![Team India Young All Rounder Nitish Kumar Reddy Playing Key Innings In Australia](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2024/12/6/nitish.jpg.webp?itok=JY82lfKN)
టీమిండియా యువ ఆల్‌రౌండర్, ఆంధ్రా కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి ఆస్ట్రేలియా గడ్డపై అదరగొడుతున్నాడు. నితీశ్ ఆడింది రెండు టెస్ట్ మ్యాచ్‌లే అయినా టీమిండియా పాలిట ఆపద్భాంధవుడిలా మారాడు. అడిలైడ్ వేదికగా జరుగతున్న రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో నితీశ్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. స్పెషలిస్ట్ బ్యాటర్లంతా విఫలమైన వేల నితీశ్ అద్భుతమైన పోరాటపటిమ కనబర్చి ఆసీస్ బౌలర్లపై ఎదురుదాడి చేశాడు.
ఈ మ్యాచ్‌లో నితీశ్ 54 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 42 పరుగులు చేశాడు. భారత ఇన్నింగ్స్‌లో ఇదే అత్యధిక స్కోర్. ఈ ఇన్నింగ్స్‌లో నితీశ్ ఆడిన షాట్లు అబ్బురపరిచాయి. స్టార్క్, బోలాండ్ లాంటి అరివీర భయంకరమైన ఫాస్ట్ బౌలర్ల బౌలింగ్‌లో నితీశ్ అలవోకగా బౌండరీలు, సిక్సర్లు బాదాడు.
స్టార్క్, బోలాండ్ బౌలింగ్‌లో నితీశ్ కొట్టిన సిక్సర్లు మ్యాచ్ మొత్తానికే హైలైట్‌గా నిలిచాయి. తొలి ఇన్నింగ్స్‌లో నితీశ్ పుణ్యమా అని భారత్ 150 పరుగుల మార్కు దాటింది. నితీశ్ మరో రెండు, మూడు ఓవర్లు క్రీజ్‌లో ఉండి ఉంటే భారత్ 200 పరుగుల మార్కు దాటేది. నితీశ్ టెక్నిక్‌తో పాటు బంతిని బలంగా బాదే తత్వం టీమిండియా అభిమానులను తెగ ఆకట్టుకుంది.
అంతకుముందు నితీశ్ తొలి టెస్ట్‌లోనూ రెండు మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడాడు. పెర్త్ వేదికగా జరిగిన ఆ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో నితీశ్ 59 బంతుల్లో 6 ఫోర్లు, సిక్సర్ సాయంతో 41 పరుగులు చేశాడు. ఆ ఇన్నింగ్స్‌లో నితీశ్ చేసిన స్కోరే టాప్ స్కోర్. విరాట్ కోహ్లి, యశస్వి జైస్వాల్ లాంటి సీనియర్లు విఫలమైన పిచ్‌పై నితీశ్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి ఔరా అనిపించాడు.
అదే మ్యాచ్ సెకెండ్ ఇన్నింగ్స్‌లోనూ నితీశ్ మరో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఆ ఇన్నింగ్స్ ఆఖర్లో వచ్చిన నితీశ్.. కోహ్లికి అండగా నిలిచి 27 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 38 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో నితీశ్ బంతితోనూ పర్వాలేదనిపించాడు. కీలకమైన మిచెల్ మార్ష్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. మొత్తంగా చూస్తే నితీశ్ టీమిండియాకు అవసరమైన సందర్భాల్లో బ్యాట్‌తో పాటు బంతితోనూ సత్తా చాటుతూ కీలక ఆటగాడిగా ఎదుగుతున్నాడు.
ఆసీస్‌తో రెండో టెస్ట్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. మిచెల్ స్టార్క్ (6/48) దెబ్బకు 180 పరుగులకు ఆలౌటైంది. కమిన్స్, బోలాండ్ తలో రెండు వికెట్లు తీశారు. భారత ఇన్నింగ్స్‌లో నితీశ్ కుమార్ రెడ్డి (42) టాప్ స్కోరర్‌గా నిలువగా.. కేఎల్ రాహుల్ (37), శుభ్‌మన్ గిల్ (31), అశ్విన్ (22), రిషబ్ పంత్ (21) రెండంకెల స్కోర్లు చేశారు. కోహ్లి 7, రోహిత్ శర్మ 3 పరుగులకే ఔటై నిరాశపర్చగా.. యశస్వి జైస్వాల్, హర్షిత్ రాణా, బుమ్రా డకౌట్ అయ్యారు.
అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా 30 ఓవర్ల అనంతరం వికెట్ నష్టానికి 84 పరుగులు చేసింది. ఉస్మాన్ ఖ్వాజా (13) ఔట్ కాగా.. నాథన్ మెక్‌స్వీని (38), లబుషేన్ (19) క్రీజ్‌లో ఉన్నారు. ఖ్వాజా వికెట్ బుమ్రాకు దక్కింది. ప్రస్తుతం ఆసీస్ భారత్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఇంకా 96 పరుగులు వెనుకపడి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment