గుజరాత్ జెయింట్స్‌పై విజయం
10 పాయింట్లతో మెరిసిన అయాన్
నోయిడా: ప్రొ కబడ్డీ లీగ్‌లో మాజీ చాంపియన్ పట్నా పైరేట్స్ జోరు కొనసాగుతోంది. గుజరాత్ జెయింట్స్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో పట్నా పైరేట్స్ 40–27 పాయింట్లతో ఏకపక్ష విజయం సాధించింది. పైరేట్స్ తరఫున రెయిడర్ అయాన్ 10 పాయింట్లతో టాపర్‌గా నిలవగా... దేవాంక్ (6 పాయింట్లు), సందీప్ (5 పాయింట్లు) సహకరించారు. గుజరాత్ ఆటగాళ్లలో అంతా సమష్టి ప్రదర్శన చేసినా అది ఓటమి నుంచి తప్పించుకునేందుకు సరిపోలేదు.
గుమన్ సింగ్, పార్తీక్ దహియా చెరో 5 పాయింట్లు స్కోరు చేశారు. తొలి అర్ధభాగంలో 21–16తో ముందంజలో నిలిచిన పట్నా చివరి వరకు దానిని నిలబెట్టుకుంది. టోర్నీ తొలి మ్యాచ్‌లో నెగ్గిన గుజరాత్ టీమ్‌కు ఇది వరుసగా ఏడో పరాజయం కావడం విశేషం. పట్టికలో ప్రస్తుతం పట్నా పైరేట్స్ నాలుగో స్థానంలో (27 పాయింట్లు), గుజరాత్ జెయింట్స్ చివరి స్థానంలో (7 పాయింట్లు) కొనసాగుతున్నాయి. నేడు జరిగే పోటీల్లో జైపూర్ పింక్ పాంథర్స్‌తో బెంగళూరు బుల్స్... పుణేరీ పల్టన్‌తో దంబగ్ ఢిల్లీ తలపడతాయి.
హరియాణా స్టీలర్స్ హ్యాట్రిక్
మరోవైపు హరియాణా స్టీలర్స్ జట్టు తమ అగ్రస్థానాన్ని మరింత పటిష్ట పర్చుకుంది. లీగ్‌లో వరుసగా మూడో విజయంతో స్టీలర్స్ నంబర్‌వన్‌గా కొనసాగుతోంది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో హరియాణా 48–39 పాయింట్ల తేడాతో మాజీ చాంపియన్ యు ముంబాను ఓడించింది. విశాల్, శివమ్, మొహమ్మద్ రెజా జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. రెయిడర్లు విశాల్, శివమ్ చెరో 11 పాయింట్లతో సత్తా చాటగా... ఆల్‌రౌండర్ రెజా 10 పాయింట్లు సాధించాడు. ముంబా తరఫున అజిత్ చౌహాన్ ఒంటరి పోరాటం చేసినా లాభం లేకపోయింది.
రెయిడర్ అజిత్ ఒక్కడే ఏకంగా 18 పాయింట్లు సాధించగా... మిగతా వారంతా విఫలమయ్యారు. తొలి అర్ధ భాగం ముగిసేసరికి ముంబా 23–23 పాయింట్లతో ఆధిక్యంలో ఉన్నా... రెండో అర్ధభాగంలో అనూహ్యంగా వెనుకబడిపోయింది. ముంబా 16 పాయింట్లు మాత్రమే సాధించగా... హరియాణా ఖాతాలో 25 పాయింట్లు చేరాయి. 8 మ్యాచ్‌లలో 6 విజయాలు సాధించిన హరియాణా మొత్తం 31 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా... 29 పాయింట్లతో ముంబా మూడో స్థానంలో కొనసాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment