ముంబై ఇండియన్స్ పేస్ గన్ గెరాల్డ్ కొయెట్జీ 2024 ఐపీఎల్ సీజన్‌లో అత్యంత వేగవంతమైన బంతిని సంధించాడు. రాజస్థాన్ రాయల్స్‌తో నిన్న (ఏప్రిల్ 1) జరిగిన మ్యాచ్‌లో కొయెట్జీ ఈ ఫీట్‌ను నమోదు చేశాడు. రియాన్ పరాగ్ ఎదుర్కొన్న మ్యాచ్ చివరి బంతిని కొయెట్జీ రికార్డు స్థాయిలో 157.4 కిమీ వేగంతో బౌల్ చేశాడు. ఈ సీజన్‌లో ఇదే అత్యంత వేగవంతమైన బంతిగా రికార్డైంది.
సరిగ్గా రెండు రోజుల ముందు లక్నో పేసర్ మయాంక్ యాదవ్ ఈ సీజన్ ఫాస్టెస్ట్ డెలివరీని సంధించాడు. పంజాబ్‌తో జరిగిన తన డెబ్యూ మ్యాచ్‌లోనే మయాంక్ రికార్డు స్థాయిలో 155.8 కిమీ వేగంతో బంతిని వేశాడు. తాజాగా కొయెట్జీ మయాంక్ వేగాన్ని అధిగమించి ఈ సీజన్ ఫాస్టెస్ట్ డెలివరీ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ బంతి ఐపీఎల్ చరిత్రలోనే రెండో వేగవంతమైన బంతిగానూ రికార్డుల్లోకెక్కింది. కొయెట్జీ సంధించిన ఈ సీజన్ వేగవంతమైన బంతిని రియాన్ పరాగ్ బౌండరీకి తరలించి మ్యాచ్‌ను గెలిపించడం కొసమెరుపు.
కాగా, ముంబై ఇండియన్స్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ సీజన్‌లో రాజస్థాన్‌కు ఇది వరుసగా మూడో విజయం కాగా.. ముంబైకు హ్యాట్రిక్ పరాజయం. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై చెత్త ప్రదర్శనను కనబర్చి నిర్ణీత ఓవర్లలో కేవలం 125 పరుగులు మాత్రమే చేయగలిగింది.
ముంబై ఇన్నింగ్స్‌లో రోహిత్ సహా ముగ్గురు (నమన్ ధీర్, డెవాల్డ్ బ్రెవిస్) గోల్డెన్ డకౌట్లయ్యారు. తిలక్ వర్మ (32), హార్దిక్ (34) ఓ మోస్తరు స్కోర్లు చేయడంతో ముంబై ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. బౌల్ట్ (4-0-22-3), చహల్ (4-0-11-3), బర్గర్ (4-0-32-2), ఆవేశ్ ఖాన్ (4-0-30-1) అద్భుతంగా బౌలింగ్ చేసి ముంబైని వణికించారు.
అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రాజస్థాన్.. 15.3 ఓవర్లలో ఆడుతూపాడుతూ విజయతీరాలకు చేరింది. రియాన్ పరాగ్ (54 నాటౌట్) మరో మెరుపు ఇన్నింగ్స్ ఆడి రాజస్థాన్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. యశస్వి (10), బట్లర్ (13) మరోసారి నిరాశపరిచారు. సంజూ శాంసన్ 12, అశ్విన్ 16 పరుగులు చేసి ఔటయ్యారు. ముంబై బౌలర్లలో ఆకాశ్ మధ్వాల్ 3 వికెట్లు పడగొట్టగా.. మఫాక తన మొట్టమొదటి ఐపీఎల్ వికెట్ దక్కించుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment