
టీమిండియా మాజీ క్రికెటర్, మిస్టర్ ఐపీఎల్ సురేశ్ రైనా ఓ ఆటగాడిగా కోసం బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్‌కు రెకమండ్ చేశాడు. పొట్టి ఫార్మాట్‌లో భీకర ఫామ్‌లో ఉన్న శివమ్ దూబేను టీ20 వరల్డ్‌కప్ 2024కు ఎంపిక చేయాలని విజ్ఞప్తి చేశాడు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశాడు. శివమ్ దూబే కోసం వరల్డ్‌కప్ లోడ్ అవుతుంది. అగార్కర్ భాయ్.. దయ చేసి దూబేని సెలెక్ట్ చేయండని రైనా ట్వీట్ ద్వారా అగార్కర్‌ను కోరాడు.
ఓ మాజీ ఆటగాడు ఓ ఆటగాడి కోసం రెకమండ్ చేయడం చాలా అరుదుగా చూస్తుంటాం. బహుశా పేరున్న ఏ క్రికెటర్ కూడా ఇలా చేసి ఉండడు. అయితే రైనా మాత్రం తన ఇగోను, ఇతర విషయాలను పక్కన పెట్టి భీకర ఫామ్‌లో ఉన్న శివమ్ దూబేను వరల్డ్‌కప్ జట్టుకు సెలెక్ట్ చేయాలని చీఫ్ సెలక్టర్‌ను కోరాడు. ఏప్రిల్ నెలాఖరులోపు వరల్డ్‌కప్‌లో పాల్గొనే భారత జట్టును ఎంపిక చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో రైనా ప్రతిపాదన ట్వీట్ ప్రాధాన్యత సంతరించుకుంది.
World Cup loading for Shivam dube ! @imAagarkar bhai select karo please 🇮🇳🙏 https://t.co/b7g0BxHRSp
— Suresh Raina🇮🇳 (@ImRaina) April 23, 2024
కాగా, మీడియం పేస్ బ్యాటింగ్ ఆల్‌రౌండర్ అయిన శివమ్ దూబే ఇటీవలి కాలంలో అద్భుతంగా రాణిస్తున్నాడు. టీమిండియాలో ఆల్‌రౌండర్ స్థానానికి దూబే పర్ఫెక్ట్ సూట్ అని చాలామంది అభిప్రాయపడుతున్నారు. టీమిండియా ఆల్‌రౌండర్‌గా చెప్పుకునే హార్దిక్ పాండ్యా చెత్త ప్రదర్శనలతో కాలం వెల్లదీస్తున్న తరుణంలో దూబే భారత క్రికెట్ అభిమానుల పాలిట ఆశాదీపంలా కనిపిస్తున్నాడు.
దూబేకు బంతితోనూ సరైన అవకాశాలు లభిస్తే.. వరల్డ్‌కప్‌లో సంచలనాలు సృష్టించే అవకాశం ఉంది. దూబే బ్యాటింగ్ సామర్థ్యం గురించి ఇప్పటికే చాలా తెలుసుకున్నాం. ఇటీవల ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన టీ20 సిరీస్‌లోనూ దూబే వరుస అర్దశతకాలతో విరుచుకుపడ్డాడు. ఐపీఎల్‌లో దూబే బ్యాటింగ్ మెరుపులు పతాక స్థాయిలో ఉన్నాయి.
ప్రస్తుత సీజన్‌లో అతను ఇప్పటికే మూడు అర్దసెంచరీలు చేశాడు. తాజాగా లక్నోతో జరిగిన మ్యాచ్‌లో ఇరదీశాడు. ఈ మ్యాచ్‌లో అతను 27 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 66 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో ఇంపాక్ట్ ప్లేయర్ ఆప్షన్ వల్ల దూబేకు బౌలింగ్ చేసే అవకాశం రావడం లేదు. దూబే ఒకటి రెండు మ్యాచ్‌ల్లో బంతితో రాణిస్తే వరల్డ్‌కప్ బెర్త్ దక్కడం ఖాయం.