టెస్టు కెప్టెన్‌గానూ అతడు పనికిరాడా?: భారత మాజీ క్రికెటర్‌ | Is Rishabh Pant Not Even A Candidate For Test Captaincy: Aakash Chopra | Sakshi
Sakshi News home page

టెస్టు కెప్టెన్‌గానూ అతడు పనికిరాడా?: టీమిండియా మాజీ క్రికెటర్‌

Published Thu, Aug 15 2024 1:23 PM | Last Updated on Thu, Aug 15 2024 2:28 PM

Is Rishabh Pant Not Even A Candidate For Test Captaincy: Aakash Chopra

టీ20 ప్రపంచకప్‌-2024 తర్వాత టీమిండియాలో పలు కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్‌కు కెప్టెన్‌ రోహిత్‌ శర్మతో పాటు, స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి, కీలక ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా వీడ్కోలు పలకగా.. హెడ్‌కోచ్‌గా రాహుల్‌ ద్రవిడ్‌ ప్రస్థానం కూడా ముగిసిపోయింది. ఈ క్రమంలో టీ20 జట్టు పూర్తిస్థాయి కెప్టెన్‌గా సూర్యకుమార్‌ యాదవ్‌ నియమితుడు కాగా.. గౌతం గంభీర్‌ కోచ్‌గా ద్రవిడ్‌ బాధ్యతలను స్వీకరించాడు.

భవిష్య కెప్టెన్‌గా శుబ్‌మన్‌ గిల్‌
మరోవైపు.. 37 ఏళ్ల రోహిత్‌ శర్మకు డిప్యూటీగా స్టార్‌ ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌ను నియమించింది బీసీసీఐ. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఈ పంజాబీ బ్యాటర్‌కు వైస్‌ కెప్టెన్‌గా బాధ్యతలు అప్పగించింది. అంతేకాదు.. రోహిత్‌, సూర్య గైర్హాజరీలో జింబాబ్వే టీ20 సిరీస్‌కు కెప్టెన్‌గానూ ఎంపిక చేసింది. తద్వారా భవిష్య కెప్టెన్‌గా శుబ్‌మన్‌ గిల్‌ ఉండబోతున్నాడని సంకేతాలు ఇచ్చింది.

ఈ నేపథ్యంలో మరో స్టార్‌ బ్యాటర్‌ రిషభ్‌ పంత్‌ గురించి భారత మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టెస్టుల్లో అద్భుతమైన రికార్డు ఉన్న పంత్‌ను కెప్టెన్‌గా నియమిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు. అయితే, దులిప్‌ ట్రోఫీ-2024 జట్ల ప్రకటన తర్వాత ఈ ఉత్తరాఖండ్‌ బ్యాటర్‌ పేరును బీసీసీఐ భవిష్య కెప్టెన్‌గా పరిగణనలోకి తీసుకోవడం లేదని తెలుస్తోందన్నాడు.

ఆ నలుగురికి ఛాన్స్‌
కాగా సెప్టెంబరు 5 నుంచి మొదలుకానున్న ఈ రెడ్‌బాల్‌ టోర్నీకి సంబంధించిన నాలుగు జట్లను బీసీసీఐ బుధవారం ప్రకటించింది. టీమిండియా స్టార్లు శుబ్‌మన్‌ గిల్‌(టీమ్‌-ఎ), రుతురాజ్‌ గైక్వాడ్‌(టీమ్‌-సి), శ్రేయస్‌ అయ్యర్‌(టీమ్‌-డి)లకు సారథులుగా అవకాశం ఇచ్చిన బీసీసీఐ.. టీమ్‌-బి కెప్టెన్‌గా బెంగాల్‌ స్టార్‌ అభిమన్యు ఈశ్వరన్‌ను నియమించింది. ఈ జట్టులోనే రిషభ్‌ పంత్‌కూ చోటిచ్చింది.

ఈ విషయంపై స్పందించిన ఆకాశ్‌ చోప్రా.. ‘‘రిషభ్‌ పంత్‌ కెప్టెన్‌ కాదా!.. అభిమన్యు ఈశ్వరన్‌ సారథ్యంలో అతడు ఆడాలా? మరేం పర్లేదు. అయితే, టీమిండియా భవిష్య కెప్టెన్‌గా భావిస్తున్న పంత్‌ను.. ఈ టోర్నీలో సారథిగా ఎంపిక చేయకపోవడం ఆశ్చర్యం కలిగించింది.

ఏకైక వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌గా చరిత్ర
వ్యక్తిగతంగా నేనేమీ పంత్‌ను సమర్థించడం లేదు. టెస్టు క్రికెటర్‌గా అతడి గణాంకాల ఆధారంగానే మాట్లాడుతున్నా. సౌతాఫ్రికా, ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా గడ్డపై శతకాలు బాదిన భారత ఏకైక వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు పంత్‌. కెప్టెన్‌గా తనకంటే గొప్ప ఆటగాడు మరెవరు ఉంటారు? అయినా.. సరే తనను పక్కనపెట్టారు. 

దీనిని బట్టి టీమిండియా పగ్గాలు అప్పజెప్పే సూచనలూ కనిపించడం లేదు’’ అని ఆకాశ్‌ చోప్రా తన అభిప్రాయాలు పంచుకున్నాడు. కాగా 2022 డిసెంబరులో రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన పంత్‌.. దాదాపు ఏడాదిన్నరపాటు జట్టుకు దూరమయ్యాడు. ఐపీఎల్‌-2024 ద్వారా పునరాగమనం చేసిన ఈ వికెట్‌ కీపర్‌.. టీ20 ప్రపంచకప్‌-2024లోనూ సత్తా చాటాడు.

చదవండి: గంభీర్‌ ప్లాన్‌ అదుర్స్‌: బౌలింగ్‌ కోచ్‌గా మోర్కెల్‌ ఎంపికకు కారణం ఇదే!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement