ప్రపంచకప్‌కు ఉప్పల్‌ స్టేడియం సిద్ధం | Uppal Stadium is ready for the World Cup | Sakshi
Sakshi News home page

ప్రపంచకప్‌కు ఉప్పల్‌ స్టేడియం సిద్ధం

Published Fri, Sep 22 2023 1:58 AM | Last Updated on Fri, Sep 22 2023 1:58 AM

Uppal Stadium is ready for the World Cup - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వన్డే వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌ల నిర్వహణ కోసం ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ స్టేడియం అన్ని విధాలా సిద్ధమైందని హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ) ప్రకటించింది. హెచ్‌సీఏ పర్యవేక్షకుడు, ఏకసభ్య కమిటీ చైర్మన్‌ జస్టిస్‌ ఎల్‌.నాగేశ్వరరావు తరఫున ప్రతినిధిగా వ్యవహరిస్తున్న రిటైర్డ్‌ ఐపీఎస్‌ కె. దుర్గాప్రసాద్‌ వరల్డ్‌ కప్‌కు సంబంధించి ఏర్పాట్ల గురించి వెల్లడించారు. బీసీసీఐ ప్రత్యేకంగా కేటాయించిన నిధులతో స్టేడియంలో కొత్తగా అనేక అభివృద్ధి చేపట్టినట్లు ఆయన వివరించారు.

‘స్టేడియంలో ఐసీసీ ప్రమాణాలకు అనుగుణంగా చక్కటి అవుట్‌ ఫీల్డ్‌ను సిద్ధం చేశాం. ప్రేక్షకులకు కల్పించే సౌకర్యాలను ఎంతో మెరుగుపర్చాం. వారి కోసం స్టేడియంలో మూడు వైపులా నార్త్, సౌత్, ఈస్ట్‌లలో కనోపీలను ఏర్పాటు చేశాం. సౌత్‌లో కొన్నాళ్ల క్రితం పాడైపోయిన కనోపీని పునరుద్ధరించాం. పాతవాటి స్థానంలో కొత్తగా ఫ్లడ్‌లైట్లను కూడా ఏర్పాటు చేశాం. ఎల్‌ఈడీ లైట్‌లు ఉండటం ఈసారి ప్రత్యేకత’ అని దుర్గా ప్రసాద్‌ చెప్పారు.

స్టేడియం సామర్థ్యం 39 వేలు కాగా, 11 వేలు పాత సీట్లను తొలగించి వాటి స్థానంలో కొత్తవి సిద్ధం చేసినట్లు ఆయన వివరించారు. వరుసగా రెండు రోజుల్లో రెండు మ్యాచ్‌లు ఉండటంతో ఎలాంటి సమస్యా లేదని, వాటిని సమర్థంగా నిర్వహించగలమని విశ్వాసం వ్యక్తం చేసిన దుర్గాప్రసాద్‌... అభిమానులు పెద్ద సంఖ్యలో ఈ మ్యాచ్‌లపై ఆసక్తి చూపిస్తున్నారని చెప్పారు. ఉప్పల్‌ స్టేడియంలో అక్టోబర్‌ 6, 9, 10 తేదీల్లో ప్రపంచ కప్‌ మ్యాచ్‌లు ఉన్నాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement