రోహిత్‌, స్కై కాదు!.. వరల్డ్‌కప్‌లో ఒకే ఓవర్లో 6 సిక్స్‌లు కొట్టేది ఇతడే! | Not Rohit Or SKY: Hardik Pandya Can Hit 6 6s At T20 WC Says India Great | Sakshi
Sakshi News home page

రోహిత్‌, స్కై కాదు!.. వరల్డ్‌కప్‌లో ఒకే ఓవర్లో 6 సిక్స్‌లు కొట్టేది ఇతడే!

Published Sat, Apr 27 2024 1:04 PM | Last Updated on Sat, Apr 27 2024 1:04 PM

Not Rohit Or SKY: Hardik Pandya Can Hit 6 6s At T20 WC Says India Great

2007.. అంతర్జాతీయ క్రికెట్‌ మండలి మొట్టమొదటి సారి నిర్వహించిన టీ20 వరల్డ్‌కప్‌ టోర్నీలో నాటి టీమిండియా స్టార్‌ యువరాజ్‌ సింగ్‌ సృష్టించిన పరుగుల విధ్వంసాన్ని అభిమానులు అంత తేలికగా మర్చిపోలేరు.

ఒకే ఓవర్లో ఏకంగా ఆరు సిక్సర్లు బాది యువీ అభిమానులకు కన్నుల పండుగ చేశాడు. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో స్టువర్ట్‌ బ్రాడ్‌ బౌలింగ్‌లో ఆరు బంతుల్లో ఆరు సిక్స్‌లు కొట్టి ఏకంగా 36 పరుగులు పిండుకుని.. ప్రపంచంలో ఈ ఘనత సాధించిన తొలి క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు.

‘న భూతో న భవిష్యతి’ అన్న రీతిలో తాను సాధించిన ఘనత గురించి ఎదురైన ప్రశ్నకు యువరాజ్‌ సింగ్‌ ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. టీ20 ప్రపంచకప్‌-2024లో టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా తన ఫీట్‌ను పునరావృతం చేయగలడని భావిస్తున్నట్లు తెలిపాడు.

జూన్‌ 1 నుంచి అమెరికా- వెస్టిండీస్‌ వేదికగా వరల్డ్‌కప్‌ ఈవెంట్‌ ఆరంభం కానున్న విషయం తెలిసిందే. ఈ ఐసీసీ టోర్నీ కోసం మే 1 లోపు జట్లను ప్రకటించేందుకు ఇరవై దేశాల బోర్డులు సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో టీమిండియా ఎంపిక గురించి ఇప్పటికే చాలా మంది మాజీ క్రికెటర్లు తమ అభిప్రాయాలు పంచుకున్నారు.

అతడికి కూడా ఛాన్స్‌ ఇవ్వాలి
ఐపీఎల్‌-2024లో పేలవ ప్రదర్శన కనబరుస్తున్న పేస్‌ ఆల్‌రౌండర్‌, ముంబై ఇండియన్స్‌ సారథి హార్దిక్‌ పాండ్యాకు ఈ జట్టులో చోటు దక్కడం కష్టమేనని భావిస్తున్నారు. అతడికి బదులు చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆల్‌రౌండర్‌ శివం దూబేకు ఛాన్స్‌ ఇవ్వాలని బీసీసీఐకి విజ్ఞప్తి చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఐసీసీతో మాట్లాడిన సందర్భంగా.. ‘‘ఈసారి వరల్డ్‌కప్‌లో ఒకే ఓవర్లో ఆరు సిక్స్‌లు కొట్టగల సత్తా ఎవరికి ఉంది?’’ అని యువరాజ్‌ సింగ్‌కు ప్రశ్న ఎదురైంది. ఇందుకు బదులిస్తూ.. ‘‘నేనైతే హార్దిక్‌ పాండ్యానే సాధిస్తాడనుకుంటున్నా’’ అని యువీ పేర్కొన్నాడు. 

అదే సమయంలో ప్రపంచకప్‌ జట్టులో శివం దూబేకు కూడా చోటు ఇవ్వాలని యువీ అభిప్రాయపడ్డాడు. ‘‘టీమిండియాలో అతడికి సుస్థిర స్థానం ఉండటం లేదు. కానీ ఐపీఎల్‌లో మాత్రం బ్యాటింగ్‌తో అదరగొడుతున్నాడు.

కాబట్టి అతడిని జట్టులోకి తీసుకుంటే ఉపయోగకరంగా ఉంటుంది’’ అని యువరాజ్‌ సింగ్‌ పేర్కొన్నాడు. కాగా వరల్డ్‌కప్‌-2024లో జూన్‌ 5న టీమిండియా ఐర్లాండ్‌తో తమ తొలి మ్యాచ్‌ ఆడనుంది. జూన్‌ 9న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో అమీతుమీ తేల్చుకోనుంది.

ఇక తొట్టతొలి పొట్టి ప్రపంచకప్‌-2007ను ధోని సేన గెలుచుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత ఇంత వరకు మళ్లీ టీ20 ఫార్మాట్లో టీమిండియా టైటిల్‌ గెలవలేదు.

చదవండి: సహనం కోల్పోయిన గంభీర్‌... అంపైర్‌తో గొడవ! ఆఖరికి..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement