హేలీ, క్వియానా ధనాధన్ షో
మహిళల టి20 ప్రపంచకప్
దుబాయ్: ఈ ప్రపంచకప్‌లో ఇదే ఆఖరి లీగ్ మ్యాచ్. గ్రూప్ ‘బి’లో ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్‌లు గెలిచి అగ్రస్థానంలో ఇంగ్లండ్, రెండు విజయాలతో వెస్టిండీస్ మూడో స్థానంలో ఉన్నాయి. మంగళవారం జరిగిన మ్యాచ్ ఈ స్థానాల్ని తారుమారు చేసింది. ఇంగ్లండ్ మహిళల జట్టు అనూహ్యంగా ఒక్క ఆఖరి పోరుతో ఇంటిబాట పట్టింది. వెస్టిండీస్ 6 వికెట్ల తేడాతో గెలిచి ‘టాప్’లోకి వచ్చి నిలిచింది. మూడు జట్లు 6 పాయింట్లతో సమంగా ఉన్నప్పటికీ మెరుగైన నెట్ రన్‌రేట్ విండీస్ (1.536) జట్టును సెమీఫైనల్స్‌కు పంపింది.
ఈ గ్రూప్ నుంచి దక్షిణాఫ్రికా (1.382) రెండో జట్టుగా ముందంజ వేసింది. ఇంగ్లండ్ (1.091) మూడో స్థానంతో టోర్నీ నుంచి నిష్క్రమించింది. టాస్ నెగ్గిన విండీస్ ఫీల్డింగ్ ఎంచుకోగా... ముందుగా బ్యాటింగ్ చేపట్టిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. టాపార్డర్‌లో బౌచిర్ (14), డ్యానీ వ్యాట్ (16), అలైస్ క్యాప్సీ (1) నిరాశ పరచడంతో 34 పరుగులకే 3 కీలక వికెట్లను కోల్పోయింది.
ఈ దశలో నట్ సీవర్ బ్రంట్ (50 బంతుల్లో 57 నాటౌట్; 5 ఫోర్లు) ఒంటరి పోరాటం చేసింది. కెపె్టన్ హీథెర్ నైట్ (13 బంతుల్లో 21; 3 ఫోర్లు)తో చకచకా 46 పరుగులు జోడించింది. అయితే 80 పరుగుల జట్టు స్కోరు వద్ద హీథెర్ రిటైర్డ్‌హర్ట్ కావడంతో ఇంగ్లండ్ ఆటతీరు మారింది. తర్వాత వచ్చిన వారిలో ఏ ఒక్కరూ కనీసం 8 పరుగులైనా చేయలేకపోవడంతో ఇంగ్లండ్ 150 మార్క్‌ను కూడా అందుకోలేకపోయింది.
అఫీ ఫ్లెచర్ 3, హేలీ మాథ్యూస్ 2 వికెట్లు తీశారు. తర్వాత వెస్టిండీస్ ఇంకో 2 ఓవర్లు మిగిలుండగానే 18 ఓవర్లలో నాలుగే వికెట్లు కోల్పోయి 142 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్లు హేలీ మాథ్యూస్ (38 బంతుల్లో 50; 7 ఫోర్లు, 1 సిక్స్), క్వియానా జోసెఫ్ (38 బంతుల్లో 52; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధనాధన్ ఆరంభమిచ్చారు. మెరుపు వేగంతో ఆడిన ఇద్దరు అర్ధసెంచరీలు పూర్తిచేసుకున్నారు.
తొలి వికెట్‌కు 12.2 ఓవర్లలో 102 పరుగులు జోడించాక క్వియానా, తర్వాత ఓవర్లో కెపె్టన్ హేలీ నిష్క్రమించారు. అప్పటికి 41 బంతుల్లో 38 పరుగులు కావాల్సి ఉండగా, డాటిన్ (19 బంతుల్లో 27; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు ) ధాటిగా ఆడింది. గెలుపు వాకిట ఆమె బౌల్డ్ కాగా, మిగతా లాంఛనాన్ని ఆలియా అలెన్ (4 బంతుల్లో 6 నాటౌట్; 1 ఫోర్) పూర్తి చేసింది. గురువారం జరిగే తొలి సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాతో ఆస్ట్రేలియా; శుక్రవారం జరిగే రెండో సెమీఫైనల్లో న్యూజిలాండ్‌తో వెస్టిండీస్ తలపడతాయి.
Comments
Please login to add a commentAdd a comment