అంతటా తానే...అన్నింటా అతడే...మైదానంలో రవీంద్ర జడేజా అద్భుత ప్రదర్శనకు వాంఖెడే మైదానం వేదికైంది...ఇన్నింగ్స్ చివరి ఓవర్లో ఏకంగా 36 పరుగులు బాదిన అతను ఆపై బౌలింగ్‌లో మ్యాక్స్‌వెల్, డివిలియర్స్‌ల కీలక వికెట్లతో చెలరేగాడు. డైరెక్ట్ త్రోతో మరో రనౌట్ చేసిన రవీంద్రజాలం ముందు బెంగళూరు ఆట చిన్నబోయింది. వరుసగా నాలుగు విజయాలతో ఊపు మీదున్న ఆ జట్టుకు చెన్నై చేతిలో భారీ పరాజయం ఎదురైంది.
ముంబై: ఐపీఎల్–2021లో విరాట్ బృందానికి తొలి ఓటమి...ఆదివారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 69 పరుగుల తేడాతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై ఘన విజయం సాధించింది. ముందుగా చెన్నై 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రవీంద్ర జడేజా (28 బంతుల్లో 62 నాటౌ ట్; 4 ఫోర్లు, 5 సిక్సర్లు), డు ప్లెసిస్ (41 బంతుల్లో 50; 4 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలు చేయగా...రుతురాజ్ గైక్వాడ్ (25 బంతుల్లో 33; 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. అనంతరం ఆర్‌సీబీ 20 ఓవర్లలో 9 వికెట్లకు 122 పరుగులకే పరిమితమైంది. దేవదత్ పడిక్కల్ (15 బంతుల్లో 34; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) మినహా అంతా విఫలమయ్యారు. మరో వైపు స్లో ఓవర్ రేట్ కారణంగా కోహ్లికి రూ. 12 లక్షల జరిమానా పడింది.
డుప్లెసిస్ అర్ధ సెంచరీ...
చెన్నైకి ఓపెనర్లు రుతురాజ్, డు ప్లెసిస్ మరో సారి శుభారంభం అందించారు. అయితే హర్షల్ వరుస బంతుల్లో సురేశ్ రైనా (18 బంతుల్లో 24; 1 ఫోర్, 3 సిక్సర్లు), డు ప్లెసిస్‌లను అవుట్ చేయడంతో స్కోరు వేగం మందగించింది. కొద్ది సేపటికే రాయుడు (14) కూడా వెనుదిరిగాడు.
పడిక్కల్ మినహా...
ఛేదనలో ఆర్‌సీబీకి కూడా మెరుపు ఆరంభమే లభించింది. అయితే తక్కువ వ్యవధిలో కోహ్లి (8), పడిక్కల్, సుందర్ (7) వెనుదిరగడంతో జట్టు కష్టాల్లో పడింది. ఈ దశలో మ్యాక్స్‌వెల్ ( 22; 3 ఫోర్లు), డివిలియర్స్ (4)విఫలం కావడంతో బెంగళూరు విజయంపై ఆశలను వదులుకుంది.
6 6 6 (నోబాల్) 6 2 6 4
ఇన్నింగ్స్ చివరి ఓవర్లో జడేజా అద్భుత బ్యాటింగ్‌తో చెలరేగాడు. హర్షల్ పటేల్ వేసిన ఈ ఓవర్లో అతను ఏకంగా 36 పరుగులు బాదాడు. ‘నోబాల్’ కలుపుకొని ఇందులో మొత్తం 37 పరుగులు రావడం విశేషం. జడేజా స్కోరు ‘0’ వద్ద ఉన్నప్పుడు డీప్ మిడ్ వికెట్‌లో క్రిస్టియాన్ సునాయాస క్యాచ్ వదిలేయడంతో చివరకు బెంగళూరు ఫలితం అనుభవించింది! ఐపీఎల్‌లో అత్యధికంగా ఒకే ఓవర్లో 37 పరుగులు రావడం ఇది రెండో సారి. 2011లో కేరళ బౌలర్ ప్రశాంత్ పరమేశ్వరన్ 37 పరుగులు ఇచ్చాడు. నాటి ఓవర్లో గేల్ 4 సిక్స్‌లు, 3 ఫోర్లతో 36 పరుగులు సాధించాడు.
స్కోరు వివరాలు
చెన్నై ఇన్నింగ్స్: రుతురాజ్ (సి) జేమీసన్ (బి) చహల్ 33, డు ప్లెసిస్ (సి) క్రిస్టియాన్ (బి) హర్షల్ 50, రైనా (సి) పడిక్కల్ (బి) హర్షల్ 24, రాయుడు (సి) జేమీసన్ (బి) హర్షల్ 14, జడేజా (నాటౌట్) 62, ధోని (నాటౌట్) 2, ఎక్స్‌ట్రాలు 6, మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 191.
వికెట్ల పతనం: 1–74, 2–111, 3–111, 4–142. బౌలింగ్: సిరాజ్ 4–0–32–0, జేమీసన్ 3–0–31–0, చహల్ 3–0–24–1, సైనీ 2–0–27–0, హర్షల్ 4–0–51–3, క్రిస్టియాన్ 2–0–12–0, సుందర్ 2–0–13–0.
బెంగళూరు ఇన్నింగ్స్: కోహ్లి (సి) ధోని (బి) కరన్ 8, పడిక్కల్ (సి) రైనా (బి) శార్దుల్ 34, సుందర్ (సి) రుతురాజ్ (బి) జడేజా 7, మ్యాక్స్‌వెల్ (బి) జడేజా 22, డివిలియర్స్ (బి) జడేజా 4, క్రిస్టియాన్ (రనౌట్) 1, జేమీసన్ (రనౌట్) 16, హర్షల్ (బి) తాహిర్ 0, సైనీ (సి) రైనా (బి) తాహిర్ 2, చహల్ (నాటౌట్) 8, సిరాజ్ (నాటౌట్) 12, ఎక్స్‌ట్రాలు 8, మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 122.
వికెట్ల పతనం: 1–44, 2–54, 3–65, 4–79, 5–81, 6–83, 7–89, 8–94, 9–103. బౌలింగ్: చహర్ 2–0–25–0, కరన్ 4–0–35–1, శార్దుల్ 4–0–11–1, జడేజా 4–1–13–3, తాహిర్ 4–0–16–2. బ్రేవో 2–0–19–0.
Comments
Please login to add a commentAdd a comment