Tilak Varma- Ind Vs WI T20 Series: ‘‘అసలు నేను జాతీయ జట్టులో చోటు గురించి ఆలోచించలేదు. నా చిన్ననాటి స్నేహితుడు ఫోన్ చేసి నేను టీమిండియాకు ఎంపికయ్యాను అని చెప్పాడు. అప్పుడు రాత్రి 8 గంటలు అవుతోందనకుంటా. తను చెప్పిన తర్వాతే నాకు ఈ విషయం తెలిసింది.
మా అమ్మానాన్న అయితే వీడియోకాల్‌లో మాట్లాడుతూ ఏడ్చేశారు. వాళ్లిద్దరు బాగా ఎమోషనల్ అయ్యారు’’ అంటూ హైదరాబాదీ బ్యాటర్ తిలక్ వర్మ ఉద్వేగానికి లోనయ్యాడు. టీమిండియాకు ఆడే అవకాశం ఇంత త్వరగా వస్తుందని ఊహించలేదంటూ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు.
పైసా వసూల్ ప్రదర్శన
కాగా దేశవాళీ క్రికెట్‌లో అదరగొట్టిన తిలక్ వర్మను ఐపీఎల్-2022 మెగా వేలం సందర్భంగా ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది. ఈ యువ బ్యాటర్ కోసం ఏకంగా 1.7 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. అందుకు బదులుగా.. క్యాష్ రిచ్ లీగ్‌లో ఆడిన తొలి సీజన్‌లోనే అంచనాలకు మించి రాణించి పైసా వసూల్ ప్రదర్శన ఇచ్చాడు.
ఆడిన 14 మ్యాచ్‌లలో కలిపి 397 పరుగులు సాధించి ఐపీఎల్-2022లో ముంబై తరఫున అత్యధిక రన్స్ తీసిన రెండో బ్యాటర్(ఇషాన్ కిషన్- 418 పరుగులు)గా నిలిచాడు. ఇక తాజా ఎడిషన్‌లో 11 ఇన్నింగ్స్ ఆడిన తిలక్ వర్మ 343 పరుగులు(గాయం కారణంగా కొన్ని మ్యాచ్‌లకు దూరం కావడం ప్రభావం చూపింది) సాధించాడు.
విండీస్‌తో ఆడే జట్టులో చోటు
ఈ క్రమంలో వెస్టిండీస్ పర్యటన నేపథ్యంలో టీ20 సిరీస్‌కు ఎంపిక చేసిన టీమిండియాలో చోటు సంపాదించాడు తిలక్. అన్నీ కుదిరితే కరేబియన్ గడ్డపై అతడు అరంగేట్రం చేసే అవకాశం కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఈఎస్‌పీఎన్‌క్రిక్‌ఇన్ఫోతో మాట్లాడుతూ తిలక్ వర్మ సంతోషం వ్యక్తం చేశాడు. టీమిండియాకు ఆడాలన్న తన కల నెరవేరబోతున్నందుకు ఆనందంగా ఉందన్నాడు.
కాగా సాధారణ ఎలక్ట్రిషియన్ కుటుంబంలో జన్మించిన తిలక్ వర్మ క్రికెటర్‌గా ఎదిగే క్రమంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాడు. అయితే, అడుగడుగునా తల్లిదండ్రులు అండగా నిలవడంతో సమస్యలు, సవాళ్లు అధిగమించి టీమిండియాకు ఆడే స్థాయికి చేరుకున్నాడు.
తద్వారా తనలాంటి ఎంతో మంది వర్ధమాన క్రికెటర్లకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాడు తిలక్ వర్మ. ఇక ఇప్పటికే హైదరాబాదీ బౌలర్ మహ్మద్ సిరాజ్ టీమిండియా ప్రధాన పేసర్‌గా ఎదుగుతున్న తరుణంలో తిలక్ కూడా భారత జట్టులో చోటు దక్కించుకోవడం పట్ల అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా సౌత్ జోన్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న తిలక్ వర్మ ప్రస్తుతం దులిప్ ట్రోఫీ-2023 సెమీస్ నేపథ్యంలో బెంగళూరులో బిజీగా ఉన్నాడు.
వెస్టిండీస్‌తో టి20 సిరీస్‌కు టీమిండియా:
ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శుబ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, సూర్య కుమార్ యాదవ్ (వైస్ కెప్టెన్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (కెప్టెన్), అక్షర్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్, అర్ష్దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్, అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్.
చదవండి: వన్డే వరల్డ్‌కప్‌కు అర్హత సాధించిన శ్రీలంక, నెదర్లాండ్స్.. భారత షెడ్యూల్ ఇలా..!
ఒక్క బంతి ఎక్కువ తీసుకున్నా గోవిందా! నాడు తండ్రి సచిన్ వికెట్ తీసి.. ఇప్పుడేమో
Comments
Please login to add a commentAdd a comment