నన్ను వ్యాఖ్యాతగా తీసుకోండి | Sanjay Manjrekar Requests BCCI To Appoint As Commentator | Sakshi
Sakshi News home page

నన్ను వ్యాఖ్యాతగా తీసుకోండి

Published Sat, Aug 1 2020 2:29 AM | Last Updated on Sat, Aug 1 2020 3:10 AM

Sanjay Manjrekar Requests BCCI To Appoint As Commentator - Sakshi

ముంబై: మాజీ క్రికెటర్, కామెంటేటర్‌ సంజయ్‌ మంజ్రేకర్‌ తనను మళ్లీ టీవీ వ్యాఖ్యాతగా తీసుకోవాలని భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ)ని అభ్యర్థించాడు. యూఏఈలో జరగబోయే ఐపీఎల్‌–13లో వ్యాఖ్యానం చేసేందుకు అనుమతించాలని కోరుతూ బోర్డుకు ఈ–మెయిల్‌ పంపాడు. ‘గౌరవనీయులైన బోర్డు ఉన్నతాధికారులకు మనవి. నేను ఇదివరకే కామెంటేటర్‌గా నాకు స్థానం కల్పించాలని మెయిల్‌ చేశాను. ఐపీఎల్‌ షెడ్యూల్‌ విడుదల కావడంతో బీసీసీఐ.టీవీ త్వరలోనే కామెంట్రీ ప్యానెల్‌ను ఎంపిక చేస్తుంది.

ఈ నేపథ్యంలో అన్ని అర్హతలున్న నన్ను ఎంపిక చేస్తారని ఆశిస్తున్నాను. గతంలో బోర్డు మార్గదర్శకాల ప్రకారం వ్యవహరించడంలో పొరపాటు జరిగింది. ఇప్పుడు పూర్తి అవగాహన వచ్చింది. అలాగే నడుచుకుంటానని తెలియజేస్తున్నాను’ అని మంజ్రేకర్‌ ఆ ఈ–మెయిల్‌లో పేర్కొన్నారు. బీసీసీఐ నియమావళికి విరుద్ధంగా బోర్డు కాంట్రాక్టు ప్లేయర్‌ రవీంద్ర జడేజాను విమర్శించడంతో కొందరు క్రికెటర్లు బోర్డుకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ ఏడాది మార్చిలో కామెంట్రీ ప్యానెల్‌ నుంచి మంజ్రేకర్‌ను తొలగించారు.

భారత్‌–దక్షిణాఫ్రికా వన్డే సిరీస్‌కు ముందే ఉన్నపళంగా అతన్ని తప్పించారు. అయితే ఆ సిరీస్‌ కరోనా వల్ల రద్దయింది. ఇప్పుడు మంజ్రేకర్‌ను మన్నించేందుకు బోర్డు సిద్ధంగా ఉంది. అయితే దీనిపై బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ మాత్రమే తుది నిర్ణయం తీసుకుంటారని బోర్డు అధికారులు తెలిపారు. కాగా 71 ఏళ్ల భారత దిగ్గజం సునీల్‌ గావస్కర్‌ క్రికెట్‌ వ్యాఖ్యానం కోసం యూఏఈ వెళ్లనున్నారు. కోవిడ్‌ నేపథ్యంలో ఆయనకు ఉన్న చోటే వర్చువల్‌ కామెంట్రీ అవకాశం కల్పిస్తున్నప్పటికీ ఆటపై ఉన్న ఆసక్తితో నేరుగా కామెంట్రీ చేసేందుకు ఆయన అక్కడికి వెళ్తారని బోర్డు వర్గాలు తెలిపాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement