New Zealand vs England, 2nd Test- Day 2 Highlights: న్యూజిలాండ్‌తో రెండో టెస్టులో ఇంగ్లండ్ బౌలర్లు అద్భుత ఆట తీరు కనబరుస్తున్నారు. రెండో రోజు ఆటలో వెటరన్ పేసర్ జేమ్స్ ఆండర్సన్ స్పిన్నర్ జాక్ లీచ్ కివీస్ బ్యాటింగ్ పతనాన్ని శాసించారు.
కీలక వికెట్లు పడగొట్టి ఆతిథ్య జట్టుకు కోలుకోలేని షాకిచ్చారు. ఆండర్సన్, జాక్ లీచ్ విజృంభణతో శనివారం నాటి ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 297 పరుగుల భారీ ఆధిక్యంలో నిలిచింది.
భారీ ఆధిక్యంలో..
రెండు మ్యాచ్‌ల సిరీస్ కోసం ఇంగ్లండ్ న్యూజిలాండ్‌లో పర్యటిస్తోంది. ఇందులో భాగంగా మౌంట్‌మాంగనీయ్‌లో జరిగిన తొలి టెస్టులో పర్యాటక ఇంగ్లండ్ 267 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. ఈ క్రమంలో వెల్లింగ్‌టన్‌లో శుక్రవారం(ఫిబ్రవరి 24) మొదలైన రెండో టెస్టులోనూ స్టోక్స్ బృందం ఆధిపత్యం కొనసాగిస్తోంది.
తొలిరోజు ఆటలో ఇంగ్లండ్ 65 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 315 పరుగులు చేసింది. హ్యారీ బ్రూక్ (169 బంతుల్లో 184 బ్యాటింగ్; 24 ఫోర్లు, 5 సిక్స్‌లు) చెలరేగి సెంచరీ సాధించగా... జో రూట్ (182 బంతుల్లో 100 బ్యాటింగ్; 7 ఫోర్లు) కెరీర్‌లో 29వ సెంచరీ చేశాడు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 294 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. వర్షం కారణంగా తొలి రోజు ఆటను 65 ఓవర్ల వద్ద ముగించారు.
బ్రూక్, రూట్ సెంచరీలతో చెలరేగి
అంతకుముందు ఇంగ్లండ్ 21 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడినా బ్రూక్, రూట్ సెంచరీలతో ఆదుకున్నారు. ఈ క్రమంలో రెండో రోజు ఆటలో రూట్ 153 పరుగులతో అజేయంగా నిలవగా.. హ్యారీ బ్రూక్ తన స్కోరుకు మరో రెండు పరుగులు(186) జతచేసి అవుటయ్యాడు.
మిగిలిన వాళ్లు పెద్దగా రాణించకపోవడంతో 87.1 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 435 పరుగుల వద్ద పర్యాటక ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌కు ఇంగ్లండ్ బౌలర్లు ఆది నుంచే చుక్కలు చూపించారు.
చెలరేగిన ఆండర్సన్, జాక్ లీచ్
డెవాన్ కాన్వేను జేమ్స్ ఆండర్సన్ తొలి వికెట్ అందించగా.. మరో ఓపెనర్ టామ్ లాథమ్ వికెట్‌ను జాక్ లీచ్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక విలియమ్సన్ 4 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఆండర్సన్ బౌలింగ్‌లో వెనుదిరగగా.. 2 పరుగులకే విల్ యంగ్‌ను ఆండర్సన్ పెవిలియన్‌కు పంపాడు.
వరణుడి ఆటంకం
హెన్రీ నికోల్స్, డారిల్ మిచెల్ వికెట్లను జాక్ లీచ్ పడగొట్టాడు. మిచెల్ బ్రాస్‌వెల్ రూపంలో స్టువర్ట్ బ్రాడ్‌కు ఒక వికెట్ దక్కింది. ఇక వర్షం మరోసారి ఆటంకం కలిగించడంతో రెండో రోజు టీ బ్రేక్ సమయానికే ఆట ముగించాల్సి వచ్చింది. అప్పటికి కివీస్ 42 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 138 పరుగులు మాత్రమే చేసింది.
ఇంగ్లండ్ కంటే 297 పరుగులు వెనుకబడింది సౌథీ బృందం. గత మ్యాచ్‌లో సెంచరీతో మెరిసిన వికెట్ కీపర్ బ్యాటర్ టామ్ బ్లండెల్ 25, కెప్టెన్ టిమ్ సౌథీ 23 పరుగులతో క్రీజులో ఉన్నారు. కాగా తొలి టెస్టులో ఏడు వికెట్లు తీసిన ఆండర్సన్ ఐసీసీ టెస్టు బౌలర్ల ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరుకున్న విషయం తెలిసిందే.
చదవండి: Ind Vs Aus: ఏదో ఒకటి చేయండి.. లేదంటే పోటుగాళ్లు కాదు.. పొట్లం అయిపోతారు!
WTC NZ Vs SL: కివీస్‌తో సిరీస్‌కు లంక జట్టు ప్రకటన.. అదే జరిగితే టీమిండియాతో పాటు ఫైనల్లో!
Comments
Please login to add a commentAdd a comment