
ధర్మశాల వేదికగా జరిగిన ఐదో టెస్టులోనూ ఇంగ్లండ్‌ను టీమిండియా చిత్తు చేసింది. ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. తొలి టెస్టులో ఓటమి పాలైన భారత్.. తిరిగి పుంజుకుని వరుసగా నాలుగు టెస్టుల్లోనూ విజయ భేరి మ్రోగించింది. దీంతో ఐదు టెస్టుల సిరీస్‌ను 4-1తో భారత్ కైవసం చేసుకుంది. కాగా ఆఖరి టెస్టులో 473/8తో మూడో రోజు ఆట ప్రారంభించిన భారత్ మరో 4 పరుగులు మాత్రమే చేసి 477 పరుగులకు ఆలౌటైంది.
భారత బ్యాటర్లలో రోహిత్ శర్మ(103), గిల్(110) సెంచరీలతో చెలరేగగా.. పడిక్కల్(65), సర్ఫరాజ్ ఖాన్(56) హాఫ్ సెంచరీలతో మెరిశారు. ఇంగ్లండ్ బౌలర్లలో షోయబ్ బషీర్ 5 వికెట్లతో సత్తాచాటాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ 48.1 ఓవర్లలోనే 195 పరుగులకు కుప్పకూలింది. 100వ టెస్టు ఆడుతున్న రవిచంద్రన్ అశ్విన్ 5 వికెట్లతో ఇంగ్లిష్ జట్టు పతనాన్ని శాసించాడు. అతడితో పాటు కుల్దీప్, బుమ్రా తలా రెండు వికెట్లు పడగొట్టారు. అంతకుముందు ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 218 పరుగులకే ఆలౌటైంది.
రోహిత్ శర్మ అరుదైన ఘనత..
ఇక ఈ విజయంతో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఓ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. 112 ఏళ్ల తర్వాత ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో ఓడి 4-1తో సిరీస్ కైవసం చేసుకున్న కెప్టెన్‌గా రికార్డులకెక్కాడు. హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి టెస్టులో అనూహ్యంగా ఓటమి పాలైన రోహిత్ సేన.. తర్వాత నాలుగు మ్యాచ్‌ల్లో పర్యాటక జట్టును చిత్తు చేసింది. కాగా సొంతగడ్డపై భారత్‌కు ఇది 400వ విజయం కావడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment