మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం శ్రీలంకలో పర్యటిస్తున్న ఆఫ్ఘనిస్తాన్.. హంబన్‌తోట వేదికగా ఇవాళ (జూన్ 4) రెండో వన్డే ఆడుతుంది. తొలి వన్డేలో ఎదురైన పరాభవం (ఓటమి) నేపథ్యంలో ఈ మ్యాచ్‌లో లంక బ్యాటర్లు ఉగ్రరూపం దాల్చారు. భారీ స్కోర్ చేశారు. ప్రత్యర్ధి ముందు భారీ లక్ష్యాన్ని ఉంచారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. పథుమ్ నిస్సంక (43), కరుణరత్నే (52), కుశాల్ మెండిస్ (78), సమర విక్రమ (44), ధనంజయ డిసిల్వ (29 నాటౌట్), షనక (23), హసరంగ (29 నాటౌట్) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 323 పరుగులు చేసింది.
తొలి వన్డేలో సత్తా చాటిన అసలంక (6) మినహా లంక ఇన్నింగ్స్‌లో ప్రతి ఒక్కరు బ్యాట్‌ను ఝులిపించారు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లలో నబీ, ఫరీద్ అహ్మద్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. ముజీబ్ ఉర్ రెహ్మాన్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్.. 11 పరుగులకే వికెట్ కోల్పోయి కష్టాల్లో పడింది. ధాటిగా ఆడే రహ్మానుల్లా గుర్భాజ్ 12 బంతులు ఆడి కేవలం 2 పరుగులు మాత్రమే చేసి చమీర బౌలింగ్‌లో కుశాల్ మెండిస్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 9 ఓవర్ల తర్వాత ఆఫ్ఘనిస్తాన్ స్కోర్ 28/1గా ఉంది. రహ్మత్ షా (9), ఇబ్రహీమ్ జద్రాన్ (14) క్రీజ్‌లో ఉన్నారు.
కాగా, అంతకుముందు తొలి వన్డేలో ఆఫ్ఘనిస్తాన్.. తమ కంటే మెరుగైన శ్రీలంకపై 6 వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించింది. ఆ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. చరిత్ అసలంక (95 బంతుల్లో 91; 12 ఫోర్లు), ధనంజయ డిసిల్వ (59 బంతుల్లో 51; 5 ఫోర్లు) అర్ధసెంచరీలతో రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 268 పరుగులు చేసి ఆలౌటైంది. ఛేదనలో ఇబ్రహీం జద్రాన్ (98 బంతుల్లో 98; 11 ఫోర్లు, 2 సిక్సర్లు), రహ్మత్ షా (55) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌లు ఆడి ఆఫ్ఘనిస్తాన్‌ను గెలిపించారు. ఇరు జట్ల మధ్య మూడో వన్డే జూన్ 7న ఇదే వేదికగా జరుగనుంది.
Comments
Please login to add a commentAdd a comment