ఆర్సీబీ ఘన విజయం: కోహ్లి కీలక వ్యాఖ్యలు | 'Trying To Keep Up With Strike-Rate For': Kohli's Big Admission After Fiery Knock vs PBKS | Sakshi
Sakshi News home page

Virat Kohli: ఆర్సీబీ ఘన విజయం: కోహ్లి కీలక వ్యాఖ్యలు

Published Fri, May 10 2024 12:52 PM | Last Updated on Fri, May 10 2024 1:47 PM

విరాట్‌ కోహ్లి (PC: BCCI)

ఐపీఎల్‌-2024 ఆరంభంలో కాస్త తడబడ్డా తిరిగి పుంజుకుని పరుగుల వరద పారిస్తున్నాడు రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి. అత్యధిక పరుగుల వీరుడిగా కొనసాగుతూ ఆరెంజ్‌ క్యాప్‌ తన దగ్గరే పెట్టుకున్నాడు.

తాజాగా పంజాబ్‌ కింగ్స్‌తో మ్యాచ్‌లో దుమ్ములేపిన ఈ ఆర్సీబీ ఓపెనర్‌ జట్టును గెలిపించడంలో కీలక పాత్ర పోషించాడు. 47 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో వింటేజ్‌ కోహ్లిని గుర్తుచేస్తూ 92 పరుగులు సాధించాడు. సెంచరీ చేజారినా అద్భుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకోగలిగాడు.

కోహ్లి స్ట్రైక్‌రేటుపై విమర్శలు
ఈ మ్యాచ్‌తో కలిపి ఈ సీజన్‌లో 12 ఇన్నింగ్స్‌ ఆడిన విరాట్‌ కోహ్లి ఓ శతకం సాయంతో 634 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో ఈ రన్‌మెషీన్‌ స్ట్రైక్‌రేటు 153.51గా నమోదైంది.

కాగా గత కొన్ని రోజులుగా విరాట్‌ కోహ్లి స్ట్రైక్‌రేటుపై విమర్శలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. స్వార్థపూరిత ఇన్నింగ్స్‌ ఆడుతూ జట్టుకు మేలు కంటే చేటే ఎక్కువ చేస్తున్నాడంటూ కొంతమంది మాజీ క్రికెటర్లు విమర్శించారు.

ఇందుకు కోహ్లి గట్టిగానే బదులివ్వగా.. సునిల్‌ గావస్కర్‌ వంటి వాళ్లు చూసిందే మాట్లాడుతున్నాం అంటూ మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. ఈ నేపథ్యంలో పంజాబ్‌ కింగ్స్‌తో మ్యాచ్‌ అనంతరం కోహ్లి కీలక వ్యాఖ్యలు చేశాడు.

‘‘నాకు క్వాంటిటీ కంటే క్వాలిటీ ముఖ్యం. లోపాలు సరిచేసుకుని ముందుకు ఎలా వెళ్లాలో నాకు తెలుసు. రోజురోజుకు ఆటను మెరుగుపరచుకోవడమే నా పని.

స్పిన్నర్ల బౌలింగ్‌లో స్లాగ్‌స్వీప్‌ షాట్లు ఆడాను. నిజానికి నేను అలాంటివి గతంలో ప్రాక్టీస్‌ కూడా చేయలేదు. కానీ కొన్నిసార్లు రిస్క్‌ తీసుకోకతప్పదని నాకు తెలుసు.

స్ట్రైక్‌రేటు పెంచుకునే క్రమంలో
నాకోసం, జట్టు ప్రయోజనాల కోసం స్ట్రైక్‌రేటు పెంచుకునే క్రమంలో ఇలాంటివి చేయాల్సిందే’’ అని కోహ్లి పేర్కొన్నాడు. ఇక వరుస ఓటముల తర్వాత ఆర్సీబీ వరుస విజయాల పట్ల స్పందిస్తూ.. ‘‘నిజం చెప్పాలంటే.. మేము మొదటి అర్థ భాగంలో స్థాయికి తగ్గట్లు రాణించలేదు.

అందుకే పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్నపుడు ఆత్మ గౌరవం కోసం ఆడాలని నిర్ణయించుకున్నాం. మా అభిమానులను గర్వపడేలా చేయాలనుకున్నాం. ఇప్పుడు ఏడో స్థానానికి చేరుకోగలిగాం. 

మేము ఇదే పని కాస్త ముందు చేసి ఉంటే ఎంతో బాగుండేది’’ అని కోహ్లి చెప్పుకొచ్చాడు. కాగా ఐపీఎల్‌-2024 ప్లే ఆఫ్స్‌ నుంచి ఇప్పటికే ముంబై ఇండియన్స్‌ నిష్క్రమించగా.. ఆర్సీబీ చేతిలో గురువారం 60 పరుగుల తేడాతో ఓడిన పంజాబ్‌ కూడా ఆశలు కూడా గల్లంతయ్యాయి.

చదవండి: ద్రవిడ్‌ గుడ్‌ బై!.. టీమిండియా కొత్త కోచ్‌గా ఫారినర్‌?.. జై షా కామెంట్స్‌ వైరల్‌
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement