ఓవల్ టెస్టు రసకందాయంలో పడింది. భారత్, ఇంగ్లండ్ జట్లను విజయం ఊరిస్తోంది. టీమిండియా గెలవాలంటే మన బౌలర్లు చివరి రోజు పది వికెట్లు తీయాల్సిందే. ఇంగ్లండ్ విజయానికి మరో 291 పరుగుల దూరంలో ఉంది. టెస్టులో చివరి రోజు 250కు పైగా పరుగులు చేయాలంటే ఏ జట్టుకైనా కష్ట సాధ్యమే. ఈ నేపథ్యంలో నాలుగో టెస్టు ఆఖరి రోజు ఆట ఎన్ని మలుపులు తిరుగుతుందో, విజయం ఎవరివైపు మొగ్గుతుందో ఆసక్తికరంగా మారింది.
లండన్: తమ ఖాతాలో మరో విజయం వేసుకొని ఇంగ్లండ్‌తో సిరీస్‌లో ఆధిక్యంలోకి వెళ్లాలంటే భారత బౌలర్లు నాలుగో టెస్టులో చివరి రోజు సత్తా చాటుకోవాలి. ఆఖరి రోజు మొత్తం 10 వికెట్లు పడగొడితేనే భారత్‌కు విజయం దక్కుతుంది. మరోవైపు ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు కూడా విజయంపై కన్నేసింది. 368 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ ఆదివారం ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 32 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 77 పరుగులు చేసింది.
ఓపెనర్లు బర్న్స్ (31 బ్యాటింగ్; 2 ఫోర్లు), హసీబ్ (43 బ్యాటింగ్; 6 ఫోర్లు) క్రీజులో ఉన్నారు. అంతకుముందు భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 148.2 ఓవర్లలో 466 పరుగులకు ఆలౌటైంది. దాంతో ఇంగ్లండ్‌కు 368 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. శార్దుల్ ఠాకూర్ (72 బంతుల్లో 60; 7 ఫోర్లు, 1 సిక్స్) వన్డే తరహా ఇన్నింగ్స్ ఆడగా... వికెట్ కీపర్ రిషభ్ పంత్ (106 బంతుల్లో 50; 4 ఫోర్లు) రాణించాడు. క్రిస్ వోక్స్ 3 వికెట్లు తీశాడు.
శార్దుల్ మళ్లీ మెరిశాడు
270/3తో నాలుగో రోజు ఆటను కొనసాగించిన భారత్‌ను ఇంగ్లండ్ బౌలింగ్ ఆల్‌రౌండర్ క్రిస్ వోక్స్ దెబ్బతీశాడు. ఓవర్‌నైట్ స్కోరుకు 26 పరుగులు జతయ్యాక... జడేజా (17; 3 ఫోర్లు), రహానే (0)లను తన వరుస ఓవర్లలో వోక్స్ అవుట్ చేశాడు. కాసేపటికే కెప్టెన్ కోహ్లి (44; 7 ఫోర్లు) మొయిన్ అలీ బౌలింగ్‌లో ఒవర్టన్‌కు క్యాచ్ ఇచ్చాడు. అప్పటికి భారత స్కోరు 312/6 కాగా... ఆధిక్యం 213 పరుగులు. ఈ దశలో క్రీజులోకి వచ్చి న యువ ప్లేయర్లు రిషభ్ పంత్, శార్దుల్ ఠాకూర్ భారత్‌ను సురక్షిత స్థితిలో ఉంచే బాధ్యతను తీసుకున్నారు. వీరిద్దరూ మొదట ఆచితూచిగా ఆడటంతో పరుగుల వేగం మందగించింది. లంచ్ విరామానికి భారత్ స్కోరు 329/6గా ఉంది. లంచ్ తర్వాత శార్దుల్ తన బ్యాట్‌కు పని చెప్పాడు.
తొలి ఇన్నింగ్స్‌లో ఆడినంత ధాటిగా కాకపోయినా... ఇక్కడ కూడా స్కోరు బోర్డును పరిగెత్తించాడు. అతడికి పంత్ కూడా తోడవ్వడంతో భారత్ ఆధిక్యం 300 పరుగులు చేరుకుంది. ఈ క్రమంలో శార్దుల్ 65 బంతుల్లో మ్యాచ్‌లో రెండో అర్ధ సెంచరీని పూర్తి చేశాడు. çఎనిమిదో బ్యాట్స్‌మన్‌గా వచ్చి ఒకే టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ 50కిపైగా పరుగులు సాధించిన మూడో భారత క్రికెటర్‌గా శార్దుల్ ఘనతకెక్కాడు. అనంతరం పంత్ కూడా హాఫ్ సెంచరీని అందుకున్నాడు. వీరిద్దరూ ఏడో వికెట్‌కు 100 పరుగులు జోడించారు. చివర్లో ఉమేశ్ యాదవ్ (25; 1 ఫోర్, 2 సిక్స్‌లు), బుమ్రా (24; 4 ఫోర్లు) నిలబడటంతో ఇంగ్లండ్ ముందు టీమిండియా భారీ లక్ష్యాన్ని ఉంచగలిగింది.
స్కోరు వివరాలు
భారత్ తొలి ఇన్నింగ్స్: 191; ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 290; భారత్ రెండో ఇన్నింగ్స్: రోహిత్ (సి) వోక్స్ (బి) రాబిన్సన్ 127; రాహుల్ (సి) బెయిర్‌స్టో (బి) అండర్సన్ 46; పుజారా (సి) అలీ (బి) రాబిన్సన్ 61; కోహ్లి (సి) ఒవర్టన్ (బి) అలీ 44; జడేజా (ఎల్బీ) (బి) వోక్స్ 17; రహానే (ఎల్బీ) (బి) వోక్స్ 0; పంత్ (సి అండ్ బి) అలీ 50; శార్దుల్ ఠాకూర్ (సి) ఒవర్టన్ (బి) రూట్ 60; ఉమేశ్ యాదవ్ (సి) అలీ (బి) ఒవర్టన్ 25; బుమ్రా (సి) అలీ (బి) వోక్స్ 24; సిరాజ్ (నాటౌట్) 3; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (148.2 ఓవర్లలో ఆలౌట్) 466.
వికెట్ల పతనం: 1–83, 2–236, 3–237, 4–296, 5–296, 6–312, 7–412, 8–414, 9–450, 10–466.
బౌలింగ్: అండర్సన్ 33–10–79–1, రాబిన్సన్ 32–7–105–2, వోక్స్ 32–8–83–3, ఒవర్టన్ 18.2–3–58–1, మొయిన్ అలీ 26–0–118–2, రూట్ 7–1–16–1.
ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: బర్న్స్ (బ్యాటింగ్) 31; హమీద్ (బ్యాటింగ్) 43; ఎక్స్‌ట్రాలు 3;
మొత్తం (32 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా) 77.
బౌలింగ్: ఉమేశ్ 6–2–13–0, బుమ్రా 7–3–11–0, జడేజా 13–4–28–0, సిరాజ్ 6–0–24–0.
Comments
Please login to add a commentAdd a comment