Hardik Pandya underwhelming all-round performances: టీమిండియా ‘స్టార్’ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఆట తీరుపై భారత మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా పెదవి విరిచాడు. ఇటీవలి కాలంలో వన్డేల్లో అతడి ప్రదర్శన ఆశించదగ్గ రీతిలో లేదని విమర్శించాడు. వన్డే ప్రపంచకప్-2023 వంటి మెగా ఈవెంట్‌కు ముందు కీలక ఆటగాడు ఇలా విఫలం కావడం ఆందోళనకు గురిచేసే అంశం అన్నాడు.
తాత్కాలిక కెప్టెన్‌గా
కాగా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ గైర్హాజరీలో పరిమిత ఓవర్ల క్రికెట్‌లో హార్దిక్ పాండ్యా భారత జట్టును ముందుకు నడిపిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ముగిసిన వెస్టిండీస్ పర్యటనలో భాగంగా ఆఖరి రెండు వన్డేలు, ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు పాండ్యా తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరించాడు.
ఆటగాడిగా, కెప్టెన్‌గా విఫలం
అయితే, ఆల్‌రౌండర్‌గా.. కెప్టెన్‌గానూ ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాడు. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను టీమిండియా 2-1తో గెలిచినప్పటికీ.. పాండ్యా సారథ్యంలో టీ20 సిరీస్‌లో మాత్రం విండీస్ చేతిలో 3-2తో పరాభవం పాలైంది. ఈ నేపథ్యంలో హార్దిక్ పాండ్యాపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి.
ఇక వెస్టిండీస్ టూర్ తర్వాత హార్దిక్ ఆసియా వన్డే కప్-2023 టోర్నీలోనే మళ్లీ మైదానంలో అడుగుపెట్టనున్నాడు. అటుపై భారత్ వేదికగా ప్రపంచకప్ రూపంలో మరో మెగా ఈవెంట్ జరుగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆకాశ్ చోప్రా తన యట్యూబ్ చానెల్ వేదికగా హార్దిక్‌ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు.
ఒకే ఒక్క హార్దిక్ పాండ్యా ఉన్నాడు.. కానీ
‘‘దేశంలో ఒకే ఒక్క హార్దిక్ పాండ్యా ఉన్నాడు. గంటకు 140 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేయడంతో పాటు లోయర్ ఆర్డర్‌లో ఫినిషర్‌గా అదరగొట్టగలిగిన వాడు. బౌలింగ్.. బ్యాటింగ్.. అదో ప్యాకేజ్! అయితే.. హార్దిక్ ఈ రెండింటిలోనూ ఇంకా మెరుగ్గా రాణించగలడు.
నిజానికి వెస్టిండీస్‌తో రెండో వన్డేలో టీమిండియా ఓడినపుడు అందరూ యువ ఆటగాళ్ల గురించే మాట్లాడారు. కానీ పాండ్యా గురించి ఇంతవరకు పెద్దగా చర్చించడమే లేదు. వాస్తవానికి హార్దిక్ పాండ్యా వంటి కీలక ఆటగాడిపైనే ఎక్కువ ఫోకస్ ఉండాలి. గత 10 వన్డేల్లో అతడి ప్రదర్శన చెప్పుకోదగినదిగా లేదు.
స్ట్రైక్‌రేటు గురించి కూడా మాట్లాడాలి
వెస్టిండీస్‌తో మూడో వన్డేలో 52 బంతుల్లో 70 పరుగులు చేశాడు. కానీ ఆ ఇన్నింగ్స్ ఎంత పేలవంగా ఆరంభమైందో తెలిసిందే! అయితే, ఆఖర్లో మాత్రం బ్యాట్ ఝులిపించాడు. ఇక మరో మ్యాచ్‌లో 12 బంతుల్లో 14 పరుగులు.. కేవలం రెండు ఇన్నింగ్స్‌లో మాత్రమే అతడు ఎదుర్కొన్న బంతుల కంటే పరుగులు ఎక్కువగా ఉన్నాయి.
ఫినిషర్‌గానే కీలక పాత్ర
వాస్తవానికి హార్దిక్ పాండ్యా ఫినిషర్ పాత్ర పోషించాలి. కాబట్టి స్ట్రైక్‌రేటు గురించి చర్చించక తప్పదు. అతడు నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఫినిషర్‌గా తన నుంచి మంచి ఇన్నింగ్స్ ఆశిస్తున్నా’’ అని ఆకాశ్ చోప్రా తన అభిప్రాయాలు పంచుకున్నాడు.
కాగా గత 10 వన్డే ఇన్నింగ్స్‌లో హార్దిక్ పాండ్యా 97.22 స్ట్రైక్‌రేటుతో 280 పరుగులు చేయగలిగాడు. గత నాలుగేళ్లుగా 100కు స్ట్రైక్‌రేటు మెయింటెన్ చేస్తున్న అతడి ప్రస్తుత గణాంకాలు ఆశించిన రీతిలో లేవన్నది వాస్తవం. ఇదిలా ఉంటే... ఆగష్టు 30 నుంచి పాకిస్తాన్, శ్రీలంక వేదికగా ఆసియా కప్ టోర్నీ ఆరంభం కానుంది.
చదవండి: టీమిండియాతో సిరీస్ నాటికి వచ్చేస్తా.. వరల్డ్‌కప్ తర్వాత కెప్టెన్ అతడే!
Comments
Please login to add a commentAdd a comment