ఐపీఎల్ 2024 సీజన్ తొలి మ్యాచ్ ఇవాళ (మార్చి 22) జరుగనుంది. చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా ఫైవ్ టైమ్ ఛాంపియన్ చెన్నై సూపర్‌కింగ్స్ (సీఎస్‌కే), ఇప్పటివరకు ఒక్క టైటిల్ కూడా గెలవని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు ప్రారంభంకానుంది.
అక్షయ్ కుమార్, ఏఆర్ రెహ్మాన్‌లచే ప్రత్యేక కార్యక్రమం..
మ్యాచ్‌కు ముందు సీజన్ ఆరంభ వేడుకలు జరుగనున్నాయి. సాయంత్రం 6:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ ఈవెంట్‌లో బాలీవుడ్ నటులు అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్, సంగీత మాంత్రికుడు ఎఆర్ రెహ్మాన్, సింగర్ సోనూ నిగమ్ పెర్ఫార్మ్ చేయనున్నారు.
సీఎస్‌కే నూతన కెప్టెన్‌గా రుతురాజ్..
లీగ్ ప్రారంభానికి కొద్ది గంటల ముందు డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ సంచలన నిర్ణయం తీసుకుంది. నూతన కెప్టెన్‌గా రుతురాజ్ గైక్వాడ్‌ను ఎంపిక చేస్తున్నట్లు ప్రకటించింది. మాజీ కెప్టెన్ ధోని స్వచ్ఛందంగా కెప్టెన్సీ నుంచి తప్పుకుని రుతురాజ్‌కు బాధ్యతలు అప్పజెప్పాడు.
వాతావరణం ఎలా ఉందంటే..
సీఎస్‌కే, ఆర్సీబీ మ్యాచ్‌కు వేదిక అయిన చెన్నైలో వాతావరణం ఆటకు ఆనువుగా ఉంది. వాతావరణం నుంచి మ్యాచ్‌కు ఎలాంటి అవాంతరాలు సంభవించవు. చెన్నైలోని కొన్ని ప్రాంతాల్లో గురువారం రాత్రి తేలికపాటి వర్షం పడినప్పటికీ.. ఇవాళ మ్యాచ్ జరిగే సమయంలో (7-11 గంటల మధ్యలో) వాతావరణం పొడిగా ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. మ్యాచ్ వేలల్లో ఉష్ణోగ్రతలు 30, 31 డిగ్రీల మధ్యలో ఉండే అవకాశం ఉంది. వర్షం నుంచి ఎలాంటి ముప్పు లేదు.
పిచ్ ఎవరికి అనుకూలం..
చెపాక్ పిచ్ బ్యాటింగ్, బౌలింగ్ రెండిటికీ అనుకూలిస్తుందని చెప్పాలి. తొలుత బ్యాటర్లకు స్వర్గధామంగా కనిపించే ఈ పిచ్ క్రమంగా స్నిన్‌కు అనుకూలిస్తూ బౌలర్ ఫ్రెండ్లీగా మారుతుంది. ఈ పిచ్‌పై ఛేదన కాస్త కష్టంగానే ఉంటుంది. తొలుత బ్యాటింగ్ చేసే జట్టుకే విజయావకాశాలు అధికంగా ఉంటాయి. రాత్రి వేళలో తేమ శాతం అధికమైతే స్పిన్నర్లు చెలరేగే అవకాశం ఉంటుంది.
హెడ్ టు హెడ్ రికార్డులను పరిశీలిస్తే..
ఐదు సార్లు ఛాంపియన్ అయిన సూపర్ కింగ్స్‌కు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై ఘనమైన రికార్డు ఉంది. ఈ ఇరు జట్లు ఐపీఎల్‌లో 31 సార్లు ఎదురెదురుపడగా.. సీఎస్‌కే 20, ఆర్సీబీ 10 సందర్భాల్లో విజయం సాధించాయి. ఓ మ్యాచ్‌లో ఫలితం తేలలేదు.
చెపాక్ విషయానికొస్తే..
ఆర్సీబీపై సీఎస్‌కే సంపూర్ణ ఆధిపత్యం కలిగి ఉంది. ఇక్కడ ఇరు జట్లు 8 మ్యాచ్‌ల్లో తలపడగా.. సీఎస్‌కే ఏకంగా ఏడు మ్యాచ్‌ల్లో జయకేతనం ఎగురవేసింది. కేవలం ఒక్క మ్యాచ్‌లో మాత్రమే ఆర్సీబీ విజయం సాధించింది. అది కూడా లీగ్ ప్రారంభ ఎడిషన్ అయిన 2008లో. నాటి నుంచి ఇప్పటివరకు ఆర్సీబీ సీఎస్‌కేపై చెపాక్‌లో ఒక్క మ్యాచ్‌లో కూడా గెలవలేదు.
తుది జట్లు (అంచనా)..
సీఎస్‌కే: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), రచిన్ రవీంద్ర, అజింక్య రహానే, డారిల్ మిచెల్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని (వికెట్‌కీపర్), శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, మహీశ్ తీక్షణ, ముస్తాఫిజుర్ రెహ్మాన్
ఆర్సీబీ: విరాట్ కోహ్లి, ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), రజత్ పాటిదార్, కెమరూన్ గ్రీన్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, దినేశ్ కార్తీక్ (వికెట్‌కీపర్), అనూజ్ రావత్, అల్జరీ జోసఫ్, సిరాజ్, కర్ణ్ శర్మ, ఆకాశ్‌దీప్
Comments
Please login to add a commentAdd a comment