టెస్టు క్రికెట్‌లో గత ఏడాదిగా పేలవ ఫామ్‌ను కనబరుస్తున్న టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి ఇప్పుడు మరో కఠిన సవాల్‌ను ఎదుర్కొనేందుకు సిద్దమయ్యాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాతో తలపడేందుకు కోహ్లి తీవ్రంగా నెట్స్‌లో శ్రమిస్తున్నాడు.
స్వదేశంలో బంగ్లాదేశ్,న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో నిరాశపరిచిన విరాట్ తనకు ఇష్టమైన ఆసీస్‌పై సత్తాచాటాలని భావిస్తున్నాడు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆస్ట్రేలియా పర్యటనలో కోహ్లి తన ఫామ్‌ను తిరిగి పొందుతాడని రవిశాస్త్రి ఆశాభావం వ్యక్తం చేశాడు.
"రాజు(కింగ్) తన రాజ్యానికి తిరిగి వచ్చాడు. ఇదొక్కటే ఆస్ట్రేలియాకు నేను చెప్పేది. ఆస్ట్రేలియాలో అద్బుత ప్రదర్శనల తర్వాతే అతడు కింగ్‌గా మారాడు. అది మీకు కూడా తెలుసు. విరాట్ క్రీజులో ఉంటే మీ గుండెల్లో రైళ్లు పరిగెత్తుతాయి. కోహ్లికి కూడా నేను ఓ సలహా ఇవ్వాలనకుంటున్నాను.
క్రీజులో వచ్చినవెంటనే తొందరపడవద్దు. హడావిడిగా ఆడి వికెట్‌ను కోల్పోవద్దు. బ్యాటింగ్‌కు దిగిన మొదటి అరగంటలో ప్రశాంతంగా ఆడి సింగిల్స్‌పై దృష్టి సారించాలి. ఎటువంటి రిస్క్ షాట్‌లు ఆడకుండా, కూల్ తన ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తే విరాట్ కచ్చితంగా తన రిథమ్‌ను తిరిగి పొందుతాడు" అని ఐసీసీ రివ్యూ మీటింగ్‌లో శాస్త్రి పేర్కొన్నాడు.
ఆసీస్ గడ్డపై అదుర్స్...
కాగా కోహ్లికి ఆస్ట్రేలియా గడ్డపై అద్భుతమైన రికార్డు ఉంది. విరాట్ 2011-12లో తన తొలి ఆసీస్ టెస్టు పర్యటనలో సెంచరీతో మెరిశాడు. ఆ తర్వాత 2014-15 ఆస్ట్రేలియా టూర్‌లో కూడా విరాట్ తన విశ్వరూపాన్ని చూపించాడు. ఏకంగా నాలుగు సెంచరీలతో 692 పరుగులు సాధించి చరిత్ర సృష్టించాడు.
ఇప్పటివరకు ఆసీస్ గడ్డపై 13 టెస్టులు ఆడిన విరాట్ 50పైగా సగటుతో 1352 పరుగులు చేశాడు. ఆసీస్‌లో అతడికి 6 టెస్టు సెంచరీలు ఉన్నాయి. అదే విధంగా అతడి కెప్టెన్సీలోనే తొలిసారి ఆస్ట్రేలియా గడ్డపై భారత్ టెస్టు సిరీస్ సొంతం చేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment