ఇస్లామాబాద్: పాకిస్తాన్ పేసర్ మహ్మద్ ఆమిర్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. జట్టు యాజమాన్యం తన పట్ల ప్రవర్తిస్తున్న తీరుకు నిరసనగా గురువారం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాడు. ‘‘ఇకపై ఇంటర్నేనషనల్ క్రికెట్ ఆడటం నాకు ఇష్టం లేదు. పరిమిత ఓవర్ల క్రికెట్‌కు నేను ఎల్లప్పుడూ అందుబాటులోనే ఉన్నాను. కానీ మేనేజ్‌మెంట్ నన్ను మానసిక వేధింపులకు గురిచేసింది. అది అస్సలు ఆమోదయోగ్యం కాదు’’ అని 28 ఏళ్ల ఆమిర్ ఆటకు వీడ్కోలు పలుకుతున్నట్లు వెల్లడించాడు. (చదవండి: ‘కోహ్లికి కాదు.. మా బ్యాట్స్‌మన్‌కే కష్టం’)
ఈ విషయంపై స్పందించిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ఆమిర్ రిటైర్‌మెంట్‌ను ధ్రువీకరించింది. ఈ మేరకు... ‘‘ఈరోజు మధ్యాహ్నం పీసీబీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ వసీం ఖాన్ ఆమిర్‌తో మాట్లాడారు. తనకు ఇకపై ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడే ఉద్దేశం లేదని అతడు చెప్పాడు. కాబట్టి ఇకపై సెలక్షన్ సమయంలో తనను పరిగణనలోకి తీసుకోం. రిటైర్‌మెంట్ అనేది ఆమిర్ పూర్తి వ్యక్తిగత నిర్ణయం. దానిని మేం గౌరవిస్తాం’’ అని పత్రికా ప్రకటన విడుదల చేసింది. కాగా పాకిస్తాన్ తరఫున 147 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన ఆమిర్.. మొత్తంగా 259 వికెట్లు తీశాడు. 2009 టీ20 వరల్డ్ కప్, 2017 ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన జట్టులో అతడు సభ్యుడు.
ఆది నుంచి వివాదాస్పదమే
2010లో వెలుగులోకి వచ్చిన మహ్మద్ ఆమిర్ లెఫ్టార్మ్ పేసర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అతడి బౌలింగ్ శైలికి ఫిదా అయిన పాకిస్తాన్ దిగ్గజం వసీం అక్రం.. తాను చూసిన అత్యంత ప్రతిభావంతమైన ఫాస్ట్‌బౌలర్ అతడేనంటూ కొనియాడాడు. అలా ఎంతో మంది చేత ప్రశంసలు అందుకున్నాడు. ఇక ఐదేళ్లపాటు సాఫీగా సాగిపోయిన ఆమిర్ ప్రయాణానికి స్పాట్ ఫిక్సింగ్ కేసు బ్రేక్ వేసింది. ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో అప్పటి కెప్టెన్ సల్మాన్‌బట్, మహ్మద్ ఆసిఫ్‌తో కలిసి ఫిక్సింగ్ చేస్తూ పట్టుబడి నిషేధం ఎదుర్కొన్నాడు. అనేక పరిణామాల అనంతరం 2016లో తిరిగి అంతర్జాతీయ క్రికెట్‌లో తిరిగి అడుగుపెట్టిన ఆమిర్.. చాంపియన్స్ ట్రోఫీ(2017)లో భారత్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో మూడు కీలక వికెట్లు తీసి సత్తా చాటాడు. కాగా గతేడాది వన్డే ప్రపంచకప్‌లో మొత్తంగా 17 వికెట్లు తీసి పాక్ జట్టు బెస్ట్ బౌలర్‌గా నిలిచాడు.
ఇక సంప్రదాయ టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అనంతరం.. లీగ్ క్రికెట్ ద్వారా డబ్బు సంపాదించేందుకే ఆమిర్ ఈ నిర్ణయం తీసుకున్నాడంటూ పాక్ జట్టు బౌలింగ్ కోచ్ వకార్ యూనిస్ అతడిని విమర్శించాడు. అయితే తన శరీరం, ఆరోగ్య పరిస్థితి గురించి తనకు మాత్రమే తెలుసునని, తన నిర్ణయాన్ని ఎవరూ తప్పుపట్టాల్సిన అవసరం లేదంటూ కౌంటర్ ఇచ్చాడు. ఈ క్రమంలో జట్టు యాజమన్యంతో అతడికి విభేదాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో జింబాబ్వే జట్టుతో జరిగిన వన్డే, టి20 సిరీస్‌ల కోసం 22 మందితో కూడిన ప్రాబబుల్స్ జట్టులో అతడికి చోటు లభించలేదు. అదే విధంగా న్యూజిలాండ్ పర్యటనకు కూడా ఆమిర్‌ను ఎంపిక చేయలేదు. ఈ నేపథ్యంలో తాను ఆట నుంచి వైదొలుగుతున్నట్లు అతడు ప్రకటించడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment