
కోహ్లితో రోహిత్ శర్మ (PC: BCCI)
Ex-IND opener on T20WC selection: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి టీ20 ప్రపంచకప్-2024లో ఆడతారా లేదా? అన్న అంశంపై క్రీడావర్గాల్లో చర్చ కొనసాగుతూనే ఉంది. వన్డే ప్రపంచకప్ టోర్నీకి సిద్ధమయ్యే క్రమంలో వీరిద్దరు ఏడాది కాలంగా అంతర్జాతీయ టీ20లకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలో వన్డే వరల్డ్‌కప్-2023 ముగిసిన తర్వాత ‘విరాహిత్’ ద్వయం తిరిగి పొట్టి ఫార్మాట్లో టీమిండియా తరఫున పునరాగమనం చేస్తారని అంతా భావించారు. ప్రపంచకప్ టోర్నీ తర్వాత స్వదేశంలో ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌కు దూరమైనప్పటికీ.. సౌతాఫ్రికా పర్యటన నాటికి అందుబాటులో ఉంటారనే వార్తలు వచ్చాయి.
సౌతాఫ్రికాతో సిరీస్‌కూ దూరం
కానీ.. రోహిత్, కోహ్లి ఈ టూర్‌లో టీ20లతో పాటు, వన్డేలకు కూడా దూరమయ్యారు. కాగా దక్షిణాఫ్రికాతో సిరీస్ తర్వాత టీమిండియా.. వరల్డ్‌కప్-2024కు ముందు అఫ్గనిస్తాన్‌తో మాత్రమే టీ20 సిరీస్ ఆడనుంది. అంటే.. ఇక మొత్తంగా ఆరు మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయి.
ఇందులో డిసెంబరులో సౌతాఫ్రికాతో మూడు, అఫ్గనిస్తాన్‌తో మూడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది. కాబట్టి అఫ్గన్‌తో సిరీస్ నాటికైనా వీళ్లిద్దరు అందుబాటులో లేకపోతే పరిస్థితి ఏమిటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ విషయంలో తనకు ఎదురైన ప్రశ్నకు బదులిస్తూ టీమిండియా మాజీ బ్యాటర్, కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ కీలక వ్యాఖ్యలు చేశాడు.
ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం
‘‘జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు ఊహించగలరు? రేపు ఏం జరుగుతుందో చెప్పగలమా? ఇప్పటి వరకు మనం చాలా వరల్డ్‌కప్ మ్యాచ్‌లు ఆడాం. కానీ ఆఖరి వరకు వెళ్లినా గెలవలేకపోతున్నాం.
వరల్డ్‌కప్ ఫైనల్ దశలో చేస్తున్న తప్పులను సమీక్షించుకుని సరిచేసుకోవాల్సి ఉంటుంది. నిజానికి వరల్డ్‌కప్ ముందు వరకు అద్భుత ఫామ్‌లో ఉన్న ఆటగాళ్లను మాత్రమే ఎంపిక చేసుకోవడం అత్యంత ముఖ్యమైన అంశం.
కోహ్లి నిరూపించుకోవాలి.. రోహిత్‌కు అతడితో పోటీ
కాబట్టి.. తాను యువ ఆటగాళ్ల కంటే మంచి ఫామ్‌లో ఉన్నాను, మెరుగ్గా ఆడుతున్నానని విరాట్ కోహ్లి నిరూపించుకోవాలి. అదే విధంగా రోహిత్ శర్మ కూడా టీ20 బ్యాటర్‌గా, కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యాతో పోటీ పడాల్సి ఉంది’’ అని సంజయ్ మంజ్రేకర్ పేర్కొన్నాడు.
బ్యాటింగ్ ఫామ్‌ను బట్టే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి వరల్డ్‌కప్‌లో ఆడతారా లేదా అన్నది తేలుతుందని.. అయితే, అంతకంటే ముందు వాళ్లు మ్యాచ్‌లు ఆడాల్సి ఉందని మంజ్రేకర్ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డాడు. కాగా సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని యువ టీమిండియా ఆస్ట్రేలియాను 4-1తో ఓడించి టీ20 సిరీస్ గెలిచింది. కాగా టీ20 వరల్డ్‌కప్-2024 జూన్ 4 నుంచి మొదలుకానుంది. అంతకంటే ముందు ఐపీఎల్ రూపంలో మరో మెగా టోర్నీ జరుగనుంది.
చదవండి: ఇంగ్లండ్‌పై శతక్కొట్టిన విండీస్ కెప్టెన్.. ఇదంతా ధోని వల్లే అంటూ!
Comments
Please login to add a commentAdd a comment