టీ20 వరల్డ్‌కప్ 2024లో మరో ఉత్కంఠ పోరు జరిగింది. ఆంటిగ్వా వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన సూపర్-8 సమరంలో సౌతాఫ్రికా చివరి ఓవర్‌లో విజయం సాధించింది. సౌతాఫ్రికా గెలుపుకు చివరి ఓవర్‌లో 5 పరుగులు అవసరం కాగా.. జన్సెన్ తొలి బంతినే సిక్సర్‌గా మలిచి తన జట్టుకు సెమీస్ బెర్త్ ఖరారు చేశాడు.
వర్షం అంతరాయం నడుమ సాగిన ఈ లో స్కోరింగ్ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్.. తబ్రేజ్ షంషి (4-0-27-3), జన్సెన్ (2-0-17-1), మార్క్రమ్ (4-0-28-1), కేశవ్ మహారాజ్ (4-0-24-1), రబాడ (2-0-11-1) ధాటికి 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. రోస్టన్ ఛేజ్ (52), కైల్ మేయర్స్ (35) ఓ మోస్తరు స్కోర్లు చేయడంతో విండీస్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది.
అనంతరం 136 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సౌతాఫ్రికాకు వరుణుడు అడ్డుతగిలాడు. రెండో ఓవర్‌లో మొదలైన వర్షం దాదాపు గంటపాటు కొనసాగడంతో 17 ఓవర్లకు మ్యాచ్‌ను కుదించి, సౌతాఫ్రికా ముందు 123 పరుగుల లక్ష్యాన్ని ఉంచారు. వర్షం ప్రారంభానికి ముందే 2 వికెట్లు (15 పరుగులకే) కోల్పోయిన సౌతాఫ్రికా ఆతర్వాత కూడా వరుసగా వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా పయనిపించింది.
అయితే మార్కో జన్సెన్ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ (21 నాటౌట్) ఆడి సౌతాఫ్రికాను గెలిపించాడు. సఫారీ ఇన్నింగ్స్‌లో ట్రిస్టన్ స్టబ్స్ (29), క్లాసెన్ (22) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. విండీస్ బౌలర్లు రోస్టన్ ఛేజ్ (3-0-12-3), ఆండ్రీ రసెల్ (4-0-19-2), అల్జరీ జోసఫ్ (4-0-25-2) దక్షిణాఫ్రికా శిబిరంలో ఆందోళన రేకెత్తించారు. ఈ మ్యాచ్‌లో ఓటమితో విండీస్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. నిన్న జరిగిన మ్యాచ్‌లో యూఎస్‌ఏపై గెలుపుతో గ్రూప్-2 నుంచి సెమీస్‌కు చేరిన తొలి జట్టుగా ఇంగ్లండ్ నిలిచింది. గ్రూప్-2 నుంచి సౌతాఫ్రికా, ఇంగ్లండ్ సెమీస్‌కు చేరగా.. విండీస్, యూఎస్‌ఏ టోర్నీ నుంచి వైదొలిగాయి.
Comments
Please login to add a commentAdd a comment