ఢిల్లీ: ఐపీఎల్ 2020 సీజన్ మొదలైనప్పటి నుంచి ‘వీరు కి బైఠక్’ అంటూ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ మరోసారి ఆకట్టున్నాడు. ఈ సారి సూపర్ స్టార్ రజనీకాంత్ గెటప్‌లో.. ముంబైతో మ్యాచ్‌లో పూర్తిగా తేలిపోయిన చెన్నై జట్టుపై విమర్శలు గుప్పించాడు. చెన్నై జట్టును సూపర్ స్టార్ రజనీ కాంత్ కూడా కాపాడలేడని తనదైన శైలిలో సెటైర్లు వేశాడు. వాష్‌రూమ్‌కు వెళ్లి వచ్చేసరికి.. చెన్నై టాప్ ఆర్డర్ పెవిలియన్ చేరడమేంటని విస్మయం వ్యక్తం చేశాడు. ఇంతకుముందు తమ ఆటగాళ్లు బంతిని బాదిన శబ్దానికి సంబరపడేవాళ్లని, కానీ నిన్నటి మ్యాచ్‌లో.. బంతి వికెట్‌ను గిరాటేయకుంటే చాలని భావించారని అన్నాడు. దీంతోపాటు ఇరు జట్లలో ఉన్న ఆటగాళ్లలో ఫిట్‌నెస్ పెద్దగా లేని ఆటగాళ్లకు వీరు చురకలు వేశాడు.
గాయం కారణంగా చెన్నైతో మ్యాచ్‌కి దూరమైన రోహిత్ శర్మ స్థానంలో సౌరభ్ తివారీ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, బరువు విషయంలో రోహిత్ కన్నా సౌరబ్ తక్కువ వాడేం కాదనే ఉద్దేశంలో.. ‘వడా పావ్‌కు బదులు.. సమోసా పావ్ మ్యాచ్‌లో పాల్గొంది’ అని వీరు చమత్కరించాడు. ఇక చెన్నై జట్టులోని 41 ఏళ్ల ఇమ్రాన్ తాహిర్‌ను తాహిర్ చాచా (అంకుల్) అని వీరు పేర్కొన్నాడు. కాగా, షార్జా వేదికగా ముంబైతో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై దారుణమైన ఓటమిని మూటగట్టుకుంది. 9 వికెట్లకు 114 పరుగులు మాత్రమే చేసింది. అందులో సామ్ కరన్ ఒక్కడివే 52 పరుగులు. ఇక సమష్టి ప్రదర్శనతో ముంబై అలవోక విజయం సాధించింది. ఓపెనర్లు ఇషాన్ కిషన్ (37 బంతుల్లో 68 నాటౌట్; 6 ఫోర్లు, 5 సిక్సర్లు), డికాక్ (37 బంతుల్లో 46 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) అజేయంగా నిలిచి జట్టుకు ఘన విజయాన్ని అందించారు.
Comments
Please login to add a commentAdd a comment