 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ 43 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. దీంతో ఆరోసారి ఆస్ట్రేలియా వరల్డ్ ఛాంపియన్స్‌గా నిలిచింది. ఆసీస్ విశ్వవిజేతగా నిలవడంలో ఆ జట్టు ఓపెనర్ ట్రావిస్ హెడ్ కీలక పాత్ర పోషించాడు. ట్రావిస్ హెడ్ అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. 118 బంతులు ఎదుర్కొన్న హెడ్ 14 ఫోర్లు, 4 సిక్స్‌లతో 137 పరుగులు చేశాడు. అతడితో పాటు మార్నస్ లబుషేన్(57) హాఫ్ సెంచరీతో రాణించాడు.అంతకుముందు బ్యాటింగ్ చేసిన భారత్ 240 పరుగులకు ఆలౌట్ అయింది. ఇక ఫైనల్లో ఓటమిపై మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. బ్యాటింగ్‌లో విఫలమకావడంతో ఓటమి పాలైమని రోహిత్ తెలిపాడు.
"ఫైనల్ మ్యాచ్‌లో ఓడి పోవడం చాలా బాధగా ఉంది. ఫలితం మేము ఆశించిన విధంగా రాలేదు. ఈ మ్యాచ్‌లో మేము మా స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. మేము టార్గెట్‌ను డిఫెండ్ చేయడానికి అన్ని విధాల ప్రయత్నించాం. కానీ లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయాం. మరో 20-30 పరుగులు చేసి ఉంటే బాగుండేది. రాహుల్, కోహ్లి మంచి భాగస్వామ్యం నెలకొల్పారు. ఆ సమయంలో 270 నుంచి 280 స్కోర్ వస్తాదని మేము అనుకున్నాం.
కానీ మేము వరుస క్రమంలో వికెట్లు కోల్పోయాం. 240 వంటి స్వల్ప లక్ష్యాన్ని డిఫెండ్ చేయాలంటే ఆరంభంలో వికెట్లు తీయాలని నిర్ణయించుకున్నాం. మేము అనుకున్న విధంగా మూడు వికెట్లు సాధించాం. కానీ హెడ్, లబుషేన్ భారీ భాగస్వామ్యం నెలకొల్పి మ్యాచ్‌ను మా నుంచి దూరం చేశారు.
కచ్చితంగా వారిద్దరికి క్రెడిట్ ఇవ్వాలి. ఫ్లడ్ లైట్స్‌లో బ్యాటింగ్ చేయడానికి పిచ్ కొంచెం మెరుగ్గా ఉంది. అయితే దీనిని సాకుగా చెప్పాలనుకోవడం లేదు. మేము ప్రత్యర్ధి ముందు మంచి టార్గెట్‌ను ఉంచలేకపోయాం. ఏదైమనప్పటికీ ఆస్ట్రేలియా మంచి ప్రదర్శన కనబరిచింది" పోస్ట్ మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో రోహిత్ శర్మ పేర్కొన్నాడు.
చదవండి: World Cup 2023 Final Viral Videos: వరల్డ్‌కప్‌లో ఓటమి.. కనీళ్లు పెట్టుకున్న విరాట్ కోహ్లి! వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment