ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్‌లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఆ జట్టు ఓపెనింగ్ బ్యాటర్ ఇబ్రహీం జద్రాన్ చేతుల మీదుగా నూర్ అలీ జద్రాన్ టెస్ట్ అరంగేట్రం క్యాప్ అందుకున్నాడు. ఇందులో ఆసక్తి కలిగించే విషయం ఏముందని అనుకుంటున్నారా..?
నూర్ అలీ జద్రాన్.. ఇబ్రహీం జద్రాన్‌ను స్వయానా బాబాయ్ అవుతాడు. ఇలా అబ్బాయి.. బాబాయ్‌ను జట్టులోకి ఆహ్వానించిన ఘటనలు క్రికెట్‌లో చాలా అరుదు. జద్రాన్ వయసు ప్రస్తుతం 22 ఏళ్లు కాగా.. నూర్ అలీ జద్రాన్ వయసు 35 సంవత్సరాలు. ఇక్కడ మరో ఆసక్తికర అంశం ఏమిటంటే.. బాబయ్, అబ్బాయిలు కలిసి శ్రీలంకతో జరుగుతున్న ఏకైక టెస్ట్‌లో ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించారు.
బాబాయ్-అబ్బాయిలు ఆఫ్ఘన్ ఓపెనింగ్ బ్యాటర్లుగా బరిలోకి దిగారు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో బాబాయ్ నూర్ అలీ జద్రాన్ 31 పరుగులు చేసి పర్వాలేదనిపించగా.. అబ్బాయి ఇబ్రహీం జద్రాన్ డకౌటై నిరాశపరిచాడు. అయితే సెకండ్ ఇన్నింగ్స్ వచ్చే సరికి పరిప్థితి మారిపోయింది. ఈసారి బాబాయి, అబ్బాయి ఇద్దరూ రాణించారు.
బాబాయ్ నూర్ అలీ జద్రాన్ 47 పరుగులతో ఆకట్టుకోగా.. అబ్బాయి ఇబ్రహీం జద్రాన్ 77 పరుగులతో అజేయంగా నిలిచి సత్తా చాటాడు. వీరిద్దరు తొలి వికెట్‌కు 106 పరుగులు జోడించారు. బాబాయ్ నూర్ అలీ జద్రాన్ లేటు వయసులో టెస్ట్ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చినా.. అతని అంతర్జాతీయ అరంగేట్రం ఎప్పుడో 15 ఏళ్ల కిందటే జరిగింది. నూర్ అలీ 2009లోనే వన్డే క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆఫ్ఘనిస్తాన్ పరిమిత ఓవర్ల జట్టులో నూర్ అలీ రెగ్యులర్ సభ్యుడు.
నూర్ అలీ ఇప్పటివరకు 51 వన్డేలు, 22 టీ20లు ఆడాడు. ఇతను వన్డేల్లో సెంచరీ, ఏడు అర్ధసెంచరీల సాయంతో 1216 పరుగులు.. టీ20ల్లో 4 అర్దసెంచరీల సాయంతో 586 పరుగులు చేశాడు. మరోవైపు అబ్బాయి ఇబ్రహీం జద్రాన్ ఇప్పటివరకు 6 టెస్ట్‌లు, 28 వన్డేలు, 30 టీ20లు ఆడి 5 సెంచరీలు, 13 అర్దసెంచరీల సాయంతో దాదాపు 2500 పరుగులు చేశాడు. ఇబ్రహీం తన కెరీర్‌లో చేసిన ఐదు సెంచరీలు వన్డేల్లో చేసినవే కావడం విశేషం.
ఇదిలా ఉంటే, ఏకైక టెస్ట్ మ్యాచ్, మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్ కోసం ఆఫ్ఘనిస్తాన్ జట్టు శ్రీలంకలో పర్యటిస్తుంది. ఫిబ్రవరి 2న మొదలైన టెస్ట్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘన్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 198 పరుగులకు ఆలౌటైంది. ఆఫ్ఘన్ ఇన్నింగ్స్‌లో రహ్మత్ షా (91) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. లంక బౌలర్లలో విశ్వ ఫెర్నాండో 4, ప్రభాత్ జయసూర్య, అషిత ఫెర్నాండో తలో 3 వికెట్లు పడగొట్టారు.
అనంతరం శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 439 పరుగులు చేసింది. ఏంజెలో మాథ్యూస్ (141), చండీమల్ (107) సెంచరీలతో చెలరేగగా.. కరుణరత్నే అర్దసెంచరీతో (77) రాణించాడు. ఆఫ్ఘన్ బౌలర్లలో నవీద్ జద్రాన్ 4, నిజత్ మసూద్, కైస్ అహ్మద్ తలో 2 వికెట్లు పడగొట్టారు. తొలి ఇన్నింగ్స్‌లో దారుణంగా విఫలమైన ఆఫ్ఘన్లు సెకెండ్ ఇన్నింగ్స్‌లో గట్టిగా పుంజుకున్నారు. మూడో రోజు మూడో సెషన్ సమయానికి ఆ జట్టు వికెట్ నష్టానికి 174 పరుగులు చేసింది. ఇబ్రహీం జద్రాన్ (82), రహ్మత్ షా (41) క్రీజ్‌లో ఉన్నారు. ప్రస్తుతం ఆఫ్ఘన్లు శ్రీలంక తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు 66 పరుగులు వెనుకపడి ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment