ప్రతిసారీ ధోని ఎంట్రీ ఏంటి?.. కెప్టెన్‌ అతడు కదా: సెహ్వాగ్‌ | Show Ruturaj Face Captain: Sehwag Quips As Visuals Show Dhoni Setting Field | Sakshi
Sakshi News home page

#MSDhoni: ధోని ఒక్కడినే కాదు.. రుతురాజ్‌నూ కాస్త పట్టించుకోండి: సెహ్వాగ్‌

Published Sat, Mar 23 2024 10:37 AM | Last Updated on Sat, Mar 23 2024 12:38 PM

Show Ruturaj Face Captain: Sehwag Quips As Visuals Show Dhoni Setting Field - Sakshi

ధోనితో రుతురాజ్‌ (PC: BCCI/IPL)

#CSKvsRCB- #MSDhoni: చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌గా అరుదైన ఘనతలు సాధించిన మహేంద్ర సింగ్‌ ధోని స్థానాన్ని భర్తీ చేయడం అంత సులువు కాదు. ధోని భాగమై ఉన్న జట్టును సారథిగా ముందుకు నడిపించలేక.. ఒత్తిడిలో చిత్తై రవీంద్ర జడేజా 2022 సీజన్‌లో పగ్గాలు చేపట్టి మధ్యలోనే వదిలేసిన విషయం తెలిసిందే.

ఆ తర్వాత ధోనినే మళ్లీ రంగంలోకి దిగినా ఫలితం లేకుండా పోయింది. అయితే, 2023లో తన అద్బుతమైన కెప్టెన్సీ నైపుణ్యాలతో సీఎస్‌కేను చాంపియన్‌గా నిలిపాడు ధోని. వయసు పైబడటం, భవిష్యత్‌ కెప్టెన్‌ను తయారు చేసే క్రమంలో ఐపీఎల్‌-2024 సీజన్‌కు ముందే తన బాధ్యతల నుంచి తప్పుకొన్నాడు తలా.

ఎవరి స్థానాన్నో భర్తీ చేయడానికి రాలేదు
కెప్టెన్సీ పగ్గాలను ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌కు అందించాడు. రుతు సైతం.. గతేడాది నుంచే ధోని భయ్యా తనకు ఈ విషయం గురించి సంకేతాలు ఇచ్చాడని పేర్కొన్నాడు. అంతేకాదు.. ‘‘సీఎస్‌కే కెప్టెన్‌గా ఎంపిక కావడం నాకు దక్కిన గౌరవం.

అయితే, ఇక్కడ నేను ఎవరి స్థానాన్నో భర్తీ చేయడానికి రాలేదు. నన్ను నేను నిరూపించుకునే అవకాశం కోసం ఎదురు చూస్తున్నా’’ అని టోర్నీ ఆరంభానికి ముందే స్పష్టం చేశాడు రుతురాజ్‌ గైక్వాడ్‌.

ఫీల్డింగ్‌ సెట్‌ చేసిన ధోని
అందుకు తగ్గట్లుగానే ఆరంభ మ్యాచ్‌లో కెప్టెన్‌గా తనదైన ముద్ర వేసేందుకు ప్రయత్నించాడు. రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుపై చెన్నై ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించడంతో సారథిగా అరంగేట్రంలోనే గెలుపు రుచి చవిచూశాడు.

అయితే, మ్యాచ్‌ మధ్యలో ధోని రుతురాజ్‌కు సలహాలు ఇస్తూ కనిపించాడు. అంతేకాదు.. ఫీల్డింగ్‌ సెట్‌ చేసే విషయంలో ఈ వికెట్‌ కీపర్‌ చొరవ తీసుకున్నాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ధోని అభిమానులను అలరించాయి. ధోని క్రేజ్‌ దృష్ట్యా కెమెరామెన్‌ సైతం ప్రతిసారి అతడిపైనే ఫోకస్‌ చేయడం విశేషం.

అతడు ఇప్పుడు కెప్టెన్‌
ఈ నేపథ్యంలో హర్యానా కామెంట్రీ బాక్స్‌లో ఉన్న టీమిండియా మాజీ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ తనదైన శైలిలో ఛలోక్తులు విసిరాడు. ‘‘భయ్యా.. దయచేసి రుతురాజ్‌ ముఖాన్ని కూడా కాస్త చూపించండి.

అతడు ఇప్పుడు కెప్టెన్‌. ఏంటో.. ఈ కెమెరామెన్‌ ఎ‍ప్పుడూ ధోని ఫేస్‌ మాత్రమే చూపిస్తున్నాడు’’ అని వీరూ భాయ్‌ కామెంట్‌ చేశాడు. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌లో కెప్టెన్‌గా రుతురాజ్‌కు మంచి మార్కులే పడ్డాయి.

రుతురాజ్‌ కెప్టెన్సీ బాగుంది
భారత మాజీ ఆల్‌రౌండర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌.. రుతు కెప్టెన్సీ గురించి ప్రస్తావిస్తూ.. ‘‘తొలి 26 బంతుల తర్వాత సీఎస్‌కే అద్భుతరీతిలో తిరిగి పుంజుకుంది. ఒత్తిడిలోనూ రుతురాజ్‌ బౌలింగ్‌ విభాగాన్ని ప్రయోగించడంలో చేసిన మార్పులు  ఆకట్టుకున్నాయి’’ అని ఎక్స్‌ వేదికగా ప్రశంసించాడు. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా రుతురాజ్‌ కేవలం 15 పరుగులు మాత్రమే చేయగలిగాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement