
కేఎస్ భరత్ సారథ్యంలో సౌతాఫ్రికా టూర్‌లో భారత- ఎ జట్టు(PC: KS Bharat Fb)
South Africa A vs India A, 1st unofficial Test: భారత్ ‘ఎ’- దక్షిణాఫ్రికా ‘ఎ’ జట్ల మధ్య జరగాల్సిన తొలి అనధికారిక టెస్టుకూ వర్షం అడ్డుపడింది. ఎడతెరిపిలేని వాన కారణంగా సోమవారం నాటి తొలి రోజు ఆట రద్దయింది. కాగా సౌతాఫ్రికా పర్యటనలో భాగంగా టీమిండియా ఇప్పటికే అక్కడికి చేరుకున్న విషయం తెలిసిందే.
సఫారీ గడ్డపై మూడు టీ20, మూడు వన్డే, రెండు టెస్టులు ఆడేందుకు భారత ప్రధాన జట్టు అక్కడ అడుగుపెట్టింది. ఈ క్రమంలో డిసెంబరు 10 నాటి తొలి టీ20 వర్షం కారణంగా టాస్ పడకుండానే రద్దైపోయింది. ఇదిలా ఉంటే.. టీమిండియాతో పాటు భారత- ‘ఎ’ జట్టు కూడా సౌతాఫ్రికా టూర్‌కి వెళ్లింది.
ఇందులో భాగంగా.. ఆంధ్ర క్రికెటర్, టీమిండియా వికెట్ కీపర్ కోన శ్రీకర్ భరత్ సారథ్యంలో మూడు అనధికారిక టెస్టులు ఆడనుంది. నాలుగు రోజుల పాటు సాగే ఈ టెస్టు మ్యాచ్‌లలో మొదటిది డిసెంబరు 11న బ్లూమ్‌ఫౌంటేన్ వేదికగా మొదలైంది.
తొలి టెస్టులో టాస్ గెలిచిన భారత-ఎ జట్టు కెప్టెన్ శ్రీకర్ భరత్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ క్రమంలో భారత్- సౌతాఫ్రికా జట్లు మైదానంలో దిగేందుకు సిద్ధమవుతున్న తరుణంలో వరుణ దేవుడు స్వాగతం పలికాడు. ఈ క్రమంలో వర్షం ఎంతసేపటికీ తగ్గకపోవడంతో తొలి రోజు ఆటను రద్దు చేశారు.
ఇక మంగళవారం నాటి రెండో రోజు ఆటకైనా వర్షం అడ్డుపడకుంటే బాగుండునని ఆటగాళ్లతో సహా అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఆశించినట్లుగానే వాన జాడ లేకపోవడంతో మధ్యాహ్నం 1.30 నిమిషాలకు రెండో రోజు ఆట మొదలైంది.
మరోవైపు.. ఈరోజే సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలోని టీమిండియా పోర్ట్ ఎలిజబెత్ వేదికగా రెండో టీ20 ఆడాల్సి ఉంది. అయితే, ఈ మ్యాచ్‌కు కూడా వర్షం ముప్పు పొంచి ఉంది.
సౌతాఫ్రికా-ఎ జట్టుతో భారత- ఎ జట్టు తొలి అనధికారిక టెస్టు.. తుది జట్లు ఇవే
భారత్:
సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్, శ్రీకర్ భరత్ (కెప్టెన్, వికెట్ కీపర్), ప్రదోష్ పాల్, సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్, శార్దూల్ ఠాకూర్, సౌరభ్ కుమార్, తుషార్ దేశ్‌పాండే, ప్రసిధ్ కృష్ణ, విద్వత్ కావేరప్ప.
సౌతాఫ్రికా:
కామెరాన్ షెక్లెటన్, యాసీన్ వల్లి, రూబిన్ హెర్మన్, జీన్ డుప్లెసిస్, బ్రైస్ పార్సన్స్ (కెప్టెన్), కానర్ ఎస్టెర్హుయిసెన్ (వికెట్ కీపర్), ఇవాన్ జోన్స్, ఎథాన్ బాష్, కర్ట్లిన్ మానికమ్, సియా ప్లాట్జీ, ఒడిరిల్ మోడిమోకోనే.
Comments
Please login to add a commentAdd a comment