మహిళల టీ20 వరల్డ్‌కప్-2024లో భాగంగా బంగ్లాదేశ్‌తో నిన్న (అక్టోబర్ 10) జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్.. నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 103 పరుగులు మాత్రమే చేసింది. కెప్టెన్ నిగార్ సుల్తాన్ (39) టాప్ స్కోరర్‌గా నిలువగా.. దిలారా అక్తెర్ (19), శోభన (16), రితూ మోనీ (10) రెండంకెల స్కోర్లు చేశారు. విండీస్ బౌలర్లలో కరిష్మా రామ్హరాక్ అద్భుతంగా బౌలింగ్ చేసి (4-0-17-4) బంగ్లాదేశ్‌ను దెబ్బకొట్టింది. అఫీ ఫ్లెచర్ 2, హేలీ మాథ్యూస్ ఓ వికెట్ పడగొట్టారు.
అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన విండీస్ 12.5 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఆడుతూపాడుతూ విజయతీరాలకు చేరింది. హేలీ మాథ్యూస్ 34, స్టెఫానీ టేలర్ 27, షెమెయిన్ క్యాంప్‌బెల్ 21, డియాండ్రా డొట్టిన్ 19, చిన్నెల్ హెన్రీ 2 పరుగులు చేశారు. బంగ్లా బౌలర్లలో నహిద అక్తెర్, మరుఫా అక్తెర్ తలో వికెట్ పడగొట్టారు. ఈ గెలుపుతో వెస్టిండీస్ గ్రూప్-బి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకింది. ఈ గ్రూప్‌లో సౌతాఫ్రికా, ఇంగ్లండ్, బంగ్లాదేశ్ రెండు, మూడు, నాలుగు స్థానాల్లో ఉండగా..స్కాట్లాండ్ ఇదివరకే టోర్నీ నుంచి ఎలిమినేట్ అయ్యింది.
ఇదిలా ఉంటే, గ్రూప్-ఏలో పోటీలు అత్యంత రసవత్తరంగా సాగుతున్నాయి. ఈ గ్రూప్‌లో ఆస్ట్రేలియా టాప్‌లో ఉండగా.. భారత్, పాకిస్తాన్, న్యూజిలాండ్ ఆతర్వాతి స్థానాల్లో ఉన్నాయి. శ్రీలంక టోర్నీ నుంచి ఎలిమినేట్ అయ్యింది. ఈ గ్రూప్‌లో సెమీస్ బెర్త్‌ల కోసం నాలుగు జట్ల మధ్య పోటీ నెలకొంది. గ్రూప్ మ్యాచ్‌లు ముగిసిన అనంతరం టాప్-2లో ఉండే జట్లు సెమీస్‌కు అర్హత సాధిస్తాయి. భారత్ తమ చివరి గ్రూప్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో తలపడాల్సి ఉంది. ఈ మ్యాచ్ అక్టోబర్ 13న జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే భారత్ ఎలాంటి ఇబ్బందులు లేకుండా సెమీస్‌కు చేరవచ్చు.
చదవండి: ఇంగ్లండ్ చేతిలో ఘోర ఓటమి.. చివరి స్థానానికి పడిపోయిన పాకిస్తాన్
Comments
Please login to add a commentAdd a comment