త్వరలోనే టీమిండియాకు ఆడతాడు.. నాన్‌ వెజ్‌ మానేశాడు! | IPL 2024 Mayank Yadav Mother Hopes He Play For India Soon Reveals Diet | Sakshi
Sakshi News home page

#Mayank Yadav: త్వరలోనే టీమిండియాకు ఆడతాడు.. నాన్‌ వెజ్‌ మానేశాడు! డైట్‌ ఇదే..

Published Thu, Apr 4 2024 4:00 PM | Last Updated on Thu, Apr 4 2024 5:16 PM

IPL 2024 Mayank Yadav Mother Hopes He Play For India Soon Reveals Diet - Sakshi

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌-2024లో తనదైన ముద్ర వేస్తున్నాడు లక్నో సూపర్‌ జెయింట్స్‌ స్పీడ్‌స్టర్‌ మయాంక్‌ యాదవ్‌. పంజాబ్‌ కింగ్స్‌తో మ్యాఛ్‌ సందర్భంగా క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో అడుగుపెట్టిన ఈ ఫాస్ట్‌బౌలర్‌.. అరంగేట్రంలోనే అదరగొట్టిన విషయం తెలిసిందే.

గంటకు 155.8 కిలో మీటర్ల వేగంతో బంతిని విసిరి సంచలనం సృష్టించిన ఈ రైటార్మ్‌ పేసర్‌.. 3/27తో సత్తా చాటాడు. ఇక ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లోనూ మూడు వికెట్లు తీయడమే గాకుండా.. ఐపీఎల్‌లో గంటకు 155 KMPH కంటే ఎక్కువ వేగంతో బౌలింగ్‌ చేసిన నాలుగో క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు.

అంతేకాదు.. వరుసగా తాను ఆడిన రెండు మ్యాచ్‌లలోనూ జట్టును గెలిపించి ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు అందుకున్నాడు మయాంక్‌ యాదవ్‌. తద్వారా ఐపీఎల్‌ చరిత్రలో ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా నిలిచాడు. 

ప్రతిభను నమ్ముకున్న 21 ఏళ్ల యంగ్‌ స్పీడ్‌గన్‌..  టీమిండియాలో చోటు దక్కించుకోవడమే తన లక్ష్యం అంటున్నాడు. మయాంక్‌ యాదవ్‌ తల్లిదండ్రులు సైతం తమ కుమారుడు ఏదో ఒకరోజు కచ్చితంగా భారత జట్టుకు ఆడతాడని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. 

‘‘వందకు వంద శాతం.. త్వరలోనే నా కుమారుడు టీమిండియా తరఫున అరంగేట్రం చేయడమే కాదు.. మెరుగ్గా రాణిస్తాడు కూడా! ఈ విషయంలో నా కంటే మయాంక్‌ వాళ్ల నాన్న ఇంకా ఎక్కువ నమ్మకంగా ఉన్నారు. 

చాలా మంది ఇప్పుడు మయాంక్‌ ప్రదర్శన చూసి భారత జట్టుకు ఆడితే బాగుంటుంది అంటున్నారు. కానీ వాళ్ల నాన్న అయితే రెండేళ్ల క్రితమే ఈ మాట అన్నారు. ఒకవేళ మయాంక్‌ గనుక గాయపడకపోయి ఉంటే కచ్చితంగా వచ్చే టీ20 వరల్డ్‌కప్‌లో ఆడేవాడని ఆయన అంటూ ఉంటారు’’ అని మయాంక్‌ తల్లి మమతా యాదవ్‌ పుత్రోత్సాహంతో పొంగిపోయారు. 

ఇక మయాంక్‌ డైట్‌ గురించి ప్రస్తావన రాగా.. ‘‘గతంలో నాన్‌ వెజ్‌ తినేవాడు. అయితే, ఇప్పుడు పూర్తి వెజిటేరియన్‌గా మారిపోయాడు. గత రెండేళ్లుగా వెజ్‌ మాత్రమే తింటున్నాడు.

తన డైట్‌ చార్ట్‌కు అనుగుణంగా ఏం కావాలని కోరితే అదే తయారు చేసి ఇస్తాం. మరీ అంత ప్రత్యేకంగా ఏమీ తినడు. పప్పు, రోటి, అన్నం, పాలు, కూరగాయలు తన ఆహారంలో భాగం. నాన్‌ వెజ్‌ మానేయడానికి మయాంక్‌ రెండు కారణాలు చెప్పాడు. 

ఒకటి.. తను శ్రీకృష్ణుడిని నమ్మడం మొదలుపెట్టానన్నాడు. రెండు.. తన శరీరానికి నాన్‌ వెజ్‌ పడటం లేదని చెప్పాడు’’ అని మమతా యాదవ్‌ పేర్కొన్నారు. ఆజ్‌తక్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. కాగా లక్నో తదుపరి ఆదివారం గుజరాత్‌ టైటాన్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌ ద్వారా మయాంక్‌ తిరిగి యాక్షన్‌లో దిగనున్నాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement