![T20 WC: Nasser Hussain Says India Timid Approach Hurt Them in ICC Events - Sakshi](/styles/webp/s3/article_images/2022/10/12/teamindia.jpg.webp?itok=Fgp9sNLM)
టీమిండియా (PC: BCCI)
T20 World Cup 2022: గతేడాది టీ20 ప్రపంచకప్ టోర్నీలో కనీసం సెమీస్ కూడా చేరకుండానే నిష్క్రమించింది టీమిండియా. ఇక ఐసీసీ మెగా ఈవెంట్‌లో ఘోర పరాభవం తర్వాత విరాట్ కోహ్లి టీ20 కెప్టెన్సీ పగ్గాలు వదిలేయగా.. రోహిత్ శర్మ సారథ్య బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే.
వచ్చీ రాగానే స్వదేశంలో పరిమిత ఓవర్ల క్రికెట్‌లో కెప్టెన్‌గా వరుస సిరీస్‌లు గెలిచిన హిట్‌మ్యాన్.. ఇంగ్లండ్, వెస్టిండీస్‌లో కూడా సత్తా చాటాడు. అయితే, ఇటీవల ముగిసిన ఆసియా కప్-2022 టీ20 టోర్నీలో మాత్రం పేలవ ప్రదర్శనతో ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్ నుంచి నిష్క్రమించింది రోహిత్ సేన.
డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగి సూపర్-4లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ చేతిలో ఓటమి కారణంగా భారీ మూల్యమే చెల్లించింది. ఇక ప్రస్తుతం టీ20 వరల్డ్‌కప్-2022 నేపథ్యంలో ఆస్ట్రేలియాకు చేరుకున్న టీమిండియా ఈసారి ఎలాగైనా ట్రోఫీ గెలవాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది.
ఆత్మవిశ్వాసం కొరవడటంతోనే..
ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ నాసిర్ హుసేన్ టీమిండియాను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఐసీసీ టోర్నీల్లో భారత జట్టు బెరుగ్గా.. భయపడుతూ ఆడుతుందని అందుకే విజయవంతం కాలేకపోతుందని వ్యాఖ్యానించాడు. ఈ మేరకు స్కై స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ.. ‘‘ఇండియా స్వదేశంలో, విదేశాల్లో అన్ని జట్లను ఓడిస్తోంది.
పిరికిగా.. బెరుగ్గా..
బెంచ్ కూడా బలంగా ఉంది. ఎంతో మంది ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఉన్నారు. వాళ్లను రొటేట్ చేయడం సహా విశ్రాంతినిస్తూ సిరీస్‌లు ఆడిస్తోంది యాజమాన్యం. అయితే, ఒకటి మాత్రం నిజం.. ఐసీసీ ఈవెంట్లలో భారత జట్టు భయపడుతూ ఆడుతోంది. పిరికిగా వ్యవహరిస్తోంది. గతేడాది ప్రపంచకప్‌లో ముఖ్యంగా పవర్‌ప్లేలో వాళ్ల ఆట చూస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది’’ అని నాసిర్ హుసేన్ చెప్పుకొచ్చాడు.
వాళ్లిద్దరు లేకపోవడం పెద్దలోటు
ఇక ఈసారి వరల్డ్‌కప్‌లో ఇద్దరు కీలక ఆటగాళ్ల సేవలను భారత్ కోల్పోతుందన్న నాసిర్ హుసేన్.. ‘‘సూర్య కుమార్ యాదవ్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. అతడి రాకతో టీమిండియా బ్యాటింగ్ బలం మరింత పెరిగింది. అయితే, జడేజా, బుమ్రా వంటి గొప్ప క్రికెటర్లు జట్టుకు దూరం కావడం పెద్ద లోటు.
ఏదేమైనా ద్వైపాక్షిక సిరీస్‌లలో దూకుడుగా ఆడినట్లే.. ప్రపంచకప్‌లోనూ అదే ఆలోచనాధోరణితో ముందుకు సాగితే టీమిండియాకు ఫలితం ఉంటుంది’’ అని అభిప్రాయపడ్డాడు. కాగా ఇటీవల స్వదేశంలో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌లను రోహిత్ సేన కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.
చదవండి: Jasprit Bumrah Replacement: బుమ్రా స్థానంలో షమీ కాదు.. అతడే బెటర్.. ఎందుకంటే: టీమిండియా దిగ్గజం
IND Vs PAK: 'భారత్ బౌలింగ్‌లో దమ్ము లేకపోయేది.. హెల్మెట్ లేకుండానే ఆడేవారు'
Comments
Please login to add a commentAdd a comment