![Jacques Kallis Picks 5 Players Who Could Make Impact In The World Cup 2023 - Sakshi](/styles/webp/s3/article_images/2023/09/14/Untitled-14.jpg.webp?itok=_Uhrf-xp)
అక్టోబర్ 5 నుంచి భారత్‌లో జరుగనున్న వన్డే ప్రపంచకప్-2023లో ఐదుగురు ప్లేయర్లు తీవ్ర ప్రభావం చూపగలరని సౌతాఫ్రికన్ లెజెండరీ ఆల్‌రౌండర్ జాక్ కల్లిస్ అంచనా వేశాడు. ఆఫ్ఘనిస్తాన్ స్పిన్ ఆల్‌రౌండర్ రషీద్ ఖాన్, టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి, సౌతాఫ్రికా పేస్ గన్ ఎన్రిచ్ నోర్జే, ఇంగ్లండ్ సారధి జోస్ బట్లర్, పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్‌లు వరల్డ్‌కప్‌లో విశేషంగా రాణిస్తారని కల్లిస్ జోస్యం చెప్పాడు.
కల్లిస్ ఈ ఐదుగురిని ఎంపిక చేయడానికి గల కారణాలను కూడా విశ్లేషించాడు. ఆయా ఆటగాళ్ల ప్రస్తుత ఫామ్‌తో పాటు భారత్‌లో ఆడిన అనుభవం వారి కలిసొస్తుందని అభిప్రాయపడ్డాడు. పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ ఇండియాలో ఆడనప్పటికీ, అతను ప్రపంచకప్‌లో తప్పక చెలరేగుతాడని తెలిపాడు. రషీద్ ఖాన్, నోర్జే, బట్లర్‌కు ఐపీఎల్‌లో ఆడిన అనుభవం, భారత పిచ్‌లపై వారికున్న రికార్డు, అలాగే ఇండియన్ ఫ్యాన్స్‌లో వారికున్న క్రేజ్ వారిలోని అత్యుత్తమ ఆటతీరును వెలికి తీస్తుందని అన్నాడు.
విరాట్ కోహ్లి విషయానికొస్తే.. ఈ ప్రపంచకప్‌లో అతన్ని ఆపడం కష్టమని తెలిపాడు. మునుపటితో పోలిస్తే, ప్రస్తుతం విరాట్ ఫామ్ చాలా భీకరంగా ఉందని, అతను మెగా టోర్నీలో అద్భుతాలు చేయడం ఖాయమని జోస్యం చెప్పాడు. విరాట్‌తో పాటు రషీద్ ఖాన్‌పై కూడా కల్లిస్ ప్రశంసల వర్షం కురిపించాడు. వరల్డ్‌కప్‌లో అతను రాణిస్తే ఆఫ్ఘనిస్తాన్ సంచలనాలను నమోదు చేయడం ఖాయమని అన్నాడు. కల్లిస్.. ఐసీసీ షేర్ చేసిన ఓ వీడియోలో ఈ విషయాలను పంచుకున్నాడు.
ఇదిలా ఉంటే, వన్డే వరల్డ్‌కప్-2023 అక్టోబర్ 5 నుంచి ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్-రన్నరప్ న్యూజిలాండ్ మధ్య మ్యాచ్‌తో మెగా టోర్నీ ప్రారంభంకానుంది. అక్టోబర్ 8న భారత్ తమ తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో తలపడుతుంది. అక్టోబర్ 14న భారత్.. పాక్‌ను ఢీకొంటుంది.
Comments
Please login to add a commentAdd a comment