టీ20 వరల్డ్‌కప్-2024 టోర్నీ ఆసాంతం అద్బుతమైన ప్రదర్శన కనబరిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. ఫైనల్లో మాత్రం విఫలమయ్యాడు. బార్బడోస్‌లోని కెన్సింగ్టన్ ఓవల్ వేదికగా దక్షిణాఫ్రికాతో ఫైనల్ మ్యాచ్‌లో రోహిత్ కేవలం 9 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు.
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు తొలి ఓవర్‌లో మంచి ఆరంభం లభించింది. జానెసన్ మొదటి ఓవర్‌లో ఏకంగా 15 పరుగులచ్చాయి. వెంటనే దక్షిణాఫ్రికా కెప్టెన్ ఎవరూ ఊహించని విధంగా స్పిన్నర్ కేశవ్ మహారాజ్‌ను ఎటాక్‌లో తీసుకువచ్చాడు.
మహారాజ్ వేసిన రెండో ఓవర్‌లో తొలి రెండు బంతులను స్విప్ ఆడి బౌండరీలగా మలిచిన రోహిత్.. మూడో బంతిని డిఫెన్స్ ఆడాడు. అయితే నాలుగో బంతిని మళ్లీ రివర్స్ స్వీప్ ఆడటానికి ప్రయత్నించాడు. కానీ ఈసారి మాత్రం బంతి నేరుగా బ్యాక్‌వర్డ్ స్క్వేర్ లెగ్‌లో ఉన్న క్లాసెన్ చేతికి వెళ్లిపోయింది.
దీంతో రోహిత్ నిరాశతో మైదానాన్ని వీడాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు అంత తొందరెందుకు రోహిత్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇక ఈ మ్యాచ్‌లో రోహిత్, పంత్, సూర్యకుమార్ యాదవ్ విఫలమైనప్పటకి భారత్ మాత్రం భారీ స్కోర్ సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి భారత్ 176 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి అద్బుత ఇన్నింగ్స్ ఆడాడు.
59 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 76 పరుగులు చేసి ఔటయ్యాడు. విరాట్‌తో పాటు అక్షర్ పటేల్(47) పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో కేశవ్ మహారాజ్, నోర్జే తలా రెండు వికెట్లు పడగొట్టగా.. జానెసన్, రబాడ ఒక్క వికెట్ సాధించారు.
Comments
Please login to add a commentAdd a comment