న్యూఢిల్లీ: శ్రీలంక పర్యటనకు ఎంపికైన భారత జట్టు..14 రోజుల క్వారంటైన్ సోమవారం నుంచి ప్రారంభం కానుంది. జూన్ 14 నుంచి 28 వరకు ఆటగాళ్లు, సహాయ సిబ్బంది ముంబైలోని ఓ హోటల్లో క్వారంటైన్‌లో ఉండనున్నారు. ఈ సమయంలో భారత బృందానికి ఆరుసార్లు ఆర్టీపీసీఆర్ టెస్ట్‌లు నిర్వహిస్తారు. ఈ టెస్ట్‌లన్నింటిలో నెగటివ్ రిపోర్ట్ వచ్చిన వారు మాత్రమే ప్రత్యేక విమానంలో కొలంబో వెళ్తారని బీసీసీఐ స్పష్టం చేసింది. ఇంగ్లండ్ పర్యటనలో కోహ్లీ సేన పాటిస్తున్న నిబంధనలే ధవన్ సేనకు కూడా వర్తిస్తాయని బీసీసీఐ పేర్కొంది. ఈ 14 రోజుల క్వారంటైన్‌లో తొలి ఏడు రోజులు కఠిన నిబంధనలు పాటించాల్సి ఉంటుందని, ఆ తర్వాత.. బయో బుడగలో మిగిలిన ఆటగాళ్లతో కలుసుకునే వీలు ఉంటుందని, జిమ్ సెషన్లకు కూడా హాజరు కావచ్చని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.
ఇదిలా ఉంటే, జులై 13న ప్రారంభమయ్యే లంక పర్యటనలో శిఖర్ ధవన్ సారథ్యంలోని టీమిండియా మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. ఈ పర్యటనలో భారత జట్టుకు మ్యాచ్ సిమ్యులేషన్ ప్రాక్టీస్ కూడా ఉండనుంది. వ్యక్తిగత సెషన్ తర్వాత ఈ సెషన్ ఉండే అవకాశం ఉంది. ఇక కొలంబో చేరిన తర్వాత క్రికెటర్లు మూడు రోజులు క్వారంటైన్‌లో ఉంటారు. ఆ తర్వాత ప్రాక్టీస్ చేసుకునే అవకాశం కల్పిస్తారు. టీమిండియా గత కొన్నేళ్లుగా కొలంబోలో హోటల్ తాజా సముద్రలో బస చేస్తోంది. ఇప్పుడు కూడా ఆటగాళ్లకు అదే హోటల్ కేటాయించినట్లు లంక క్రికెట్ బోర్డ్ వెల్లడించింది.
భారత జట్టు: శిఖర్ ధవన్ (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్ (వైస్ కెప్టెన్), పృథ్వీ షా, దేవదత్ పడిక్కల్, హార్దిక్ పాండ్యా, రుతురాజ్ గైక్వాడ్, సూర్యకుమార్ యాదవ్, మనీష్ పాండే, నితీష్ రాణా, ఇషాన్ కిషన్, సంజు శాంసన్, యుజ్వేంద్ర చహల్, రాహుల్ చాహర్, కృష్ణప్ప గౌతమ్, కృనాల్ పాండ్యా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, దీపక్ చహర్, నవ్‌దీప్ సైనీ, చేతన్ సకారియా.
చదవండి: గొప్ప గౌరవంగా భావిస్తున్నాను: శిఖర్ ధవన్
Comments
Please login to add a commentAdd a comment