Ind Vs Ire: ప్రయోగానికి ఆఖరి అవకాశం .. జితేశ్, షహబాజ్‌లకు ఛాన్స్‌!  Today Is Indias Last T20 Against Ireland, Know Team India Strategy, When And Where To Watch Ind Vs Ire 3rd T20I - Sakshi
Sakshi News home page

IND Vs IRE 3rd T20I Today: ప్రయోగానికి ఆఖరి అవకాశం .. జితేశ్, షహబాజ్‌లకు ఛాన్స్‌! 

Published Wed, Aug 23 2023 3:01 AM | Last Updated on Wed, Aug 23 2023 8:24 AM

Today is Indias last T20 against Ireland - Sakshi

డబ్లిన్‌: వెస్టిండీస్‌తో ఐదు టి20 మ్యాచ్‌లు, ఆ తర్వాత ఐర్లాండ్‌తో మూడు టి20 మ్యాచ్‌లు భారత యువ ఆటగాళ్లను ఈ ఫార్మాట్‌లో పరీక్షించేందుకు అవకాశం ఇచ్చాయి. వన్డే ప్రపంచకప్‌ ఏడాది ఎక్కువ మంది సీనియర్లు విరామం తీసుకోగా, కుర్రాళ్లంతా తమకు లభించిన చాన్స్‌ను చక్కగా ఉపయోగించుకున్నారు. ఈ రెండు పర్యటనల్లో కలిపి ఏడు మ్యాచ్‌లలో ఇప్పటికే ఐదుగురు ఆటగాళ్లు అంతర్జాతీయ టి20ల్లో అరంగేట్రం చేశారు.

ఇక మరో ఇద్దరు దాని కోసం ఎదురు చూస్తున్నారు. టూర్‌ చివరి మ్యాచ్‌లో ఆ చాన్స్‌ దక్కుతుందా అనేది చూడాలి. సిరీస్‌ను 2–0తో సొంతం చేసుకున్న భారత్‌ కోణంలో ఇది మాత్రమే ఆసక్తికర అంశం. మరోవైపు వన్డే, టి20 ఫార్మాట్‌లలో కలిపి భారత్‌తో ఆడిన 10 సార్లూ ఓడిన ఐర్లాండ్‌ ఈసారైనా సొంతగడ్డపై ఒక్క మ్యాచ్‌ గెలవాలని కోరుకుంటోంది. ఈ నేపథ్యంలో నేడు చివరి టి20కి రంగం సిద్ధమైంది.  

జితేశ్, షహబాజ్‌లకు అవకాశం! 
ఐర్లాండ్‌తో రెండు మ్యాచ్‌లోలనూ రాణించిన కెప్టెన్‌ బుమ్రా, పేసర్‌ ప్రసిధ్‌ కృష్ణ ఫామ్‌లోకి రావడం, ఆసియా కప్‌కు ఎంపిక కావడంతో ఈ సిరీస్‌ నుంచి భారత్‌కు ఆశించిన ప్రధాన ఫలితం దక్కింది. అయితే మరింత మ్యాచ్‌ ప్రాక్టీస్‌ కోసం వీరిద్దరు ఈ మ్యాచ్‌లోనూ బరిలోకి దిగుతారు. రవి బిష్ణోయ్‌ కూడా సిరీస్‌లో తన బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. బ్యాటింగ్‌లో రుతురాజ్, సామ్సన్, రింకూ సింగ్‌ కూడా తమకు లభించిన అవకాశాలు చక్కగా ఉపయోగించుకోగా, శివమ్‌ దూబే కూడా తన ధాటిని ప్రదర్శించాడు.

సిరీస్‌లో విఫలమైన తిలక్‌ వర్మ చివరి పోరులో సత్తా చాటాలని పట్టుదలగా ఉన్నాడు. యశస్వి కూడా మరో మెరుపు ఇన్నింగ్స్‌ బాకీ ఉన్నాడు. ఈ స్థితిలో తుది జట్టులో మూడు మార్పులకు అవకాశం ఉంది. ఇప్పటి వరకు అంతర్జాతీయ క్రికెట్‌ ఆడని వికెట్‌ కీపర్‌ జితేశ్‌ శర్మ, 3 వన్డేలు ఆడిన షహబాజ్‌ అహ్మద్‌ అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు.

వీరిని తీసుకోవాలని మేనేజ్‌మెంట్‌ భావిస్తే సంజు సామ్సన్, వాషింగ్టన్‌ సుందర్‌ స్థానాల్లో అవకాశం దక్కుతుంది. మరోవైపు కొంత విరామం తర్వాత టీమ్‌లోకి వచ్చిన అవేశ్‌ ఖాన్‌ కూడా టీమ్‌తో పాటు ఉన్నాడు. అతనికీ ఒక మ్యాచ్‌ ఇవ్వాలనుకుంటే అర్‌‡్షదీప్‌కు విశ్రాంతినిస్తారు. ఇదే జరిగితే కుర్రాళ్లతో భారత్‌ ప్రయోగం సంపూర్ణమవుతుంది.  

స్టిర్లింగ్‌ ఫామ్‌లోకి వచ్చేనా! 
రెండు టి20 మ్యాచ్‌లలో ఐర్లాండ్‌ ఆటతీరు మరీ పేలవంగా లేకున్నా భారత్‌లాంటి బలమైన జట్టుకు పోటీనిచ్చేందుకు సరిపోలేదు. గతంలోనూ కొన్ని చక్కటి ప్రదర్శనలు వచ్చినా టీమిండియాను ఓడించడంలో మాత్రం ఆ జట్టు సఫలం కాలేకపోయింది. ఈ నేపథ్యంలో చివరి పోరులోనైనా ఆ జట్టు గెలుపు బాట పడుతుందేమో చూడాలి.

ప్రపంచవ్యాప్తంగా లీగ్‌లలో అద్భుతంగా బ్యాటింగ్‌ చేస్తూ వచ్చిన కెప్టెన్‌ పాల్‌ స్టిర్లింగ్‌ ఇక్కడ మాత్రం రెండింటిలోనూ విఫలమయ్యాడు. బల్బిర్నీ మినహా మిగతావారంతా ప్రభావం చూపలేకపోయారు. విజయం సాధించాలంటే జట్టు సమష్టిగా రాణించడం కీలకం. ఐర్లాండ్‌ కూడా గత మ్యాచ్‌తో పోలిస్తే మూడు మార్పులతో బరిలోకి దిగే అవకాశం ఉంది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement