రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్‌గా విరాట్ కోహ్లి తప్పుకోవడంతో ఆ స్థానాన్ని ఎవరితో భర్తీ చేస్తారనే చర్చ ఐపీఎల్ వర్గాల్లో జోరుగా సాగుతుంది. కోహ్లి గతేడాది ఐపీఎల్ తర్వాత ఆర్సీబీ సారధ్య బాధ్యతల నుంచి వైదొలగడంతో పలువురి పేర్లు తెరపైకి వచ్చాయి. కొందరు మ్యాక్స్‌వెల్ పేరును, మరికొందరు డేవిడ్ వార్నర్, మనీశ్ పాండేలను ప్రతిపాదించగా.. తాజాగా టీమిండియా మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా సరికొత్త ప్రతిపాదనతో ముందుకొచ్చాడు.
వెస్టిండీస్ ఆల్‌రౌండర్, మాజీ సన్‌రైజర్స్ ఆటగాడు జేసన్ హోల్డర్ ఆర్సీబీ కెప్టెన్ అయితే బాగుంటుందని సూచించాడు. హోల్డర్ ప్రతిపాదనను సమర్ధిస్తూ తన య్యూట్యూబ్ ఛానల్ వేదికగా అందుకు గల కారణాలను విశ్లేషించాడు. ఆర్సీబీ తమ డ్రాఫ్టెడ్ ఆటగాళ్లుగా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి, స్టార్ ప్లేయర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్, యువ బౌలర్ మహ్మద్ సిరాజ్‌లను అట్టిపెట్టుకున్నప్పటికీ వీరిలో ఎవరికి కూడా కెప్టెన్సీ అప్పగించే అవకాశం లేదంటూ పలు కారణాలను ఎత్తి చూపాడు.
కోహ్లి సారధ్య బాధ్యతల నుంచి స్వచ్ఛందంగా తప్పుకున్నాడు కాబట్టి అతను మళ్లీ ఆ బాధ్యతలను చేపట్టే అవకాశం లేదని, కెప్టెన్‌గా మ్యాక్స్‌వెల్‌కు సక్సెస్ రేట్ లేకపోవడంతో ఆర్సీబీ అతనివైపు మొగ్గు చూపే ఛాన్స్ లేదని, జట్టులో సీనియర్లను పెట్టుకుని సిరాజ్‌కు కెప్టెన్సీ ఇచ్చి ప్రయోగం చేసే ఆస్కారం లేదని వివరించాడు. ఈ క్రమంలో జేసన్ హోల్డర్ తన ఛాయిస్ ఎందుకని విశ్లేషిస్తూ.. అతనో మంచి ఆల్‌రౌండర్ అని, అతని కెప్టెన్సీలో విండీస్‌ను ప్రపంచ ఛాంపియన్‌గా నిలిపాడని, అనుభవంతో పాటు పొట్టి క్రికెట్‌కు కావల్సిన మెళకువలన్నీ అతని దగ్గరున్నాయని, పొట్టి క్రికెట్లో దిగ్గజ క్రికెటర్లందరినీ(గేల్, బ్రావో, పోలార్డ్, రసెల్) ఒకే తాటిపై నడిపించడంలో సక్సెస్ అయ్యాడని చెప్పుకొచ్చాడు.
హోల్డర్ అయితే ఆర్సీబీ లాంటి జట్టును సమర్ధవంతంగా నడిపించగలడన్న దానికి ఇన్ని కారణాలు ఉన్నాయని, అందుకే ఆర్సీబీ అతన్ని వేలంలో ఎలాగైనా సొంతం చేసుకుని సారధ్య బాధ్యతలు అప్పజెప్పాలని సూచించాడు. కోహ్లి, మ్యాక్స్‌వెల్ లాంటి స్టార్ ప్లేయర్లు ఉన్న జట్టుకు శ్రేయస్ అయ్యర్, శిఖర్ ధవన్, ఇషాన్ కిషన్‌లలో ఒకరిని కెప్టెన్‌గా ఎంపిక చేసే సాహసం ఆర్సీబీ యాజమాన్యం చేయకపోవచ్చని అభిప్రాయపడ్డాడు. కాగా, హోల్డర్.. ఇప్పటివరకు 26 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 121 స్ట్రయిక్ రేట్‌తో 189 పరుగులు, 8.20 ఎకానమీతో 35 వికెట్లు పడగొట్టాడు.
చదవండి: ఫుట్‌బాల్ మైదానంలో విషాదం.. 8 మంది మృతి
Comments
Please login to add a commentAdd a comment