ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మెగా వేలం-2025 వేదిక ఖరారైంది. ఈ నెల 24, 25న సౌదీ అరేబియాలోని జిద్దా నగరంలో ఐపీఎల్–2025 వేలంపాట జరగనుందని మంగళవారం బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది.
గత ఏడాది దుబాయ్‌లో ఐపీఎల్ వేలం నిర్వహించగా... వరుసగా రెండో ఏడాది విదేశాల్లో ఐపీఎల్ వేలం జరగనుంది. ముందుగా సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లో వేలం నిర్వహిస్తారని వార్తలు వచ్చినా బీసీసీఐ మాత్రం జిద్దా నగరాన్ని ఎంచుకుంది.
👉ఇక ఇటీవల ఫ్రాంచైజీల రిటెన్షన్ జాబితా విడుదల కాగా... 1574 మంది ప్లేయర్లు వేలానికి రానున్నారు. ఇందులో 1165 మంది భారత ఆటగాళ్లు, 409 మంది విదేశీయులు ఉన్నారు. మొత్తంగా 320 మంది క్యాప్డ్ ప్లేయర్లు, 1224 మంది అన్ క్యాప్డ్ ప్లేయర్లు ఉన్నారు.
👉ఇందులో జాతీయ జట్టుకు ఆడిన భారత ఆటగాళ్లు 48 మంది ఉండగా... 965 మంది అన్‌క్యాప్డ్ ప్లేయర్లు ఉన్నారు. అసోసియేట్ దేశాల నుంచి 30 మంది ప్లేయర్లు వేలంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
అప్పటి నుంచి ఒక్క టీ20 ఆడలేదు.. కానీ
👉ఇంగ్లండ్ స్టార్ బెన్ స్టోక్స్ వచ్చే ఐపీఎల్ టోర్నీకి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నాడు. 2014 నుంచి ఒక్క టీ20 మ్యాచ్ కూడా ఆడని ఇంగ్లండ్ పేసర్ జేమ్స్ అండర్సన్ ఏకంగా రూ. 1 కోటీ 25 లక్షల కనీస ధరకు తన పేరును నమోదు చేసుకోవడం విశేషం.
👉ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా టీమిండియా తొలి టెస్టు ఆడుతున్న సమయంలోనే ఈ వేలం జరగనుంది. ఒక్కో జట్టు రీటైన్ ఆటగాళ్లను కలుపుకొని అత్యధికంగా 25 మంది ప్లేయర్లను కొనుగోలు చేసుకునే అవకాశం ఉంది. అంటే ప్రస్తుతం ఫ్రాంచైజీలు రీటైన్ చేసుకున్న ఆటగాళ్లు కాకుండా... ఇంకా 204 మంది ప్లేయర్లను ఎంపిక చేసుకోవాల్సి ఉంది.
వేలంలో 641.5 కోట్లు ఖర్చు
రిటెన్షన్ విధానంలో పలువురు ప్రధాన ఆటగాళ్లను ఫ్రాంచైజీలు వదిలేసుకోవడంతో... రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, సిరాజ్‌లాంటి పలువురు భారత స్టార్ ఆటగాళ్లు వేలానికి రానున్నారు. మొత్తంగా 10 ఫ్రాంచైజీలు కలిపి 204 మంది ప్లేయర్ల కోసం రూ. 641.5 కోట్లు వేలంలో ఖర్చు చేయనున్నాయి. ఇందులో 70 మంది విదేశీ ఆటగాళ్లకు అవకాశం దక్కనుంది.
రిటెన్షన్ గడువు ముగిసేసరికి 10 జట్లు రూ. 558.5 కోట్లు ఖర్చు పెట్టి 46 మంది ప్లేయర్లను అట్టిపెట్టుకున్నాయి. రిటెన్షన్ ప్రక్రియ ముగిసిన తర్వాత అత్యధికంగా పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ వద్ద రూ.110.5 కోట్లు మిగిలి ఉన్నాయి.
వారి కనీస ధర రూ. 2 కోట్లు
ఇక ఈసారి వేలంలోకి రానున్న టీమిండియా స్టార్ బ్యాటర్లు రిషభ్ పంత్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్‌లతో పాటు వెటరన్ స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, యజువేంద్ర చహల్ తదితరులు తమ కనీస ధరను రూ. 2 కోట్లుగా నిర్ణయించినట్లు సమాచారం.
వీరితో పాటు ఖలీల్ అహ్మద్, దీపక్ చహర్, వెంకటేశ్ అయ్యర్, ఆవేశ్ ఖాన్, ఇషాన్ కిషన్, ముకేశ్ కుమార్, భువనేశ్వర్ కుమార్, ప్రసిద్ కృష్ణ, టి.నటరాజన్, దేవదత్ పడిక్కల్, కృనాల్ పాండ్యా, హర్షల్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్ తదితర ద్వితీయ శ్రేణి భారత క్రికెటర్లు సైతం రూ. 2 కోట్ల కనీస ధరతో వేలంలోకి రానున్నట్లు తెలుస్తోంది.
వీరి బేస్ ప్రైస్ రూ. 75 లక్షలు
అయితే, ముంబై బ్యాటర్లు పృథ్వీ షా, సర్ఫరాజ్ ఖాన్‌ల బేస్ ప్రైస్ మాత్రం రూ. 75 లక్షలుగా ఉండనున్నట్లు సమాచారం. కాగా టీమిండియా ఓపెనర్‌గా వచ్చిన అవశాలను సద్వినియోగం చేసుకోలేకపోయిన పృథ్వీ షా.. ఐపీఎల్‌లోనూ అంతంతమాత్రంగానే ఆడుతున్నాడు.
మరోవైపు.. ఈ ఏడాది అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన సర్ఫరాజ్ ఖాన్ టెస్టుల్లో సత్తా చాటుతున్నాడు. అయితే, గతేడాది వేలంలో అమ్ముడుపోకుండా మిగిలి పోయిన అతడిని ఈసారి ఏదో ఒక ఫ్రాంఛైజీ కనీసం బేస్ ధరకు సొంతం చేసుకునే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment