నిరాశ పరుస్తున్న హ్యారీ బ్రూక్ (Photo Credit: iplt20.com)
IPL 2023- SRH- Harry Brook: ‘‘ఐపీఎల్ వేలం జరిగిన ప్రతిసారి నా దృష్టి విదేశీ ఆటగాళ్లపై కూడా ఉంటుంది. ముఖ్యంగా ఇంగ్లిష్ ప్లేయర్లు.. వారికి లభించే మొత్తాలను గమనిస్తూ ఉంటా. అందుకు తగ్గట్లే వాళ్లు ఐపీఎల్‌లో మెరుగైన ప్రదర్శన కనబరుస్తారని ఆశిస్తా.
కానీ, వారి విషయంలో నా అంచనాలు చాలా వరకు తలకిందులు అయ్యాయి. ఉపఖండ పిచ్‌లపై.. ఐపీఎల్ వంటి ప్రతిష్టాత్మక టోర్నీల్లో.. భారీ ప్రైస్ ట్యాగ్‌ల నేపథ్యంలో నెలకొన్న అంచనాలు అందుకోవడం అంత తేలికేమీ కాదు. ఇంగ్లండ్ ఆటగాళ్లలో అతికొద్ది మంది మాత్రమే ఐపీఎల్‌లో ఒత్తిడి అధిగమించి తమను తాము నిరూపించుకున్నారు.
అయితే, ఆస్ట్రేలియన్లు, వెస్టిండీస్, సౌతాఫ్రికా క్రికెటర్ల పరిస్థితి ఇందుకు భిన్నం. వారు ఇక్కడి పరిస్థితులు, ఐపీఎల్ ఫార్మాట్‌ను సరిగ్గా అర్థం చేసుకుని ముందుకు సాగుతున్నారు. కానీ ఇంగ్లిష్ ఆటగాళ్లు మాత్రం ఇంకా వారిలా అదరగొట్టలేకపోతున్నారు’’ అని టీమిండియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ అన్నాడు.
కోట్లు కుమ్మరించారు
ఐపీఎల్-2023లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓటమి నేపథ్యంలో మంజ్రేకర్ ఈ మేరకు స్టార్ స్టోర్స్ షోలో మాట్లాడుతూ తన అభిప్రాయాలు పంచుకున్నాడు. హైదరాబాద్ ఫ్రాంఛైజీ కోట్లు కుమ్మరించి కొనుగోలు చేసిన ఇంగ్లండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్‌ను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
అవే బ్రూక్‌ను ఒత్తిడిలోకి నెట్టేస్తున్నాయి
బ్రూక్ త్వరలోనే తనదైన శైలిలో చెలరేగాలని ఆశిస్తున్నట్లు మంజ్రేకర్ పేర్కొన్నాడు. ‘‘హ్యారీ బ్రూక్ ఫామ్‌లోకి వస్తాడనే అనుకుంటున్నా? అయితే అది ఎప్పుడంటే మాత్రం కచ్చితంగా చెప్పలేను. ఇందుకు మరో రెండు మ్యాచ్‌లు లేదంటే మూడు మ్యాచ్‌ల సమయం పట్టొచ్చు.
తన బలమేంటో తెలుసుకుని.. తన నైపుణ్యాలు ప్రదర్శించగలుగుతాడు. ప్రస్తుతం అతడిపై అధిక ధర పలికిన ప్లేయర్ అనే ట్యాగ్.. చుట్టూ జనాల అంచనాలు.. భారత పిచ్‌లపై బౌలర్లను ఎలా ఎదుర్కోవాలో తెలియని అనుభవలేమి ఒత్తిడిని పెంచుతున్నాయి. వీటిని అధిగమిస్తే బ్రూక్ తప్పకుండా రాణించగలడు’’ అంటూ మంజ్రేకర్ హ్యారీ బ్రూక్‌కు అండగా నిలబడ్డాడు.
13 కోట్ల రూపాయలు పలికిన పవర్ హిట్టర్.. ఐపీఎల్‌లో ఇలా
24 ఏళ్ల బ్రూక్ బిగ్ హిట్టర్‌గా పేరొందాడు. గతేడాది 6 టెస్టులు ఆడి ఏకంగా నాలుగు సెంచరీలు సాధించాడు. అరంగేట్రంలోనే శతకం బాది తన ఆగమనాన్ని ఘనంగా చాటాడు. ఇప్పటి వరకు ఇంగ్లండ్ తరఫున 20 టీ20లు ఆడిన ఈ రైట్ హ్యాండ్ బ్యాటర్ 372 పరుగులు చేశాడు.
ఇక ఐపీఎల్- 2023 మినీ వేలంలో సన్‌రైజర్స్ అతడి కోసం ఇతర ఫ్రాంఛైజీలతో పోటీపడి ఏకంగా 13.25 కోట్లు ఖర్చు పెట్టి కొనుగోలు చేసింది. కానీ ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచ్‌లలో ఈ సన్‌రైజర్స్ బ్యాటర్ పూర్తిగా విఫలమయ్యాడు. రాజస్తాన్, లక్నోలతో మ్యాచ్‌లలో కలిపి 16 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో అతడిపై విమర్శలు వెల్లువెత్తుతుండగా మంజ్రేకర్ ఈ మేరకు అండగా నిలవడం గమనార్హం.
చదవండి: సీఎస్‌కేతో మ్యాచ్.. సచిన్ కొడుకు ఐపీఎల్ ఎంట్రీ!
ఎయిడెన్ అన్న, బ్రూక్ వల్లే ఇదంతా! సాకులు వెతుక్కోవద్దన్న లారా.. బ్యాటర్లపై ఫైర్!
ఎవరు బాబు నీవు.. వెళ్లి టెస్టులు ఆడుకో పో! అక్కడ కూడా పనికి రాడు
Comments
Please login to add a commentAdd a comment