
సౌతాఫ్రికాతో తొలి వన్డేలో టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్‌ను దురదృష్టం వెంటాడింది. ఆండిలే ఫెహ్లుక్వాయో బౌలింగ్‌లో పంత్ ఔటైనప్పటికి ఆ క్రెడిట్ మొత్తం కీపర్ క్వింటన్ డికాక్‌కే దక్కుతుంది. విషయంలోకి వెళితే.. ఇన్నింగ్స 35వ ఓవర్ తొలి బంతిని ఫెహ్లుక్వాయో లెగ్‌సైడ్ వేయగా.. పంత్ దానిని ఫ్లిక్ చేసే ప్రయత్నం చేశాడు. అయితే బంతి మిస్ అవడం.. పంత్ క్రీజులో నుంచి బయటికి రావడం ఒకేసారి జరిగిపోయింది. ఇక్కడే కీపర్ డికాక్ మెరుపు వేగంతో స్పందించాడు. పంత్ తేరుకునేలోపే సెకన్ల వ్యవధిలో డికాక్ బెయిల్స్ ఎగురగొట్టడం జరిగిపోయింది. దీనిపై లెగ్ అంపైర్ థర్డ్‌అంపైర్‌ను కోరగా.. బిగ్‌స్క్రీన్‌లో పంత్ కాలు గాల్లోనే ఉండడం స్పష్టంగా కనిపించడంతో ఔట్ అని తేలింది. దీంతో 16 పరుగులు చేసిన పంత్ నిరాశగా పెవిలియన్ చేరాడు. ఇక ఈ మ్యాచ్‌లో పంత్ 4వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన సంగతి తెలిసిందే.
ఇక సౌతాఫ్రికాతో తొలి వన్డేలో టీమిండియా 31 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. 297 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 265 పరుగులు మాత్రమే చేయగలిగింది. శిఖర్ ధావన్(75), విరాట్ కోహ్లి(51), శార్ధూల్ ఠాకూర్(50 నాటౌట్) రాణించినప్పటికి వారి మెరుపులు సరిపోలేదు. దీనికి తోడూ మిగతా బ్యాట్స్‌మన్ విఫలం కావడంతో టీమిండియా పరాజయం పాలైంది. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఎంగిడి, తబ్రైజ్ షంసీ, ఆండీ ఫెలుక్యావో తలా రెండు వికెట్లు తీశారు.
Did you see that?👀 #SAvIND #BetwayODISeries #BePartOfIt | @Betway_India pic.twitter.com/bWLdyNIySx
— Cricket South Africa (@OfficialCSA) January 19, 2022