New Zealand vs Pakistan, 4th T20I: న్యూజిలాండ్ పర్యటనలో పాకిస్తాన్ వైఫల్యాల పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే ఆతిథ్య జట్టుకు సిరీస్ సమర్పించుకున్న షాహిన్ ఆఫ్రిది బృందం.. నాలుగో టీ20లోనూ ఓటమి పాలైంది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో ఓడి మరో పరాభవం మూటగట్టుకుంది.
క్రైస్ట్‌చర్చ్ వేదికగా టాస్ ఓడిన పాకిస్తాన్.. న్యూజిలాండ్ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్ సయీమ్ ఆయుబ్(1) ఆదిలోనే అవుట్ కాగా.. వన్‌డౌన్ బ్యాటర్ బాబర్ ఆజం(19), ఆ తర్వాతి స్థానాల్లో బ్యాటింగ్ చేసిన ఫఖర్ జమాన్(9), షాహిజాదా ఫర్హాన్(1), ఇఫ్తికర్ అహ్మద్ (10) పూర్తిగా విఫలమయ్యారు.
ఇలా ఓవైపు వరుసగా వికెట్లు పడుతున్నా మరో ఓపెనింగ్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ మాత్రం అద్భుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. 63 బంతులు ఎదుర్కొన్న ఈ వికెట్ కీపర్ బ్యాటర్ ఆరు ఫోర్లు, రెండు సిక్స్‌ల సాయంతో 90 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు.
రిజ్వాన్‌కు తోడు మహ్మద్ నవాజ్(9 బంతుల్లో 23 రన్స్- నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో నిర్ణీత 20 ఓవర్లలో పాకిస్తాన్ 5 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది.
ఇక లక్ష్య ఛేదనకు దిగిన న్యూజిలాండ్‌కు పాక్ కెప్టెన్ షాహిన్ ఆఫ్రిది ఆరంభంలోనే షాకిచ్చాడు. కివస్ టాపార్డర్‌ను కకావికలం చేశాడు. ఈ ఫాస్ట్‌బౌలర్ ధాటికి ఓపెనర్లు ఫిన్ అలెన్ 8, టిమ్ సెఫార్ట్ 0 వచ్చీ రాగానే మైదానం వీడగా.. విల్ యంగ్ 4 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.
దీంతో పాకిస్తాన్‌కు శుభారంభం లభించింది. కానీ.. డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్ వచ్చిన తర్వాత ఒక్కసారిగా మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. వీరిద్దరు తుపాన్ ఇన్నింగ్స్ కారణంగా పాకిస్తాన్‌కు మరోసారి ఘోర అవమానం తప్పలేదు.
డారిల్ మిచెల్ 44 బంతుల్లో 72 పరుగులు(7 ఫోర్లు, 2 సిక్స్‌లు), గ్లెన్ ఫిలిప్స్ 52 బంతుల్లో 70 పరుగుల(5 ఫోర్లు, 3 సిక్సర్లు)తో అజేయంగా నిలిచి న్యూజిలాండ్‌ను విజయతీరాలకు చేర్చారు. వీరిద్దరి అద్భుత ఇన్నింగ్స్ కారణంగా కివీస్ 18.1 ఓవర్లలోనే కేవలం మూడు వికెట్లు నష్టపోయి లక్ష్యాన్ని ఛేదించింది.
దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 4-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. క్లీన్ స్వీప్ లక్ష్యంగా ఆఖరి మ్యాచ్‌లో బరిలోకి దిగనుంది. ఇక పాక్‌తో నాలుగో టీ20లో ఆకట్టుకునే ప్రదర్శన చేసిన డారిల్ మిచెల్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
Victory in Christchurch! #NZvPAK pic.twitter.com/5PZKPIzemF
— BLACKCAPS (@BLACKCAPS) January 19, 2024
Comments
Please login to add a commentAdd a comment