
టీమిండియా సెలక్టర్ల తీరును భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ విమర్శించాడు. రంజీ ట్రోఫీలో అద్భుత ప్రదర్శన కనబరిచిన ఆటగాళ్లను పట్టించుకోకపోవడం దారుణమని మండిపడ్డాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) ప్రదర్శనల ఆధారంగానే జాతీయ జట్టును ఎంపిక చేస్తే ఆటగాళ్లు ఇకపై రంజీలు ఆడాల్సిన అవసరం లేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు.
మొట్టమొదటి క్రికెటర్‌గా ఆల్‌టైమ్ రికార్డు
కాగా మధ్యప్రదేశ్‌కు చెందిన ఆల్‌రౌండర్ జలజ్ సక్సేనా ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో పరుగుల వరద పారించడంతో పాటు వికెట్లు తీయడంలోనూ సత్తా చాటుతున్నాడు. ఇటీవలే అతడు రంజీ ట్రోఫీలో 6000 పరుగులు పూర్తి చేసుకోవడంతో పాటు 400 వికెట్ల మార్కు దాటాడు. తద్వారా రంజీ చరిత్రలో ఈ ఘనత సాధించిన మొట్టమొదటి క్రికెటర్‌గా ఆల్‌టైమ్ రికార్డు సృష్టించాడు.
అయితే, 37 ఏళ్ల సక్సేనా ఇంత వరకు ఒక్కసారి కూడా టీమిండియాకు ఆడలేకపోయాడు. 2005లో సొంతరాష్ట్రం మధ్యప్రదేశ్ తరఫు ఫస్ట్‌క్లాస్ కెరీర్ ఆరంభించిన జలజ్.. పదకొండేళ్ల పాటు అదే జట్టుతో కొనసాగాడు. 2016-17 సీజన్ నుంచి కేరళకు ప్రాతినిథ్యం వహిస్తున్న జలజ్ సక్సేనా ఇటీవల ఉత్తరప్రదేశ్‌తో మ్యాచ్ సందర్భంగా ఈ అరుదైన ఫీట్ నమోదు చేశాడు.
ఇంకేం చేస్తే అతడి పేరును సెలక్టర్లు పరిశీలిస్తారు?
ఈ నేపథ్యంలో ఓ జర్నలిస్టు సోషల్ మీడియా వేదికగా జలజ్ సక్సేనా ఘనతను ప్రస్తావిస్తూ.. ‘‘రంజీ ట్రోఫీలో 400 వికెట్లు, 6000 పరుగులు. భారత్‌లోని జాతీయ టోర్నమెంట్లో ఈ ఘనత సాధించిన మొట్టమొదటి వ్యక్తి. అయినప్పటికీ ఇతడికి టీమిండియా తరఫున ఆడే అవకాశం లేదు.
అతడొక చాంపియన్. నిలకడగా ఆడుతున్న ప్లేయర్. ఇంతకంటే.. ఇంకేం చేస్తే అతడి పేరును సెలక్టర్లు పరిశీలిస్తారు?’’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సదరు జర్నలిస్టు పోస్టుకు భారత స్పిన్ దిగ్గజం హర్భజన్ సింగ్ స్పందించాడు.
రంజీలు ఆడేవాళ్లు పనికిరారా?
‘‘మీ మాటలతో నేను ఏకీభవిస్తున్నాను. కనీసం ఇండియా-‘ఎ’ జట్టుకైనా అతడిని ఎంపిక చేయాల్సింది. ప్రస్తుత కాలంలో రంజీ ఆడటం పనికిరాని విషయంగా మారిపోయిందా?.. ఐపీఎల్ నుంచే ఆటగాళ్లను సెలక్ట్ చేస్తున్నారు’’ అంటూ భజ్జీ టీమిండియా సెలక్టర్ల తీరును ఘాటుగా విమర్శించాడు.
కాగా టీమిండియా ఇటీవల స్వదేశంలో ఘోర ఓటమిని మూటగట్టుకుంది. న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో 3-0తో వైట్‌వాష్‌కు గురైంది. తద్వారా సొంతగడ్డపై ఇలా మూడు మ్యాచ్‌ల టెస్టుల్లో క్లీన్‌స్వీప్ అయిన తొలి భారత జట్టుగా రోహిత్ సేన నిలిచింది. ఇక ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత్-‘ఎ’ జట్టు సైతం రెండు మ్యాచ్‌ల అనధికారిక టెస్టు సిరీస్‌లో వైట్‌వాష్ దిశగా పయనిస్తోంది.
చదవండి: Ind A vs Aus A: ఆసీస్ బౌలర్ల విజృంభణ.. భారత బ్యాటింగ్ ఆర్డర్ కుదేలు