రచిన్ రవీంద్ర- ట్రవిస్ హెడ్
IPL 2024 Auction: ఐపీఎల్–2024 సీజన్ కోసం ఆటగాళ్ల వేలానికి సర్వం సిద్ధమైంది. ఈనెల 19న దుబాయ్‌లో వేలం కార్యక్రమం జరుగుతుంది. మొత్తం 1166 మంది ఆటగాళ్లు నమోదు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో.. ఫ్రాంచైజీలతో సంప్రదించాక ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ 333 మందితో సోమవారం తుది జాబితాను ప్రకటించింది. ఇందులో 119 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు.
ఫ్రాంచైజీల కళ్లన్నీ అతడిపైనే
ఇక వన్డే వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియాను విజేతగా నిలపడంలో కీలకపాత్ర పోషించిన ట్రావిస్ హెడ్‌పై ఫ్రాంచైజీలన్నీ కన్నేశాయి. కమిన్స్, మిచెల్ స్టార్క్‌లు కూడా ఆసీస్ తరఫున హాట్ కేక్‌లు కానున్నారు. ప్రపంచకప్‌లో సెమీఫైనలిస్టుగా నిలిచిన న్యూజిలాండ్ తరఫున మెరిసిన రచిన్ రవీంద్రపై కూడా కోట్లు కురిసే అవకాశాలున్నాయి.
77 స్థానాలు.. కేకేఆర్‌కు అత్యధికంగా
అదే విధంగా.. ఫ్రాంచైజీల విషయానికొస్తే మొత్తం 10 జట్లకు కావాల్సింది 77 మంది ఆటగాళ్లయితే ఇందులో 30 విదేశీ బెర్తులున్నాయి. ఇందుకోసం రూ. 262.95 కోట్లు వెచ్చించాల్సి ఉంది. ఖాళీల పరంగా చూస్తే అత్యధికంగా కోల్‌కతా నైట్‌రైడర్స్ 12 మందిని కొనుక్కోవాల్సి ఉండగా... ఆ జట్టు చేతిలో రూ. 32.70 కోట్లు అందుబాటులో ఉన్నాయి.
టైటాన్స్ వద్ద రూ.38.15 కోట్లు
ఇక అత్యధిక మొత్తం రూ.38.15 కోట్లు గుజరాత్ వద్ద ఉంటే వారికి 8 మంది ఆటగాళ్లు కావాలి. కనిష్ట మొత్తం రూ. 13.15 కోట్లు లక్నో సూపర్ జెయింట్స్ ఖాతాలో ఉండగా... వారు ఆరు బెర్తుల్ని భర్తీ చేసుకోవాల్సి ఉంటుంది.
బరిలో ఉన్న తెలుగు క్రికెటర్లు వీరే!
మరోవైపు.. ధోని టీమ్ చెన్నై ఖాతాలో రూ. 31.40 కోట్లు, కోహ్లి జట్టు బెంగళూరు ఖాతాలో రూ. 23.25 కోట్లు అందుబాటులో ఉండగా ఇరుజట్లకు ఆరుగురు చొప్పున ఖాళీలున్నాయి. ఇక హైదరాబాద్ నుంచి అభిషేక్ మురుగన్, రాహుల్ బుద్ధి, రోహిత్ రాయుడు, అనికేత్ రెడ్డి, రవితేజ, తనయ్ త్యాగరాజన్, అరవెల్లి అవినాశ్‌రావు, రక్షణ్ రెడ్డి, మనీశ్ రెడ్డి... ఆంధ్ర నుంచి కోన శ్రీకర్ భరత్, రికీ భుయ్, హనుమ విహారి, పృథ్వీరాజ్ వేలంలో ఉన్నారు.
జట్టు- ఖాళీల సంఖ్య - మిగిలిన మొత్తం
►చెన్నై- 6- రూ. 31.4 కోట్లు
►ఢిల్లీ- 9 - రూ. 28.95 కోట్లు
►గుజరాత్- 8- రూ. 38.15 కోట్లు
►కోల్‌కతా - 12- రూ. 32.7 కోట్లు
►లక్నో- 6 - రూ. 13.15 కోట్లు
►ముంబై - 8 - రూ. 17.75 కోట్లు
►పంజాబ్- 8- రూ. 29.1 కోట్లు
►బెంగళూరు- 6 - రూ. 23.25 కోట్లు
►రాజస్తాన్ - 8- రూ. 14.5 కోట్లు
►హైదరాబాద్- 6- రూ. 34 కోట్లు
►మొత్తం- 77- రూ. 262.95 కోట్లు
Comments
Please login to add a commentAdd a comment