సరిగ్గా ఐదేళ్ల క్రితం... యాషెస్ సిరీస్‌లో భాగంగా నాటింగ్‌హామ్‌లో ఆస్ట్రేలియాతో నాలుగో టెస్టు. కొత్త బంతితో స్టువర్ట్ బ్రాడ్ చేసిన అద్భుతానికి ఆసీస్ విలవిల్లాడింది. కేవలం 9.3 ఓవర్లలో 15 పరుగులే ఇచ్చి బ్రాడ్ 8 వికెట్లు తీయగా, ఆస్ట్రేలియా 60 పరుగులకే కుప్పకూలింది. ప్రపంచ అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శనల్లో ఒకటిగా గుర్తింపు పొందిన ఈ స్పెల్ బ్రాడ్‌కు చిరకాల గుర్తింపును తెచ్చి పెట్టింది. ఈ మ్యాచ్‌లో తన 300 వికెట్లు మైలురాయిని దాటిన అతను మరింత పదునెక్కిన బౌలింగ్‌తో వేగంగా మరో 200 వికెట్లు తన ఖాతాలో వేసుకొని ‘500’ క్లబ్‌లో చేరిన అరుదైన ఆటగాడిగా నిలిచాడు.
సాక్షి క్రీడా విభాగం: స్టువర్ట్ బ్రాడ్ అంటే ఎక్కువ మంది భారత అభిమానులకు మన యువరాజ్ చేతిలో చావుదెబ్బ తిన్న బౌలర్‌గానే గుర్తుండిపోతాడు. అయితే ఈ ఒక్క ప్రదర్శనతో అతని టెస్టు క్రికెట్ ఘనతలు తక్కువ చేయలేం. 2007 టి20 ప్రపంచకప్‌లో ఒకే ఓవర్లో యువీ వరుసగా 6 సిక్సర్లు బాదేనాటికి బ్రాడ్ ఇంకా టెస్టు క్రికెటర్ కాదు. ఆ తర్వాత దాదాపు మూడు నెలలకు అతని అరంగేట్రం జరిగింది. తక్కువ వ్యవధిలోనే ఇంగ్లండ్ జట్టులో అతను మూడు ఫార్మాట్‌లలో కూడా కీలక ఆటగాడిగా మారాడు. టి20ల్లో అతను జట్టుకు కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు. అయితే టెస్టు క్రికెట్‌కే బ్రాడ్ అవసరం ఎక్కువగా ఉందని భావించిన ఇంగ్లండ్ బోర్డు మిగతా ఫార్మాట్‌ల నుంచి అతనికి విరామం ఇస్తూ వచ్చింది. చివరకు అతను వాటికి దూరమై పూర్తిగా టెస్టులకే పరిమితమయ్యాడు. బ్రాడ్ తన చివరి టి20 మ్యాచ్ 2014లో, చివరి వన్డే 2016లో ఆడాడు.
చిరస్మరణీయ ప్రదర్శనలెన్నో...
వేగం, కచ్చితత్వంతో పాటు బౌలింగ్‌లో దూకుడు ప్రదర్శించడం అతని శైలి. ఒకసారి జోరు మొదలైందంటే అతడిని ఎదుర్కోవడం ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను ప్రమాదకరంగా మారిపోతుంది. వంద టెస్టులు ముగిసేసరికి ఒకే స్పెల్‌లో కనీసం ఐదు వికెట్లు పడగొట్టిన ప్రదర్శనలు అతని నుంచి ఏడు సార్లు వచ్చాయంటేనే ఇది అర్థమవుతుంది. 2007లో శ్రీలంకతో ఆడిన తొలి సిరీస్‌లో విఫలమైనా... కొద్ది రోజులకే న్యూజిలాండ్‌లో ఐదు వికెట్ల ప్రదర్శన అతని ప్రతిభను ప్రపంచానికి చూపించింది. యాషెస్ సిరీస్ ఇంగ్లండ్ ఆటగాళ్లను హీరోలుగా లేదా జీరోలుగా మారుస్తుంది. బ్రాడ్ విషయంలో కూడా అదే జరిగింది. 2009 యాషెస్ టెస్టులో అతను 37 పరుగులకే 5 వికెట్లు తీయడంతో మ్యాచ్ ఇంగ్లండ్‌వైపు మలుపు తిరిగింది. ఆ తర్వాత బ్రాడ్ కెరీర్‌లో వెనుదిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. న్యూజిలాండ్‌పై 7/44, వెస్టిండీస్‌పై 7/72, జొహన్నెస్‌బర్గ్‌లో 6/17, భారత్‌పై 2014లో 6/25... ఇలా అతని అద్భుత ప్రదర్శనల్లో కొన్ని.
అండర్సన్‌కు జోడీగా...
సీనియర్ పేసర్ జేమ్స్ అండర్సన్‌తో కలిసి అతని భాగస్వామ్యం ఇంగ్లండ్‌కు ఎన్నో అద్భుత విజయాలు అందించింది. టీమ్ సుదీర్ఘ కాలంగా నంబర్‌వన్ ర్యాంక్‌లో నిలవడంలో వీరిద్దరు కీలకపాత్ర పోషించారు. అండర్సన్ పలు రికార్డులు నెలకొల్పగా, జూనియర్ సహచరుడిగా బ్రాడ్ అదే బాటలో అతడిని అనుసరించాడు. బ్రాడ్ ఆడిన 140 టెస్టుల్లో అండర్సన్ 117 టెస్టుల్లో భాగస్వామిగా ఉన్నాడు. ఈ మ్యాచ్‌లలో వీరిద్దరు కలిసి 895 వికెట్లు పడగొట్టడం విశేషం. అయితే అండర్సన్ నీడలో ఉండిపోకుండా బ్రాడ్ తన సొంతశైలితో విజయవంతమైన బౌలర్‌గా ఎదిగాడు. అతను లేని సందర్భాల్లో ప్రధాన పేసర్‌గా జట్టు భారం మోశాడు.
బ్రాడ్ అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చిన (8/15) టెస్టులో అండర్సన్ ఆడకపోవడం గమనార్హం. కొన్నిసార్లు గాయాలు కెరీర్‌ను ప్రమాదంలో పడేసినా... బ్రాడ్ పడి లేచిన కెరటంలా మళ్లీ దూసుకుపోయాడు. ఒక ఫాస్ట్ బౌలర్ ఇంత సుదీర్ఘ కాలం ఆటలో కొనసాగి పెద్ద సంఖ్యలో టెస్టులు ఆడటం అసాధారణం. ప్రతిభతో పాటు ఎంతో శ్రమ, పట్టుదల, అంకితభావంతోనే అది సాధ్యమవుతుంది. 34 ఏళ్ల బ్రాడ్ దీనిని చేసి చూపించాడు. 500 వికెట్ల మైలురాయిని దాటి టెస్టు చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని లిఖించుకున్నాడు.
► 2 తన టెస్టు కెరీర్‌లో బ్రాడ్ రెండు ‘హ్యాట్రిక్’లు తీసుకున్నాడు. 2011లో నాటింగ్‌హామ్‌లో భారత్‌పై... 2014లో లీడ్స్‌లో శ్రీలంకపై అతను ఈ ఘనత సాధించాడు.
► 7 టెస్టుల్లో 500కు పైగా వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితాలో బ్రాడ్ ఏడో బౌలర్‌గా నిలిచాడు. మురళీధరన్ (800), వార్న్ (708), కుంబ్లే (619), అండర్సన్ (589), మెక్‌గ్రాత్ (563), వాల్‡్ష (519) మాత్రమే అతనికంటే ముందున్నారు.
Comments
Please login to add a commentAdd a comment