AB de Villiers Comments on Virat Kohli and Rohit Sharma: అంతర్జాతీయ టీ20లలో టీమిండియా స్టార్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ పునరాగమనంపై సౌతాఫ్రికా దిగ్గజ బ్యాటర్ ఏబీ డివిలియర్స్ స్పందించాడు. టీ20 ప్రపంచకప్-2024కు ముందు వారిద్దరిని జట్టులోకి రప్పించి మంచి పని చేశారంటూ సెలక్టర్ల నిర్ణయాన్ని సమర్థించాడు.
ఐసీసీ టోర్నీలలో ఇలాంటి సీనియర్ స్టార్లను ఆడించడం వల్ల జట్టుకు మేలు చేకూరుతుందని ఏబీడీ అభిప్రాయపడ్డాడు. వీరిద్దరి రాకతో యువ క్రికెటర్లు మరి కొంతకాలం వేచి చూడక తప్పదని.. అయితే.. జట్టు ప్రయోజనాల దృష్ట్యా మేనేజ్‌మెంట్ కొన్నిసార్లు కఠిన నిర్ణయాలు తీసుకోవడం సహజమేనని పేర్కొన్నాడు.
సెమీస్‌లో నిష్క్రమణ.. అనేక మార్పులు
కాగా టీ20 ప్రపంచకప్-2022 సెమీస్‌లోనే టీమిండియా నిష్క్రమించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జట్టు వైఫల్యంపై తీవ్రంగా స్పందించిన బీసీసీఐ ప్రక్షాళన చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా సెలక్షన్ కమిటీని రద్దు చేస్తూ కఠిన నిర్ణయం తీసుకుంది.
ఈ క్రమంలో అనేక తర్జనభర్జనల అనంతరం మరోసారి చేతన్ శర్మకే చీఫ్ సెలక్టర్ బాధ్యతలు అప్పగించిన బీసీసీఐ.. టీమిండియా ఆటగాళ్లపై అతడి వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో వేటు వేసింది. చర్చోపర్చల అనంతరం భారత మాజీ బౌలర్ అజిత్ అగార్కర్‌ను సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా నియమించింది.
అప్పటి నుంచే రోహిత్, కోహ్లి దూరం
సెలక్టర్ల సంగతి ఇలా ఉంటే.. ఈ టోర్నీ ముగిసిన తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి మళ్లీ ఇంతవరకు టీమిండియా తరఫున ఒక్క టీ20 కూడా ఆడలేదు. ఈ క్రమంలో 14 నెలల సుదీర్ఘ విరామం తర్వాత అఫ్గనిస్తాన్‌తో టీ20 సిరీస్ సందర్భంగా రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు.
ప్రపంచకప్-2024కు ముందు భారత్ ఆడనున్న చివరి సిరీస్ ఇదే కావడంతో వీరిద్దరి పునరాగమనం ప్రాధాన్యం సంతరించుకుంది. మెగా ఈవెంట్లో వీళ్లను ఆడించేందుకే సెలక్టర్లు ఈ నిర్ణయం తీసుకున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ నేపథ్యంలో కొంతమంది విరాహిత్ ద్వయం రాకను సౌరవ్ గంగూలీ, సునిల్ గావస్కర్ వంటి వారు స్వాగతిస్తుండగా.. మరికొందరు మాజీలు మాత్రం విమర్శిస్తున్నారు. వీరిద్దరి కారణంగా రింకూ సింగ్ వంటి యువ ఆటగాళ్లకు అవకాశాలు కరువవుతాయని పేర్కొంటున్నారు.
అందుకే వాళ్లను విమర్శిస్తున్నారు
ఈ విషయంపై ఏబీ డివిలియర్స్ స్పందిస్తూ.. ‘‘రోహిత్, కోహ్లి విషయంలో విమర్శలు ఎందుకు వస్తున్నాయో అర్థం చేసుకోగలను. ఏదేమైనా త్వరలోనే క్రికెట్ వరల్డ్‌కప్ టోర్నీ జరుగబోతోంది.
ఒకవేళ కోహ్లి ఆడేందుకు ఫిట్‌గా ఉంటే కచ్చితంగా అతడిని ఆడించాలి. వయసుతో సంబంధం లేకుండా పాత కోహ్లిని గుర్తుచేస్తూ అతడు ముందుకు సాగుతున్నాడు. 20 ఏళ్ల కుర్ర ఆటగాళ్లు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి.
35 ఏళ్ల వయసులో నాకు ఇలాంటి సపోర్టు ఉంటే
రోహిత్, విరాట్ ఉంటే టీ20 వరల్డ్‌కప్‌లో టీమిండియా గెలుస్తుందని మేనేజ్‌మెంట్ భావిస్తే కచ్చితంగా వాళ్లను ఆడిస్తుంది. నిజానికి 35 ఏళ్ల వయసులో ఉన్నపుడు నాకు కూడా మేనేజ్‌మెంట్ నుంచి ఇలాంటి మద్దతు ఉంటే ఎంతో బాగుండేది.
ఈసారి ప్రపంచకప్ టీమిండియాదే
ఏదేమైనా అఫ్గనిస్తాన్‌తో సిరీస్‌కు కోహ్లి, రోహిత్‌లను పిలిపించడం ద్వారా వాళ్లిద్దరు టీ20 ప్రపంచకప్ టోర్నీలోనూ భాగమవుతారని బీసీసీఐ తన ఉద్దేశాన్ని తెలియజేసింది. ఇది సరైన నిర్ణయం. అత్యుత్తమ ప్లేయర్లను ఆడించాలని భావించిన టీమిండియా ప్రపంచకప్ గెలిచే అవకాశం ఉంది’’ అని డివిలియర్స్ తన యూట్యూబ్ చానెల్ వేదికగా అభిప్రాయాలు పంచుకున్నాడు.
కాగా జనవరి 11 నుంచి అఫ్గన్‌తో టీమిండియా సిరీస్ ఆరంభం కానుంది. ఇక అమెరికా- వెస్టిండీస్ వేదికగా జూన్ 4 నుంచి ప్రపంచకప్-2024 నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. అంతకంటే ముందు ఐపీఎల్ 2024 రూపంలో ఆటగాళ్లకు కావాల్సినంత ప్రాక్టీస్ దొరకనుంది.
చదవండి: Ind Vs Afg: అఫ్గన్‌తో టీమిండియా సిరీస్: షెడ్యూల్, జట్లు, లైవ్ స్ట్రీమింగ్.. పూర్తి వివరాలు
Comments
Please login to add a commentAdd a comment